చెప్తున్నా వినరే.. సూటూ బూటూ వద్దు.. సింపుల్ గా ఇంటర్వ్యూలకు వచ్చేయండి..
2026 అక్టోబర్ నుంచి జరిగే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలకు సూట్లు వేసుకొస్తే గేటు బయటే ఆపేస్తారట.. నిశ్చింతగా జీన్స్, కాటన్ ప్యాంట్లు, హాయిగా ఉండే స్నీకర్స్ వేసుకొని రమ్మని పిలుపునిచ్చింది.
దశాబ్దాలుగా ఉద్యోగ ఇంటర్వ్యూ అనగానే మనకి గుర్తుచేసేది ఒక్కటే.. గొంతు నులిమే టై, నిప్పులు కక్కే ఎండలోనూ ఒంటికి చుట్టుకునే నల్లటి సూట్... నడిస్తే బిల్డింగ్ అదిరిపోయేలా సౌండ్ చేసే గట్టి డ్రెస్ షూస్. అయితే దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ "కారమ్ బోర్డు" మార్కు ఫార్మలిజానికి గట్టి షాకే ఇచ్చింది. 2026 అక్టోబర్ నుంచి జరిగే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలకు సూట్లు వేసుకొస్తే గేటు బయటే ఆపేస్తారట.. నిశ్చింతగా జీన్స్, కాటన్ ప్యాంట్లు, హాయిగా ఉండే స్నీకర్స్ వేసుకొని రమ్మని పిలుపునిచ్చింది.
ఈ నిర్ణయం వెనుక అధికారులు చెప్పిన సెంటిమెంట్ వింటే మన కళ్లు చెమర్చడం ఖాయం. అభ్యర్థులపై ఉండే ఆర్థిక, మానసిక ఒత్తిడిని తగ్గించడానికే ఈ విప్లవాత్మక అడుగు అట.. పైగా ఫార్మల్ షూస్ వేసుకొని ఇంటర్వ్యూ రూమ్‌లోకి వస్తుంటే ఆ "టక్ టక్" శబ్దాలకి ఇంటర్వ్యూయర్ల దృష్టి భంగం కలుగుతోందట. ఆ సౌండ్ కే భయపడి మార్కులు తగ్గించేస్తున్నారేమో అన్న అనుమానంతో.. షూస్‌పై 'స్లిప్-ఆన్ కవర్లు' తొడగాలని లేదా హాయిగా స్నీకర్లు వేసుకోవాలని సూచించారు. ఇక పొరపాటున ఎవరైనా ‘బోస్‌మానం’ అనుకొని టై కట్టుకొస్తే.. రూమ్‌లోకి వెళ్లే ముందే దాన్ని జేబులో దాచుకోవాల్సిందే!
అయితే అధికారుల ఉత్సాహం ఇక్కడితో ఆగలేదు. "అబ్బా క్యాజువల్స్ అన్నారు కదా" అని షార్ట్స్, స్లీవ్‌లెస్, నైట్ ప్యాంట్లు వేసుకొస్తారేమోనన్న భయంతో, "ఇదిగోండి బాస్.. ఇంటర్వ్యూ క్యాజువల్ అంటే ఇలా ఉండాలి" అంటూ ఏఐ తో కొన్ని డిజైనర్ చిత్రాలు కూడా తయారు చేసి మరీ పంపించారు. అంటే ఫార్మాలిటీ బానిసత్వం నుంచి విముక్తి పొందే క్రమంలో ఇప్పుడు ఏఐ గీసిన గీత దాటకుండా దుస్తులు వెతుక్కోవాలన్నమాట.
సోషల్ మీడియాలో మాత్రం ఈ నిర్ణయంపై భిన్నమైన రచ్చ నడుస్తోంది. "ఒక్క ఇంటర్వ్యూ కోసం వేల రూపాయలు తగలేసి సూట్లు కొనక్కర్లేదు, బ్రతికిపోయాంరా దేవుడా" అని కొందరు సంబరపడుతుంటే.. "అయ్యా నాయనో ఫార్మల్ సూట్ అయితే ఒకేలా ఉండేది. ఇప్పుడు 'తగినంత క్యాజువల్' అంటే ఏంటి? నా జీన్స్ కలర్ ఇంటర్వ్యూయర్‌కి నచ్చకపోతే పరిస్థితి ఏంటి?" అని అభ్యర్థులు కొత్త గందరగోళంలో పడ్డారు.
పాపం ఇంటర్వ్యూ చేసే అధికారులకు కూడా ఈ జీన్స్ నిబంధనలు వర్తిస్తాయట.. ఏది ఏమైనా బట్టల మెరుపులు చూసి కాకుండా అభ్యర్థి బుర్రలోని గుజ్జును చూసి ఉద్యోగం ఇస్తామని కొరియా ప్రభుత్వం చెప్పడం మెచ్చుకోదగిన విషయమే. కాకపోతే రేపు ఇంటర్వ్యూలో "మీ ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ మీ స్నీకర్స్ కలర్ మరీ క్యాజువల్ గా ఉందేంటి?" అని రిజెక్ట్ చేయకపోతే అదే పదివేలు