పరాజయం ప్రభావం: 'వార్ 2' వర్సెస్ 'టాక్సిక్'.. నెక్ట్స్ ప్రాజెక్టుపైనా?
చిత్రపరిశ్రమలో ఒక భారీ సినిమా పరాజయం పాలైతే.. ఆ ప్రభావం నటీనటుల తదుపరి సినిమాలపై పడుతుందా లేదా అనే అంశంపై ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది
చిత్రపరిశ్రమలో ఒక భారీ సినిమా పరాజయం పాలైతే.. ఆ ప్రభావం నటీనటుల తదుపరి సినిమాలపై పడుతుందా లేదా అనే అంశంపై ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన `వార్ 2` డిజాస్టర్ కావడం ట్రేడ్ వర్గాలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అయితే ఈ సినిమాలో కథానాయకులుగా నటించిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటనపై ఎలాంటి విమర్శలు రాలేదు. కేవలం ఎమోషన్స్ లేకుండా సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ పనితీరుపైనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
అదే తరహాలో ఇటీవల విడుదలైన యష్ `టాక్సిక్` సినిమా ఫలితం విషయంలోనూ కథానాయకుడి నటనపై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు కానీ.. మేకింగ్ ఫాల్ట్ పై దర్శకురాలినే విమర్శకులు తప్పుబట్టారు. యష్ తన పాత్రలో అద్భుతంగా రాణించాడని ప్రశంసలు దక్కినా.. టాక్సిక్ పరాజయం పాలవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా యష్ నటిస్తున్న తదుపరి మైథలాజికల్ వండర్ `రామాయణం` చిత్రంపై ఈ ప్రభావం పడిందని.. యష్ ఫ్లాప్‌తో బిజినెస్ పరంగా మేకర్స్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని కథనాలు వైరల్ అవుతున్నాయి.
అయితే కేవలం ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల దాని ప్రభావం `రామాయణం` లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై పడుతుందా? అంటే... ట్రేడ్ విశ్లేషకులు ఈ రెండు పరిస్థితులూ వేరని స్పష్టం చేస్తున్నారు. వార్ 2 లేదా టాక్సిక్ సినిమాల స్కేల్ వేరు.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న `రామాయణం` స్కేల్ పూర్తిగా వేరు. ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్ దృష్టిలో ఉంచుకుని అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో నిర్మాతలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
అసలు బిజినెస్ పరంగా ఆలస్యం జరగడానికి ప్రధాన కారణం `టాక్సిక్` ఫలితం కాదని.. బయర్లు, పంపిణీదారులకు నిర్మాతలు ఊహించనంత పెద్ద మొత్తంలో బిజినెస్ ఫిగర్స్ కోట్ చేయడమేనని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది రానున్న దీపావళికి మొదటి భాగం.. మరుసటి సంవత్సరం దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. బడ్జెట్ పరిమాణం చాలా పెద్దది కావడంతో.. హక్కుల కోసం భారీ మొత్తాలను ఆశించడమే పంపిణీ ఒప్పందాలు ఆలస్యం కావడానికి కారణమని స్పష్టమవుతోంది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతో గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమా సత్తా చాటడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు. దర్శకుడు నితీష్ తివారీ బృందం రావణుడి పాత్రలో యష్‌పై ఉంచిన నమ్మకం ఏమాత్రం వమ్ము కాదని.. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి రామాయణం బిజినెస్ పై సాగే ఊహాగానాలకు భిన్నమైన మార్కెటింగ్ వ్యూహం నమిత్ బృందానికి ఉందని కూడా విశ్లేషిస్తున్నారు.