టాలీవుడ్‌లో జోరుమీదున్న టాప్ -5 అగ్ర నిర్మాణ సంస్థలు
తెలుగు చిత్రసీమ (టాలీవుడ్) ప్రస్తుతం స్వర్ణయుగాన్ని ఆస్వాధిస్తోంది. ఒకప్పుడు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన సినిమాలు.. నేడు పాన్-ఇండియా స్థాయి దాటి గ్లోబల్ మార్కెట్‌లో జెండా పాతాయి.
తెలుగు చిత్రసీమ (టాలీవుడ్) ప్రస్తుతం స్వర్ణయుగాన్ని ఆస్వాధిస్తోంది. ఒకప్పుడు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన సినిమాలు.. నేడు పాన్-ఇండియా స్థాయి దాటి గ్లోబల్ మార్కెట్‌లో జెండా పాతాయి. ఈ అపూర్వ విజయం వెనుక దర్శకులు, హీరోల కష్టం ఎంత ఉందో... అంతే స్థాయిలో భారీ పెట్టుబడులు పెడుతూ... పక్కా ప్రణాళికతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థల పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా `తెలుగు ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్` లో కీలక సభ్యులుగా ఉన్న ఐదు ప్రధాన బ్యానర్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో నిరంతరం సినిమాలు తీస్తూ పరిశ్రమను ముందుండి నడిపిస్తున్నాయి.
ఈ జాబితాలో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు దిల్ రాజు, శిరీష్‌లకు చెందిన `శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్`(SVC). పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న దిల్ రాజు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిత్రాలతో ప్రయాణం ప్రారంభించి.. నేడు గేమ్ ఛేంజింగ్ అనిపించే భారీ బడ్జెట్ సినిమాలను ఈ బ్యానర్ నిర్మిస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్ట్‌లు చేస్తూనే.. మరోవైపు కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ నిరంతరం సెట్స్‌పై సినిమాలు ఉంచడం దిల్ రాజు ప్రత్యేకత. ఆయన టాలీవుడ్ లో అందరు అగ్రహీరోలతో సినిమాలు చేస్తూనే, కోలీవుడ్ స్టార్లతో అలాగే బాలీవుడ్ లో అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించడంలోను బిజీగా ఉన్నారు. విభిన్నమైన మార్కెట్లలో సత్తా చాటాలనే పట్టుదలతో దూసుకెళుతున్నారు.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా `మైత్రీ మూవీ మేకర్స్` జోరు గురించి చెప్పాల్సిన పని లేదు. నిరంతరం అరడజను ప్రాజెక్టులను క్యూలో ఉంచే నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ రేసులో ఉంది. `పుష్ప` సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం అత్యధిక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా టాలీవుడ్ లోని అందరు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న ట్రాక్ రికార్డ్ మైత్రి మూవీ మేకర్స్ కి ఉంది.
అలాగే సూర్యదేవర నాగవంశీ సారథ్యంలో దూసుకుపోతున్న `హారిక అండ్ హాసిని క్రియేషన్స్` - `సితార ఎంటర్‌టైన్‌మెంట్స్` బ్యానర్లు గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సృజనాత్మక మద్దతుతో ఈ సంస్థ టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచింది. హారిక అండ్ హాసిని బ్యానర్‌పై అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు తీస్తూనే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా యంగ్ హీరోలతో... విభిన్న కథాంశాలతో ఏడాదికి అరడజనుకు పైగా చిత్రాలను బాక్సాఫీస్ ముందుకు తీసుకువస్తూ గిల్డ్‌లో అత్యంత యాక్టివ్ సభ్యుడిగా నాగవంశీ పేరు తెచ్చుకున్నారు.
మరో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ విభిన్న రంగాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోంది. అల్లు అర్జున్ తో గీతా ఆర్ట్స్ భారీ సినిమాలను నిర్మిస్తోంది. అయితే జీఏ 2 బ్యానర్ లో ప్రతిభావంతులైన యువహీరోలు, దర్శకులను ప్రోత్సహిస్తోంది. వీరితో పరిమిత బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంది ఈ అగ్రనిర్మాణ సంస్థ. మరో పెద్ద సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలి కాలంలో పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించడంలో వెనకబడింది. కేవలం సొంత హీరోలతో మాత్రమే సినిమాలను నిర్మిస్తోంది. వెంకటేష్, రానాలతో సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు నిర్మిస్తోంది. సెలక్టివ్ గా ప్రతిభావంతులైన యువహీరోలు, దర్శకులతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తోంది. అయితే పై రెండు బడా సంస్థలు ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోను ఉన్నాయి. స్టూడియోల రంగంలో సురేష్ బాబుకు సుదీర్ఘ అనుభవం ఉంది. అల్లు అరవింద్ కూడా హైదరాబాద్ ఔటర్ లో సకల సౌకర్యాలతో సొంత స్టూడియోని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీ కోసం నిరంతరం ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తూ, షోలపైనా పెట్టుబడులు పెడుతూ ఉపాధి కల్పించడంలో బాస్ అరవింద్ పేరు తెచ్చుకుంటున్నారు.
సునీల్ నారంగ్ (ఏషియన్ నారంగ్స్) సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి... నైజాం ప్రాంతంలో అతిపెద్ద ఎగ్జిబిషన్ సంస్థ. మల్టీప్లెక్స్ , డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కలిగిన ఈ సంస్థ సినిమాల నిర్మాణలోనూ తమ మార్కు చూపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా, లవ్ స్టోరీ, కుబేర వంటి వైవిధ్యమైన, క్లాస్ చిత్రాలను అందించడమే కాకుండా.. ఇతర భాషల భాగస్వామ్యాలతో భారీ పాన్-ఇండియా చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ వ్యాపార వర్గాల్లో అత్యంత నమ్మకమైన బ్యానర్‌గా గుర్తింపు పొందింది.
టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల వంటి ప్రముఖులతో `పీపుల్ మీడియా ఫ్యాక్టరీ` టాలీవుడ్‌లో జోరు మీద ఉంది. ఈ సంస్థ కార్పొరేట్ శైలిలో అత్యంత వేగంగా 50కి పైగా సినిమాలను నిర్మించి రికార్డు సృష్టించింది. ఈ టాప్ 5 నిర్మాణ సంస్థలు కేవలం సినిమాలు తీయడమే కాకుండా.. గిల్డ్ ద్వారా నిర్మాణ వ్యయాల నియంత్రణ, ఓటీటీ రిలీజ్ నిబంధనలపై దృష్టి సారిస్తూ.. థియేటర్ల వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూ టాలీవుడ్ లో యాక్టివ్ గా కార్యాచరణను నడిపిస్తున్నాయి.