బొండా వైఖరిలో మార్పు.. మంత్రి పదవి కోసమే 'కాపు' ఎత్తుగడ?
కాపుల్లో అలజడి ఉందంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
కాపుల్లో అలజడి ఉందంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గుంటూరులో శనివారం మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ సభలో బొండా ఉమా మాట్లాడుతూ అధికార పార్టీని ఇరుకన పెట్టే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడే కారణమంటూ బొండా ఉమా వెల్లడించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారని అంటున్నారు. పార్టీని ఓడించిన ముద్రగడ కార్యక్రమానికి వెళ్లడమే కాకుండా, పార్టీకి బద్ద విరోధి అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ముచ్చట్లు అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయని అంటున్నారు.
టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా మెలిగే ఎమ్మెల్యే బొండా ఉమా ఒక్కసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అంతా ఉలిక్కిపడ్డారని అంటున్నారు. అంతేకాకుండా అధిష్టానాన్ని సంప్రదించకుండా విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని బొండా ప్రకటించడం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ముద్రగడ బతికినంత కాలం తెలుగుదేశం పార్టీ వ్యతిరేక అజెండాతోనే పనిచేశారని, అటువంటి నాయకుడిని ఒక టీడీపీ నేత వెనకేసుకు రావడమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. బొండా వైఖరిలో ఎందుకీ మార్పు వచ్చింది? కారణాలు ఏమైవుంటాయనేది విస్తృత చర్చగా మారింది.
సహజంగా వైసీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు కనిపించడమే అతిపెద్ద వివాదం అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అయితే గుంటూరు సభలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటిని ఆలింగనం చేసుకోవడం, ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. దీనికి కారణం ఆ సభలో బొండా మాట్లాడిన మాటలే పెద్ద మంటలకు గురిచేశాయని అంటున్నారు. ఏవిధంగా చూసినా పార్టీకి వ్యతిరేకంగానే బొండా వ్యాఖ్యలు ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాపులను టీడీపీ అర్థం చేసుకోవడం లేదనే అర్థంలో బొండా మాట్లాడారని అంటున్నారు. కాపు నేతగా ముద్రగడ సమావేశానికి వెళ్లిన బొండ ఉమా ఈ విధంగా మాట్లాడంపై మిగిలిన కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు.
ఇక సీనియర్ ఎమ్మెల్యే బొండా చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? లేక కాపు ఉద్యమ నాయకుడిగా రూపాంతరం చెందాలనే ఆలోచనతో ఉన్నారా? అనేది తెలియాల్సివుందని అంటున్నారు. గత ఏడాది అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలిపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే బొండా ఉప ముఖ్యమంత్రి పవన్ పైనా బాణాలు ఎక్కుపెట్టారని అంటున్నారు. అప్పట్లో బొండా వైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పుబట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా బొండా పెద్దగా చురుగ్గా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ నగరంలోని కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు సరైన గుర్తింపు లేదన్న భావన ఎమ్మెల్యేలోనూ పెరుగుతోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీపై తన మనోగతాన్ని తెలియజేసేందుకు ఎమ్మెల్యే బొండా కాపు నేత ముద్రగడ సంస్మరణ సభకు వాడుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ వినిపించడంతోపాటు బలమైన కాపు నేతగా తనను గుర్తించాలనే ఆలోచనను ఆయన బయటపెట్టినట్లు ఉందని అంటున్నారు. కాపు నేత రంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బొండా ఉమా టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే సానుభూతి సంపాదించారు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత తన స్థాయికి తగిన గౌరవం దక్కడం లేదనే ఆలోచనతోనే ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతోనే బొండా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే బొండా తాజా వ్యాఖ్యలపై అధిష్టానం ఇప్పటివరకు పెద్దగా సీరియస్ అయినట్లు కనిపించలేదు. కానీ, ఇదే సమయంలో వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దంటూ పార్టీ నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి ఎమ్మెల్యే బొండా ఉమ, మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిపి ఒకే వేదికపై కనిపించడమే కారణమంటున్నారు. మొత్తానికి కాపుల్లో అజలడి ఉందనే వ్యాఖ్యల ద్వారా తనలో ఉన్న అలజడిని ఎమ్మెల్యే బొండా బయటపెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు.