రష్మిక వర్సెస్ శ్రద్దా కపూర్: ఎవరు ఉత్తమ నటి?
బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.
బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం `ఛావా`లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మహారాణి ఏసుబాయి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఏసుబాయి పాత్రలో తెరపై కనిపించింది కాసేపే అయినా పవర్ పుల్ పాత్రలో అదరగొట్టింది. పాత్రలో రష్మిక ఆహార్యం సహా ప్రతీది అంతకంతకు హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అదే దర్శకుడితో రష్మిక ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రం చేస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ బాలీవుడ్ లో జరుగుతోంది.
అయితే ఆ ఛాన్స్ రష్మికకు రాలేదు గాను... అలాంటి గొప్ప అవకాశం మాత్రం శ్రద్దా కపూర్ కి వరించింది. జానపద కళాకారిణి వితాబాయ్ నారాయణ్ గావకర్ బయోపిక్ `ఇటా`ను లక్షణ్ శ్రద్దా కపూర్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఇలా రెండు భారీ కథాంశాల్లో ఇద్దరు అగ్ర నటీమణులతో పనిచేస్తుండటంతో వీరి నటనపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇటీవల ఓ సంభాషణలో భాగంగా ఓ నెటిజన్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ను నేరుగా ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. `ఛావా`లో నటించిన రష్మిక మందన్న, వితాబాయ్ బయోపిక్‌లో నటిస్తున్న శ్రద్ధా కపూర్.. వీరిద్దరిలో ఎవరు ఉత్తమ నటి? అని ప్రశ్నించారు. ఇద్దరు టాప్ హీరోయిన్ల మధ్య పోలిక తెస్తూ అడిగిన సవాలుతో కూడిన ప్రశ్నకు దర్శకుడు సమయస్ఫూర్తితో చమత్కారంగా బదులిచ్చారు. `ఈ ప్రశ్నకు సమాధానం నేను `ఇటా` సినిమా పూర్తి చేసి థియేటర్లలో విడుదలైన తర్వాతే చెబుతాను` అని వ్యాఖ్యానించారు. రెండు చిత్రాల పనితీరు, ఆయా పాత్రల్లో నటీమణుల ఒదిగిపోయిన తీరును పూర్తి స్థాయిలో ప్రేక్షకులు చూసిన తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలి. అందుకే శ్రద్ధా కపూర్ సినిమా విడుదలయ్యే వరకు దీనిపై స్పందించడం తొందరపాటు అవుతుందని స్పష్టం చేశారు.
`ఛావా` చిత్రంలో రష్మిక మందన్న పోషించిన మహారాణి ఏసుబాయి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ ధర్మపత్నిగా, ఎంతో గంభీరమైన, భావోద్వేగాలతో కూడిన చారిత్రక పాత్రలో రష్మిక లీనమై నటించారని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె నటనలోని పరిణతిని, కష్టపడే తత్వాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ పలుమార్లు బహిరంగంగానే అభినందించారు.
అలాగే మహారాష్ట్రకు చెందిన తమాషా కళాకారిణి వితాబాయ్ నారాయణ్ గావకర్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న `ఇటా` చిత్రంలో శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఇది శ్రద్ధా కెరీర్‌లోనే నటనకు ఆస్కారమున్న సవాలుతో కూడిన పాత్ర కానుంది. ఒక జానపద నర్తకి, కళాకారిణి జీవితంలోని ఎత్తుపల్లాలను, భావోద్వేగాలను శ్రద్ధా ఏ రీతిలో పండిస్తారోనని బాలీవుడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.