ఆ దేశ కరెన్సీ నోటుపై వినాయకుని బొమ్మ !

మరి కేవలం భారతీయులు మాత్రమేనా వినాయకుడిని పూజిస్తారు అంటే ఈ ప్రపంచంలో అనేక దేశాల వారు గణ నాధుడిని అర్చిస్తారు అని చెప్పాలి. ప్రత్యేకించి ముస్లిం దేశాల వారు కూడా గణపతి ఆరాధిస్తారు అని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సి ఉంటుంది కానీ అదే నిజం.

Update: 2026-09-14 12:39 GMT

వినాయకుడు భారతీయులు ఎక్కువగా ఇష్టపడే దైవం. ఎందుకంటే ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేయాలన్నా ముందుగా గణపతి పూజతోనే మొదలెడతారు. వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయని భావిస్తారు. వినాయకుడు ప్రతీ ఇంటి ముందు ఉంచుతారు. ఆయనకు తొలి నమస్కారం చేసి బయటకు వెళ్లడం కూడా చాలా మందికి అలవాటు. అంతలా భారతీయ ఆస్థిక ఆధ్మాత్మిక జీవన విధానంలో వినాయకుడు పెనవేసుకుని పోయాడు అని చెప్పాలి. మరి కేవలం భారతీయులు మాత్రమేనా వినాయకుడిని పూజిస్తారు అంటే ఈ ప్రపంచంలో అనేక దేశాల వారు గణ నాధుడిని అర్చిస్తారు అని చెప్పాలి. ప్రత్యేకించి ముస్లిం దేశాల వారు కూడా గణపతి ఆరాధిస్తారు అని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సి ఉంటుంది కానీ అదే నిజం.

ఆ ముస్లిం దేశంలో :

ఇదిలా ఉంటే వినాయకుడిని ఏకంగా తమ దేశ కరెన్సీ మీదనే ముద్రించిన ముస్లిం దేశంగా ఇండోనేషియా ప్రపంచంలో రికార్డులకెక్కింది. అక్కడ ముస్లింలు ఎక్కువ జనాభాగా ఉంటారు. నూటికి 87 శాతం ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో వారి అధికారిక కరెన్సీ మీదే గణనాధుడు బొమ్మ ఉండడం అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప విషయంగానే చూస్తారు. ఆ దేశంలో అమలులో ఉన్న 20 వేల రూపయా కరెన్సీ నోటు మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. అంతే కాదు ఆ దేశ తొలి విద్యా శాఖ మంత్రి కి హజర్ దేవాంతర బొమ్మ కూడా ఉంటుంది. ఆ నోటు వెనక భాగంలో చూస్తే ఒక తరగతి గదిలో విద్యార్థులు చదువుకుంటున్న బొమ్మ ఉంటుంది.

వినాయక బొమ్మ వెనక :

మరి ముస్లిం జనాభాతో ఉన్న ఇండోనేషియా కరెన్సీ మీద గణపతి బొమ్మ ఎందుకు వచ్చింది అంటే దానికి సంబంధించిన సమాచారం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ దేశస్థులు గణపతిని విద్యకు, జ్ఞానానికి బుద్ధికి అధిపతిగా భావిస్తారు. అందుకే విద్యా వ్యవస్థకు ఆయన బొమ్మను గౌరవంగా ఉంచుతారు. విద్యకు ప్రతిరూపంగా కూడా గణపతిని వారు గట్టిగా నమ్ముతారు. ఇదే కాదు ఇండోనేషియా దేశం కల్చర్ మీద భారతీయ సంస్కృతి ప్రభావం గణనీయంగా ఉంది. రామాయణం మహా భారతాల గురించి అక్కడ దేశ ప్రజలకు ఎక్కువగా తెలుసు. వారి మీద ఆ ప్రభావం ఉంది. ఇక దీనితో పాటు 1990 వ దశాబ్దంలో ఇండోనేషియా తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో ఆసియాలోని ఇతర దేశాల కరెన్సీల విలువ బాగా పడిపోయింది. అయితే తమ దేశంలో మాత్రం కరెన్సీ విలువ అలాగే స్థిరంగా ఉండాలని విశ్వాసం ఉంచి మరీ విఘ్న నివారకుడు గణపతి బొమ్మను తయారు చేసి మరీ అక్కడ కరెన్సీ నోటును విడుదల చేశారని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇదన్న మాట సంగతి.

