స్టార్ హీరో వారసుడు మళ్లీ బుల్లి తెరకే పరిమితమా?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ సినీ అరంగేట్రంపై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ సినీ అరంగేట్రంపై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తండ్రిలా కెమెరా ముందుకు వచ్చి నటుడిగా మెప్పించడం కంటే, కెమెరా వెనుక ఉండి దర్శకత్వం వహించడానికే ఆర్యన్ మొగ్గు చూపాడు. ఈ క్రమంలోనే `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` పేరుతో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓ సిరీస్‌ను తెరకెక్కించి ఓటీటీలోకి అడుగుపెట్టాడు. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినా? మేకింగ్ పరంగా కొన్ని లోపాలు, సాంకేతిక తప్పిదాలు కూడా కనిపించాయి.
ఒక స్టార్ హీరో కుమారుడిగా భారీ అంచనాల నడుమ తొలి సిరీస్‌ను డైరెక్ట్ చేయడం ఆర్యన్‌కు పెద్ద సవాలుగానే మారింది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ ఇన్సైడ్ డ్రామాను, సినీ ప్రపంచంలోని వెలుగు చీకట్లను ఆసక్తికరంగా చూపించడంలో ఆర్యన్ కొంతవరకు విజయం సాధించాడు. కథనం, కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో అతని ప్రతిభ కనిపించినా? సుదీర్ఘమైన నిడివి ..అనుభవలేమి కారణంగా కొన్ని చోట్ల కథనం నెమ్మదించిందనే విమర్శలు వచ్చాయి. మొదటి ప్రయత్నంగా ఇది మెప్పించినా? పరిపూర్ణమైన దర్శకుడిగా మార్కులు సాధించడంలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి.
తొలి సిరీస్ పూర్తయిన నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తదుపరి ప్రాజెక్ట్‌గా నేరుగా ఓ పెద్ద థియేట్రికల్ సినిమాను డైరెక్ట్ చేస్తాడని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి బిగ్ స్క్రీన్ ఎంట్రీని వాయిదా వేయడమే మంచిదనే ఆలోచనలో ఆర్యన్ ఉన్నట్లు తెలుస్తోంది. వెండితెరపై భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయాలంటే ఎంతో అనుభవం, పక్కా ప్లానింగ్ అవసరం. మొదటి సిరీస్‌లో ఎదురైన లోపాలను పరిగణనలోకి తీసుకుంటే వెంటనే బిగ్ స్క్రీన్‌పై ప్రయోగం చేయడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కోసమే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తొలి సిరీస్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ దర్శకుడిగా ప్రతిభను మరింత పదును పెట్టుకునేందుకు మరో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించే దిశగా అడుగులు వేస్తున్నాడట. ఓటీటీ మాధ్యమంలో దర్శకుడికి లభించే స్వేచ్ఛ, ప్రయోగాలకు ఉండే అవకాశం వల్ల మేకింగ్ శైలిని సంపూర్ణంగా నిరూపించుకోవడానికి ఇదొక సరైన వేదికగా భావిస్తున్నాడు.
ఏ చిన్న పొరపాటు జరిగినా? సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చే రోజుల్లో వారసుడిగా ఆర్యన్ ఖాన్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమైనదిగా కనిపిస్తోంది. తొందరపడి పెద్ద సినిమా తీసి చేతులు కాల్చుకోవడం కంటే ఓటీటీలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ క్రాఫ్ట్‌పై సంపూర్ణ పట్టు సాధించాలని భావిస్తున్నాడు. మరో ఒకటి లేదా రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా దర్శకత్వంలో పూర్తి స్థాయిలో పరిణతి సాధించిన తర్వాతే గ్రాండ్‌గా వెండితెరపైకి ప్రమోషన్ పొందాలనేది ఆర్యన్ మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తోంది.
తండ్రి షారుఖ్ ఖాన్ ఇమేజ్ వెనుక లేకుండా స్వశక్తితో ఒక దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి ఆర్యన్ పడుతున్న శ్రమను ఇండస్ట్రీ వర్గాలు అభినందిస్తున్నాయి. తొలి సిరీస్ ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను సానుకూలంగా తీసుకుని తదుపరి సిరీస్‌ను మరింత పర్ఫెక్ట్గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యాడు. త్వరలోనే ఈ కొత్త ఓటీటీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఓటీటీ వేదికగా అనుభవాన్ని గడిస్తూ భవిష్యత్తులో బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.