కాంగ్రెస్ హైకమాండుకు తలొగ్గిన కొండా? నాటి వ్యాఖ్యలపై రెండోసారి వివరణ
గతంలో గాంధీభవన్ లో నిర్వహించిన విచారణకు హాజరైన కొండా మురళి.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోగా, పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది.;
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వెనక్కి తగ్గారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొండా పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు మరోసారి వివరణ ఇచ్చారు. రెండు నెలల క్రితం పార్టీ అగ్రనేత రాహుల్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను అవమానించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే నాయిని రాజేంద్రరెడ్డి నివాసంలో నలుగురు ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు సీనియర్ నేతలు సమావేశమై, అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే ఓ సారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా, తాజాగా రెండో సారి వివరణ ఇచ్చుకున్నారు.
హైకమాండ్ అసంతృప్తి?
గతంలో గాంధీభవన్ లో నిర్వహించిన విచారణకు హాజరైన కొండా మురళి.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోగా, పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన వివరణపై పార్టీ హైకమాండ్ సంతృప్తి చెందలేదని అంటున్నారు. దీంతో ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి నోటీసులిచ్చింది. అంతేకాకుండా లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.
లిఖితపూర్వక వివరణ
తన వివరణపై హైకమాండ్ సంతృప్తి చెందకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ కొండా కాస్త వెనక్కి తగ్గారని అంటున్నారు. పార్టీ ఆదేశాల మేరకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ఆయన సతీమణి మంత్రి కొండా సురేఖ తీరుతో కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుంటుందని అంటున్నారు. ఈ ఇద్దరూ పార్టీలో మిగిలిన వారిని కలుపుకుని వెళ్లకపోవడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
కాంగ్రెస్ పెద్దల టెన్షన్
స్థానిక ఎన్నికల ముందు పార్టీలో ఈ పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లను సంతృప్తిపరిచేందుకు కొండాను రెండోసారి విచారణకు పిలిపించినట్లు చెబుతున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యేలు కొంత శాంతించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు కొండా కూడా పరిస్థితి గమనించి వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. గత విచారణ సమయంలో తగ్గేదేలే అన్న ప్రకటన చేసిన ఆయన ఇప్పుడు కాస్త కూల్ గా ఉన్నారని అంటున్నారు.