స్టార్ హీరో మేనేజ‌ర్ అనుమానాస్ప‌ద మృతి.. MLA పైనా CBI ద‌ర్యాప్తు!

ముంబై పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ కేసులో సామూహిక హ‌త్యాచారం నేరాన్ని మోపుతూ ప‌లువురిపై ఎఫ్‌.ఐ.ఆర్ దాఖ‌ల‌వ్వ‌డం పెద్ద ట్విస్ట్.

Update: 2026-09-14 12:39 GMT

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె మరణంపై తొలి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా.. తాజాగా ఈ కేసులో సీబీఐ (CBI) ఎంట్రీ ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబై పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ కేసులో ప‌లువురిపై ఎఫ్‌.ఐ.ఆర్ దాఖ‌ల‌వ్వ‌డం పెద్ద ట్విస్ట్. ఆమేకు ఎన్డీటీవీ త‌న క‌థ‌నంలో సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది.

బాంబే హైకోర్టు సెప్టెంబర్ 2వ తేదీన ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి సోమవారం అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దిశా సాలియన్ మృతి చెంది ఆరేళ్లవుతున్నా.. ఇప్పటివరకు ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసుల దర్యాప్తులో స్పష్టమైన లొసుగులు ఉన్నాయని.. పోస్టుమార్టం రిపోర్ట్‌ను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదని కోర్టు ఎత్తిచూపింది.

తాజాగా నమోదు చేసిన సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన పేర్లు చేర‌డం ముంబైలో హాట్ టాపిగ్గా మారింది. శివసేన (UBT) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాకరే, ప్రముఖ నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. హత్య.. నేరపూరిత కుట్ర.. సాక్ష్యాలను ధ్వంసం చేయడం .. తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.

దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ గతంలో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురిని హత్య చేశారని.. అప్పట్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. ఆయన కుమారుడు ఆదిత్య థాకరే .. పలువురు ఈ కుట్రలో భాగస్వామ్యులై కేసును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. భవంతి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని అప్పట్లో పోలీసులు చెప్పినా మృతదేహం పడిన తీరు అనేక అనుమానాలకు తావిచ్చిందని రిపబ్లిక్ టీవీ వంటి మీడియా సంస్థలు కూడా తీవ్ర కథనాలు వెలువరించాయి.

ఆరేళ్ల పాటు క‌ద‌ల‌క లేకుండా ఉన్న ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఇప్పుడు ఏ నిజాలను వెలుగులోకి తీసుకురానుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆలస్యంగా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. కేసు పత్రాలను తారుమారు చేసిన అధికారుల పాత్రపై కూడా విచారణ జరగనుంది. ఈ హైప్రొఫైల్ కేసులో మునుముందు రోజుల్లో ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.

దిశా సాలియ‌న్ ఎలా మ‌ర‌ణించారు?

2020 జూన్ 8 రాత్రి ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ (28) ఒక అపార్ట్‌మెంట్ భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. అప్పట్లో ముంబై పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్యగా భావించి యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) నమోదు చేసి కేసును ముగించారు. అయితే లేడీ మేనేజ‌ర్ మరణం వెనుక అనుమానాలున్నాయని.. అది హత్య అని ఆమె తండ్రి సతీష్ సాలియన్ కోర్టును ఆశ్రయించడంతో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆ తర్వాత కేవలం ఆరు రోజులకే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా మరణించడంతో ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందనే అనుమానాలు... రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ముంబై పోలీసుల దర్యాప్తు తీరుపై లొసుగులు ఉన్నాయని బాంబే హైకోర్టు తప్పుపట్టడంతో తాజాగా దిశా సాలియ‌న్ మ‌ర‌ణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సంచలన ఆదేశాలు వెలువడ్డాయి.

Tags:    

Similar News