సూర్య నమస్కారాలతో మరో రికార్డు.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. సామూహిక యోగాలో సూరత్ నగర వాసులు నెలకొల్పిన గిన్నీస్ రికార్డును అధిగమించేలా విశాఖలో కార్యక్రమం నిర్వహించింది.;

Update: 2025-06-21 05:16 GMT

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. సామూహిక యోగాలో సూరత్ నగర వాసులు నెలకొల్పిన గిన్నీస్ రికార్డును అధిగమించేలా విశాఖలో కార్యక్రమం నిర్వహించింది. అదే సమయంలో 108 సూర్య నమస్కారాలతో మరో గిన్నీస్ రికార్డును కూడా ఏపీ సొంతం చేసుకుంది. ఒకే రోజు రెండు రికార్డులు సాధించేలా కార్యక్రమాన్ని రూపొందించిన ఏపీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ వేదికగా యోగాలో ఒక గిన్నీస్ రికార్డు.. అదే నగరంలో సూర్య నమస్కారాలతో గిరిజన విద్యార్థులు మరో రికార్డు నెలకొల్పారు. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అల్లూరి జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25 వేల మంది విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు వేశారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇంతమందితో ఈ కార్యక్రమం నిర్వహించలేదు. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్సు ప్రతినిధులు 108 నిమిషాల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అరుదైన రికార్డుగా పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించగా, వరల్డ్ రికార్డు పత్రాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం ప్రదానం చేశారు. అడవి బిడ్డలు నెలకొల్పిన ఈ అరుదైన రికార్డును కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ కొనియాడారు. ప్రపంచ రికార్డు సృష్టించడం ద్వారా దేశ గౌరవాన్ని పెంపొందించారని విద్యార్థులను అభినందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25 వేల మంది ఏకధాటిగా సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని మంత్రి నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రతి విద్యార్థి ఇలా అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సాధ్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకువచ్చేలా విద్యార్థులు నడుచుకోవాలని సూచించారు. మైదాన ప్రాంత విద్యార్థులు ఆదివాసీ విద్యార్థుల నుంచి నేర్చుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News