గొంతు తడుపుకోలేని దుస్థితిలో గ్లోబల్ సిటీ - ఆర్థిక రాజధానికి అనూహ్య కష్టం
కొళాయి నీరు రాక, ఇంట్లోని బోర్లు ఎండిపోవడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. కానీ ఏలేరు నుంచి నీటి సరఫరా పడిపోవడంతో జీవీఎంసీ ట్యాంకర్ల ట్రిప్పులు గణనీయంగా తగ్గిపోయాయి.
ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో దూసుకుపోతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రధాన నగరంగా, భవిష్యత్ గ్లోబల్ సిటీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అభివృద్ధి కలలు ఒకవైపు సాగుతుంటే, మరోవైపు గుక్కెడు తాగునీటి కోసం నగర ప్రజలు పడుతున్న అష్టకష్టాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం, ఎండలు మండిపోతుండటంతో నగరంలో ఎప్పుడూ లేనట్లు సెప్టెంబరులో తాగునీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. వేసవిలో కూడా ఎదురుకాని సమస్యలు ఇప్పుడు తలెత్తడంతో నగర వాసులు మంచినీటి కోసం అల్లాడిపోతూ రోడ్డుపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు.
విశాఖ నగరంలో సుమారు 25 లక్షల జనాభా ఉన్నారు. నిత్యం తాగునీటి అవసరాల కోసం 90 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీలు), పరిశ్రమల అవసరాల కోసం మరో 45 ఎంజీడీలు కలిపి మొత్తం 135 ఎంజీడీల నీరు అవసరమవుతుంది. ఇందులో సింహభాగం (105 ఎంజీడీలు) ఏలేరు రిజర్వాయర్‌పైనే ఆధారపడినట్లుగా చెబుతున్నారు. అయితే, ఈసారి ఎల్ నినో ప్రభావం కారణంగా 50 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. దీనివల్ల నగర వాసులకు తాగునీటిని సరఫరా చేసే ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ వంటి రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. భూగర్భ జలాలు 400 అడుగుల లోతు వరకు పడిపోవడంతో బోర్ల నుంచి చుక్క నీరు పడని దుస్థితి ఏర్పడింది. దీంతో నగరంలో ఒక్కసారిగా తాగునీటి కష్టాలు ఎక్కువైనట్లు చెబుతున్నారు.
ఎండల ధాటికి ప్రధాన జలాశయాలు అడుగంటిన తరుణంలో ఏలేరు నీరే నగరానికి ఏకైక దిక్కయింది. అయితే, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని తీసుకువచ్చే క్రమంలో అధికారులు ఏలేరు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో సమస్య మరింత తీవ్రమైందని చెబుతున్నారు. కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు (కేబీఆర్) రావాల్సిన 110 ఎంజీడీల నీటికి గాను కేవలం 45 నుంచి 50 ఎంజీడీలే చేరుతుండటంతో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని పరిశీలకులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో రెండు, మూడు రోజులకు ఒకసారి కొళాయిలు వస్తుండగా, రోజూ వచ్చే ప్రాంతాల్లోనూ కేవలం 10 నుంచి 15 నిమిషాలపాటే నీరు వస్తోంది.
కొళాయి నీరు రాక, ఇంట్లోని బోర్లు ఎండిపోవడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. కానీ ఏలేరు నుంచి నీటి సరఫరా పడిపోవడంతో జీవీఎంసీ ట్యాంకర్ల ట్రిప్పులు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు అక్రమంగా భూగర్భ జలాలను తోడుతున్న ట్యాంకర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తుండటంతో ప్రత్యామ్నాయం కూడా కరువైంది. దీంతో విసిగిపోయిన నగరవాసులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. పెదవాల్తేరులో సిబ్బందిని చుట్టుముట్టడం నుంచి పీఎం పాలెం, ఎండాడ ప్రాంతాల్లో నివాసితులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు చేసే వరకు ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని చెబుతున్నారు.
గ్లోబల్ సిటీగా ఎదగాల్సిన విశాఖలో తాగునీటి కోసం ఇలాంటి దుస్థితి తలెత్తడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక నగరంలో తాగునీటి ఎద్దడిపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించించిందని అంటున్నారు. ఏలేరు కాలువ పూడికతీత పనులను ఈ నెల 20 నాటికి పూర్తి చేసి గోదావరి జలాలను సక్రమంగా అందించాలని ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. జీవీఎంసీ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుపుతున్నప్పటికీ, ప్రజల నీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోలేదని ఆవేదన వ్యక్తమవుతోంది. తాత్కాలిక సర్దుబాట్లతో కాలం వెళ్లబుచ్చకుండా, ప్రతి నివాసానికి నిరంతరం తాగునీరు అందేలా శాశ్వత ప్రణాళికలు అమలు చేయాలని, నగరవాసుల ప్రాథమిక హక్కైన తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విశాఖ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.