పవన్ మూవీపై వైసీపీ నేత అంబటి విశ్లేషణ.. హీరోగా హిట్, కానీ..?

కానీ, అంబటి అందరి లాంటి సాధారణ ఎనలిస్టు కాదు. ఆయన సీనియర్ పొలిటీషియన్. కనుక ఆయన విశ్లేషణపై అంతా ఆసక్తి చూపారు.;

Update: 2025-07-24 14:03 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదలైన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో అటు అభిమానులతోపాటు ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం హరిహర వీరమల్లు కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ మూవీని థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు కూడా ఎగబడ్డారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాయి.

ఇక సినిమా థియేటర్‌లలోకి వచ్చాక విమర్శకుల వంతు వచ్చింది. సహజంగా ఎవరి సినిమా రిలీజు అయినా జర్నలిస్టులు, సినీ విమర్శకులు రివ్యూలు రాస్తుంటారు. అయితే హరిహర వీర మల్లుపై విశ్లేషకులు తమకు తోచిన విధంగా రివ్యూలు రాస్తుండగా, వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా తన అభిప్రాయం చెబుతూ యూట్యూబ్ లో వీడియో చేశారు. అందరిలా తాను కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూచినట్లు చెప్పిన అంబటి పలు విషయాలపై సమగ్రంగా మాట్లాడారు.

వాస్తవానికి ఎవరైనా సినిమాపై రివ్యూ చెప్పాలంటే ఆ సినిమా లోటుపాట్లపై వ్యాఖ్యానిస్తారు. తాము గమనించిన విషయాలను ప్రస్తావిస్తూ సినిమా చిత్రీకరణలో మంచిచెడ్డలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. కానీ, అంబటి అందరి లాంటి సాధారణ ఎనలిస్టు కాదు. ఆయన సీనియర్ పొలిటీషియన్. కనుక ఆయన విశ్లేషణపై అంతా ఆసక్తి చూపారు. అయితే అంబటి కూడా సినిమా చిత్రీకరణలో లోటుపాట్లను ప్రస్తావించి ఎప్పటి నుంచో హరిహర వీరమల్లు సినిమాపై తాను ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. సినిమా నిర్మాణంలో నిర్మాత సాదక బాధలతోపాటు దర్శకులు మార్పు కూడా సినిమా చిత్రీకరణపై ప్రభావం చూపిందని విశ్లేషించారు. అయితే కథాంశం జోలికి వెళ్లని అంబటి.. తాను మెగా కుటుంబం బాగుండాలని కోరుకుంటున్న వాడిలో ఒకడినని తెలిపారు. ఎందుకంటే మెగా కుటుంబం కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని తన వాదనను సమర్థించుకున్నారు.

అదే సమయంలో చిత్ర కథానాయకుడు సినిమా రంగంలో హిట్ అయ్యాడని, కానీ రాజకీయంగా ఆయన విఫలమయ్యాడని వ్యాఖ్యానించారు. పవన్ ఒక్కడే కాదని ఆయన సోదరుడు చిరంజీవి కూడా రాజకీయంగా విఫలమవడంపై అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక సినిమా కోసం చాలా డబ్బు వెచ్చించారని, రెండు ప్రభుత్వాలు కూడా ధరలు పెంపు నిర్ణయం తీసుకోవడం దురదృష్టికరమని చెప్పారు. పుష్ప రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఘటనను పరిగణలోకి తీసుకుని తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ పవన్ సినిమా విషయంలో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై అంబటి విస్మయం వ్యక్తం చేశారు. అదేవిధంగా పవన్ సినిమాకు ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ ను ఆర్థికంగా ఆదుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా మాత్రం ప్లాప్ అంటూ తన వీడియో ముగించారు అంబటి. ఇక చివరగా పవన్ నటిస్తున్న సినిమాల్లో ఇంకో రెండు విడుదల కావాల్సివుందని, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వీలైనంత తొందరగా చిత్రీకరణ పూర్తి చేసుకోవాలని అంబటి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News