ల‌క్ష‌న్న‌ర జీతం ఇస్తున్నార‌ని విదేశాల‌కు వెళ్లారో.. ఆపై ఏం జ‌రుగుతుందంటే!

విదేశాలలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసి ట్రాఫికింగ్‌కు పాల్పడిన సంఘటనలు గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Update: 2026-07-26 12:30 GMT

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దారుణమైన`సైబర్ క్యాప్టివిటీ`లోకి నెడుతున్న ఒక అంతర్జాతీయ ముఠా దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రముఖ టెక్ కేంద్రాలలో ఐటీ, డిజిటల్ మార్కెటింగ్.. కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో నెలకు 1.25 లక్షల వరకు జీతం ఇస్తామని నమ్మబలుకుతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలలో టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా అమాయక యువతను లక్ష్యంగా చేసుకుని రూ. 1.2 లక్షల నుండి రూ. 1.5 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నారు.

ఈ ముఠా పన్నిన ప్లాన్ ప్రకారం... అభ్యర్థులకు పర్యాటక (టూరిస్ట్) వీసాలు ఇచ్చి మొదట బ్యాంకాక్ వంటి ప్రాంతాలకు విమానాల్లో తీసుకెళ్తున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఏజెంట్లు వారిని దొంగచాటుగా సరిహద్దులు దాటించి కంబోడియా, మ్యాన్మార్, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలాల్లో (ఎస్.ఇ.జెడ్‌లు) ఉన్న సైబర్ కాంపౌండ్లకు తరలిస్తున్నారు. అక్కడికి చేరగానే బాధితుల పాస్‌పోర్ట్‌లను గుంజుకుని.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా బంధిస్తున్నారు.

ఈ సైబర్ కాంపౌండ్లలో యువతను తీవ్ర భౌతిక, మానసిక హింసకు గురిచేస్తూ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకులను దోపిడీ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ మోసాలు, ఫిషింగ్ దాడులు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు చేయడానికి వారిని బలవంతం చేస్తున్నారు. రోజువారీ స్కామ్ టార్గెట్లను చేరుకోలేకపోయిన వారికి కరెంట్ షాక్‌లు ఇవ్వడం... చీకటి గదుల్లో బంధించి కొట్టడం.. స్వదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను బెదిరించి అదనంగా డబ్బులు వసూలు చేయడం వంటి ఘోరాలకు ఒడిగడుతున్నారు.

అదృష్టవశాత్తూ... రాష్ట్ర సీఐడీ , కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఏ), అంతర్జాతీయ రక్షణ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ల ద్వారా ఇప్పటికే ఈ సైబర్ నరకం నుండి వందలాది మంది భారతీయ బాధితులను సురక్షితంగా రక్షించి స్వదేశానికి రప్పించారు. విదేశీ ఉద్యోగ ప్రకటనలను కేవలం కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన ఇ మైగ్రేట్ పోర్టల్ ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని... ఉద్యోగాల కోసం టూరిస్ట్ వీసాలపై వెళ్లకూడదని పోలీసులు.. అధికారులు నిరుద్యోగులను గట్టిగా హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి సోషల్ మీడియా రిక్రూటర్ల విష‌యంలో అత్యంత అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఏజెన్సీ లేదా ప్రకటన కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగాలకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. యువత కేవలం అధిక జీతాల ప్రకటనలను చూసి మోసపోకుండా... చట్టబద్ధమైన మార్గాలను మాత్రమే ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గతంలో బయటపడిన టాప్ 5 హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్‌లు:

విదేశాలలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసి ట్రాఫికింగ్‌కు పాల్పడిన సంఘటనలు గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వీటిలో మొదటిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధ రిక్రూట్‌మెంట్ స్కామ్. సెక్యూరిటీ హెల్పర్ ఉద్యోగాల పేరుతో భారతీయులను తీసుకెళ్లి బలవంతంగా రష్యన్ సైన్యంలో చేర్చి యుద్ధ రంగానికి పంపిన ఘోరం ఇటీవలే వెలుగుచూసింది. రెండవది మ‌య‌న్మార్ మైవాడ్డి కేఫ్‌ స్కామ్*. థాయిలాండ్ డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఐటీ నిపుణులను మ‌య‌న్మార్ సైనిక తిరుగుబాటు ప్రాంతాలకు తరలించి సైబర్ నేరాలు చేయించారు. మూడవది కంబోడియా `ఫాస్ట్ మనీ ఫ్రాడ్`. కేవలం భారతీయులనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ యువతను హోటల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల పేరుతో పిలిపించి ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ స్కామ్‌లలో గులానీలు చేశారు.

నాలుగోది మిడిల్ ఈస్ట్ (గల్ఫ్) గృహ కార్మికుల స్కామ్.. దుబాయ్, సౌదీ అరేబియాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ విజిట్ వీసాలపై మహిళలను తీసుకెళ్లి, వారి పాస్‌పోర్టులు లాక్కుని బాండెడ్ లేబర్లుగా మార్చడం దశాబ్దాలుగా జరుగుతున్న దారుణం. ఐదవది `మలేషియా ప్రాసెస్డ్ లేబర్ స్కామ్`. ప్లాంటేషన్, ఫ్యాక్టరీ ఉద్యోగాల పేరుతో వేలాది మంది ఆసియా యువత నుండి భారీగా ఏజెంట్ ఫీజులు వసూలు చేసి.. తీరా అక్కడకు వెళ్లాక చట్టవిరుద్ధంగా బానిస పరిస్థితుల్లో పనిచేయించారు. ఈ ఐదు స్కామ్‌లు కూడా అంతర్జాతీయంగా హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లు ఎంత ప్రమాదకరంగా విస్తరించాయో స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News