సిల్క్ స్మిత బయోపిక్ పై కంగన ఓపెన్ కామెంట్!
ఆ సమయంలో కథ విన్నా? ఆ సినిమా సాధించబోయే సంచలన విజయాన్ని, అందులో అసలైన సామర్థ్యాన్ని తాను సరిగ్గా అంచనా వేయలేకపోయానని కంగనా అంగీకరించారు.
బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `డర్టీపిక్చర్` ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయారు. అద్భుత నటనతో విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే ఐకానిక్ పాత్రలో నటించే మొదటి అవకాశం విద్యాబాలన్‌కు రాలేదన్నది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ అవకాశం ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌కే వరించిందట. తాజాగా ఈ విషయాన్ని కంగనా స్వయంగా రివీల్ చేసారు.
దర్శకుడు మిలన్ లుథ్రియా కథను మొదట తన వద్దకే తీసుకొచ్చారని కంగనా రనౌత్ తెలిపారు. ఆ సమయంలో కథ విన్నా? ఆ సినిమా సాధించబోయే సంచలన విజయాన్ని, అందులో అసలైన సామర్థ్యాన్ని తాను సరిగ్గా అంచనా వేయలేకపోయానని కంగనా అంగీకరించారు. అందువల్లే సిల్క్ స్మిత పాత్రను తిరస్కరించాల్సి వచ్చిందని.. అలా చేయడం కెరీర్‌లో పెద్ద పొరపాటని కంగన అభిప్రాయపడ్డారు. `కొన్నిసార్లు మనం కథలను విన్నప్పుడు అవి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో ? ఊహించడం కష్టం. `ది డర్టీ పిక్చర్` విషయంలో కూడా నాకూ అదే జరిగింది. కానీ ఆ పాత్రను విద్యాబాలన్ చేసిన తీరు అత్యద్భుతం. ఆమె కాకుండా మరొకరు ఆ పాత్రలో అంత గొప్పగా నటించలేరు` అని విద్యాబాలన్ నటనను కంగనా ప్రశంసించారు.
కంగనా ఈ సినిమా తిరస్కరించినా? ఆ విషయంలో తనకు ఎలాంటి బాధ .. అసూయ లేదని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో ప్రతి నటుడికి కొన్ని అవకాశాలు రావడం, వాటిని వదులుకోవడం సహజమేనన్నారు. విద్యాబాలన్ ఈ సినిమాలో నటించి భారతీయ చిత్రసీమలో మహిళా ప్రాధాన్య చిత్రాలకు కొత్త దిశను చూపించారని ఆ విజయం పూర్తిగా విద్యకే దక్కుతుందని కంగన కొనియాడారు.
`ది డర్టీ పిక్చర్` విడుదల అనంతరం బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్లు, విమర్శకుల ప్రశంసలు సినిమా రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా గ్లామర్, నటన సమ్మేళనంగా విద్యాబాలన్ పండించిన సిల్క్ స్మిత పాత్ర విమర్శకుల చేత నీరాజనాలు అందుకుంది. ఈ సినిమా సాధించిన విజయం తర్వాతే బాలీవుడ్‌లో మహిళా ప్రధాన సినిమాలకు మార్కెట్ పెరిగింది.
కంగనా రనౌత్ కూడా `క్వీన్`, `తను వెడ్స్ మను`, `మణికర్ణిక` వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిం చుకున్నారు. మరికొంత మంది ప్రముఖుల బయోపిక్స్ లోనూ నటించారు. కానీ అవి అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు. కానీ నటిగా మాత్రం కంగన ఫెయిల్ అవ్వలేదు. అయినా పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమా అవకాశాన్ని ఎలా చేజార్చుకున్నారో? ఓపెన్‌గా మాట్లాడటం ద్వారా కంగనా నిజాయితీని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.