దేశ‌వ్యాప్తంగా 'సేవా సంక‌ల్ప్‌' విష‌యం ఏంటంటే!

దేశ‌వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు 'సేవా సంక‌ల్ప్' పేరుతో బీజేపీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నుంది.

Update: 2026-09-14 23:30 GMT

దేశ‌వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు 'సేవా సంక‌ల్ప్' పేరుతో బీజేపీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నుంది. ముఖ్యంగా తెలంగాణ స‌హా.. ఈ ఏడాది చివ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏడు రాష్ట్రాల్లో సేవా సంక‌ల్ప్‌ను మ‌రింత విస్తృతంగా చేయ‌నున్నారు. ఇంటింటికీ బీజేపీ కార్య‌క‌ర్త‌లు వెళ్ల‌నున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకోనున్నారు. వారికి బీజేపీ కేంద్రంలో చేస్తున్న పాల‌న‌.. ముఖ్యంగా న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత వ‌చ్చిన మార్పుల‌ను వివ‌రించ‌నున్నారు. త‌ద్వారా బీజేపీ ఓటు బ్యాంకును మ‌రింత పటిష్టం చేయ‌నున్నారు.

ఏంటిది?

ఈ నెల 17వ తేదీన ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. దేశ‌వ్యాప్తంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. అప్ప‌టి నుంచి ఈ పుట్టిన రోజును `సేవా సంక‌ల్ప్‌` పేరుతో ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. సేవ‌కు ప్ర‌ధాని మోడీ ప్ర‌తిరూప‌మ‌ని, ప్ర‌జ‌ల మ‌న‌సెరిగి ఆయ‌న మ‌సులు కుంటున్నార‌ని.. దేశాన్ని పురోభివృద్ధి పెడుతున్నార‌ని చెప్ప‌డ‌మే ఈ కార్యక్ర‌మం కీల‌క ల‌క్ష్యం. అంతేకాదు.. భ‌విష్య త్‌లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కూడా ఈ సేవా సంక‌ల్ప్‌ను బీజేపీ వినియోగించుకుంటోంది.

ఏడాది మ‌రింత ముఖ్యం..

ఈ ఏడాది కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి వ‌రుస దెబ్బ‌లు త‌గిలాయి. ప్ర‌ధానంగా నీట్ ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వాన్ని ఒక ద‌శ‌లో కుదిపేసింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఉద్య‌మం చేప‌ట్టిన ద‌రిమిలా.. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించాల్సి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో అమెరికా నుంచి ఎదుర‌వుతున్న సుంకాల బెడ‌ద కూడా స‌ర్కారును తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. పైగా గ‌తానికి భిన్నంగా.. ఈ సారి కేంద్రంపై మ‌రింత ఒత్తిడి ఎదురైంది. దీనికితోడు ఈ ఏడాది.. ఏడు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో సేవాసంక‌ల్ప్ ద్వారా మోడీని మ‌రింత ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చి.. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిచే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఏం చేస్తారు?

సేవా సంక‌ల్ప్ కార్య‌క్ర‌మంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా బీజేపీ నాయ‌కులు, కేంద్ర మంత్రులు, కార్య‌క‌ర్త‌లు.. ప్ర‌తి ఇంటి త‌లుపు త‌డ‌తారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ప‌నుల‌ను వివ‌రిస్తారు. అలాగే.. దేశ భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ విష‌యంలో తీసుకుంటున్న విధానాలు.. రాజ‌కీయంగా బ‌లోపేతం చేసే అంశాల‌పై వివ‌రించ‌నున్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఏడు రాష్ట్రాల్లో కూడా ఈ సేవా సంక‌ల్ప్ కార్య‌క్ర‌మం ఊపందుకోనుంది. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు.. బీజేపీ దిశానిర్దేశం చేసింది.

Tags:    

Similar News