లోక్‌సభకు పేపర్‌ లీకేజీ బిల్లు...డ్యూటీలోకి దిగిన కొత్త మంత్రి !

కేంద్ర ప్రభుత్వం జాతీయ పరీక్షల విషయంలో మరింత నిబద్ధతతో వ్యవహరించనుంది. తన చిత్తశుద్ధిని చాటుకునే క్రమంలో అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకుని రాబోతోంది.

Update: 2026-07-26 12:47 GMT

కేంద్ర ప్రభుత్వం జాతీయ పరీక్షల విషయంలో మరింత నిబద్ధతతో వ్యవహరించనుంది. తన చిత్తశుద్ధిని చాటుకునే క్రమంలో అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకుని రాబోతోంది. జాతీయ పరీక్షలు నిర్వహించేటప్పుడు పేపర్ లీకేజి కనుక జరిగితే ఏమి చేయాలన్నది కూడా ఈ ప్రతిపాదిత బిల్లులో పొందుపరిచారు. అంతే కాదు నేరం రుజువు అయితే వేసే శిక్షలు కూడా గట్టిగా ఉండబోతున్నాయి. ఈ ప్రతిపాదిత బిల్లులో పేపర్ లీకేజిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించడం విశేషం. అంటే ఒక టీం వర్క్ గా కొందరు కలసి చేస్తూ లక్షలాది మంది అమాయక విద్యార్ధుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు.

భారీగానే జరీమానా :

ఇదిలా ఉంటే పేపర్ లీకేజి కనుక చేసినట్లుగా రుజువు అయితే నిందితులకు 10 కోట్ల రూపాయల దాకా భారీ జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్షను కూడా అమలు చేయాలని ఈ బిల్లులో పెట్టారు. అలాగే తప్పు చేస్తే సర్వీస్ ప్రొవైడర్ల పైన కూడా ఎనిమిదేళ్ళ పాటు నిషేధం విధిసారు. వాటి మీద అయిదు కోట్ల రూపాయల భారీ జరీమానాను విధిస్తారు.

రెండు నెలల్లోనే కేసు దర్యాప్తు పూర్తి :

అదే విధంగా ఈ కేసులకు సంబంధించి త్వరగా తీర్పులు రావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా రోజు వారీ విచారణతో మూడు నెలలలోనే తీర్పు వచ్చేలా చట్టంలో పొందుపరుస్తున్నారు. ఇల్లా అన్ని విధాలుగా పకడబంధీగా రూపొందించిన ఈ బిల్లుని శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. ఇక శనివారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోమవారం ఈ బిల్లు లోక్ సభ ముందుకు వెళ్ళబోతోంది. అన్ని రాజకీయ పార్టీలు పేపర్ లీకేజీల పట్ల పూర్తిగా ఆగ్రహంగా ఉన్నందువల్ల ఈ బిల్లు నూరు శాతం మద్దతుతో ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు.

కొత్త మంత్రి బాధ్యతల స్వీకరణ :

మరో వైపు చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్త విద్యా మంత్రిగా అదనపు బాధ్యతలు అందుకున్న ప్రహ్లాద్ జోషి ఆదివారం కర్తవ్య భవన్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అధికారికంగా తన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ శాఖ పునరుత్పాదక ఇంధన శాఖల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా మంత్రి విద్యా శాఖకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా శాఖలో అమలూవుతున్న వివిధ పథకాలు ఇతర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి కూడా పాల్గొన్నారు.

ఆయనకే విద్యా శాఖ ఎందుకు :

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక ప్రహ్లాద్ జోషీకే విద్యా శాఖ ఎందుకు ప్రధాని కట్టబెట్టారు అంటే అది ఆయన పట్ల బీజేపీ పెద్దలకు ఉన్న నమ్మకం అని అంటున్నారు. ఓటమి అన్నది లేకుండా వరుసగా అయిదు సార్లు ప్రహ్లాద్ జోషీ గెలుస్తూ వస్తున్నారు. ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచి ధార్వాడ్ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఆ ప్రాంతంలో తన బలమైన రాజకీయ ఆధిపత్యాన్ని ప్రహ్లాద్ జోషీ కొనసాగిస్తున్నారు.

ముందున్న సవాళ్ళు :

ఆయన విద్యా శాఖ మంత్రిగా ఎన్నో సవాళ్ళను ఇపుడు భుజానికి ఎత్తుకోనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజి కారణంగా ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం తొందరలో అందచేయాల్సి ఉంది. అలాగే జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్ధులపైన జరిగిన పోలీసు దాడి ఆ మీదట దాఖలు అయిన ఎఫ్ఐఆర్ లను పోలీసు కేసులను ఎత్తివేయాల్సి ఉంది. ముందుగా దేశంలో విద్యార్ధుల విశ్వాసాన్ని తిరిగి పొందాల్సి ఉంది. లీకేజీలు అన్నది ఇపుడున్న టెక్నాలజీ తో చాలా ఇబ్బందిగా మారుతున్న తరుణంలో వాటిని పూర్తిగా అరికట్టడం ఆయన ముందున్న అతి పెద్ద బాధ్యత. మొత్తం మీద చూసెత ప్రహ్లాద్ జోషీ తన సమర్థతతో ఇవన్నీ అధిగమిస్తారు అని అంటున్నారు. ఒక ఆయన సోమవారం పార్లమెంట్ లో లీకేజి నియంత్రణ బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా విద్యా మంత్రిగా కొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారు.

Tags:    

Similar News