అనేక దేశాలలో :

కేవలం భారత్ లోనే కాదు ఇతర దేశాలలో కూడా గణపతిని ఎంతో భక్తిగా పూజిస్తారు. గణపతికి ప్రాంతాలు దేశాలు మతాలు ఇవేమీ అడ్డు కావు అని నిరూపించే విధంగా అనేక ప్రాంతాలలో పూజలు అందుకుంటున్నాడు. జపాన్ లో కూడా షింగోన్ బౌద్ధమతంలో వినాయకుడిని కాంగిటెన్ గా షోటెన్ అలాగే గణబచి అని పిలుస్తారు. ఇక జపాన్‌లో వినాయకుడిని అంతా అదృష్టానికి వ్యాపార పురోగతికి దోహదపడే దేవుడిగా భారిస్తారు. అంతే కాదు జంటల మధ్య ప్రేమానురాగాలను పెంచే దేవుడిగానూ కొలవడం విశేషం. ఇక జపాన్ లోని కొన్ని దేవాలయాల్లో రెండు వినాయక రూపాలు ఒకదానికొకటి కౌగిలించుకున్నట్లుగా విగ్రహాలు ఉండడం విశేషం. జపాన్ లో వినాయకుడికి తెల్ల ముల్లంగితో పాటు బియ్యం పిండితో చేసిన తీపి వంటకాలని భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారని చెబుతార్రు.

అక్కడ మరో పేరుతో :

అంతే కాదు థాయిలాండ్‌లో వినాయకుడిని ఫ్రా ఫికానెట్ అని పిలుస్తారు. ఈ దేశంలో అక్కడ గణపతిని కళలు సంగీతం నాట్యం విద్యకు అధిపతిగా భావిస్తారు. అంతే కాదు ఏదైనా కొత్త సినిమా ప్రారంభం అయినా లేదా నాటకం వ్యాపారం లేదా నిర్మాణం ఏది కొత్తగా ప్రారంభించినా ముందుగా థాయిలాండ్‌ ప్రజలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడం విశేషం. ఇక థాయిలాండ్‌లోని చాచోఎంగ్సారొ ప్రావిన్స్‌లో 39 మీటర్లలో అంటే దాదాపుగా 128 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహం ఉండడం విశేషం. దీనిని కాంస్యంతో తయారు చేశారు. ఈ విగహం నిలువెత్తు భంగిమలో ఉంటుంది. అంతే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద వినాయక విగ్రహాలలో ఇది ఒకటిగా భావిస్తారు. అదే విధంగా నేపాల్‌లోని కాఠ్‌మాండ్ లోయలో గణపతికి సూర్య వినాయక్ కార్యా వినాయక్ జల వినాయక్ అశోక్ వినాయక్ పేరుతో నాలుగు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఈ దేశస్థులు వినాయకుడిని నగర రక్షకుడిగా ఆరాధిస్తారు. నేపాల్‌లో 16 చేతులతో ఉన్న హేరంబ గణపతి రూపానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది.

గణపతి ఆరాధన :

ఇక టిబెటన్ బౌద్ధమతంలో గణపతిని మహారక్త గణపతి అని త్సోగ్ గి డాగ్పో అని పిలుస్తారని చెబుతారు. టిబెట్‌లో గణేషుడిని అడ్డంకులను తొలగించే శక్తివంతమైన సంరక్షకుడిగా చూస్తారు. అలాగే ఆయన్ని పూజిస్తే సంపదను ఇస్తారని కూడా నమ్ముతారు. ఇక బౌద్ధ సన్యాసులు తమ సాధన సఫలం కావడానికి గణపతి మంత్రాలను జపిస్తారు. మలేషియా మారిషస్, సింగపూర్ దేశాలలో కూడా వినాయక చవితి వేళ అక్కడి ప్రభుత్వాలు అధికారికంగానే సెలవు ప్రకటిస్తారు. ఇక శ్రీలంకలో తమిళులతో పాటు సింహళ బౌద్ధులు కూడా తమ ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు పిళ్లయార్ అనే పేరుతో పూజించేది వినాయకుడినే. మొత్తం మీద చూస్తే వినాయకుడు ప్రపంచ దేవుడు అన్న మాట.

Tags:    

Similar News