418 మూవీ రివ్యూ
‘418’ మూవీ రివ్యూ
నటీనటులు: ఛైత్ర అచర్- సూర్యరాజ్ వీరబత్తిని- చరణ్ లక్కరాజు- ప్రీతి పగడాల- రమేష్ ఇందిర- శ్రీ వైష్ణవ్- శశాంక్ పాటిల్ తదితరులు
సంగీతం: వెంకీ జీజీ
ఛాయాగ్రహణం: దినేష్ దివాకరన్
మాటలు: మోహన్- ప్రీతమ్
నిర్మాతలు: నవీన్ యెర్నేని- రవిశంకర్ యలమంచిలి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ
దాదాపుగా అందరూ కొత్త వాళ్లే నటించినా సరే.. ‘418’ అనే కన్నడ డబ్బింగ్ హార్రర్ మూవీ తెలుగులో మంచి హైపే తెచ్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయడం.. ప్రశాంత్ నీల్ సమర్పించడం.. ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడం.. పబ్లిసిటీ కూడా గట్టిగా చేయడం అందుక్కారణం. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘418’ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి.
కథ:
కర్ణాటకలోని వేదగిరిలో ఒక మెంటల్ హాస్పిటల్లో కావ్య అనే పేషెంట్ చేతిలో పలువురు సిబ్బంది హత్యకు గురి కావడంతో దాన్ని మూసేస్తారు. తర్వాత చాలా ఏళ్లకు పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ కోసం ఆ బిల్డింగ్ ను అద్దెకు తీసుకుంటారు. అక్కడ బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తారు. అందులో 418 నంబర్ గదిలోనే హత్యలు జరగడంతో దాన్ని మూసేసి మిగతా గదుల్లో మాత్రమే విద్యార్థులను ఉంచుతారు. కానీ 418 పక్క గదిలో ఉన్న విద్యార్థికి భయానక అనుభవాలు ఎదురవడంతో తన గదిని ఖాళీ చేస్తాడు. అయినా ఆ అనుభవం అతణ్ని వెంటాడుతుంది. దీంతో ఆ రూం కథేంటో తేల్చాలని చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి సంచలన విషయాలు తెలుస్తాయి. దేవిక అనే యక్షగాన కళాకారిణే హత్యలకు కారణమని వెల్లడవుతుంది. ఇంతకీ ఈ దేవిక ఎవరు.. తన కథేంటి.. 418 రూం తాలూకు మిస్టరీ చివరికి వీడిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఒకప్పుడు హార్రర్ సినిమా అంటే హార్రర్ సినిమానే. జనాలను భయపెట్టడమే లక్ష్యంగా సాగేవీ సినిమాలు. కానీ తర్వాత భయానికి నవ్వును కూడా జోడించి ఈ జానర్ రీచ్ పెంచారు కొందరు ఫిలిం మేకర్స్. దీంతో క్రమంగా ఆ సినిమాలు ఒక మూసలా మారి.. ఆ జానరే కంగాళీగా తయారైంది. ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడూ ఫక్తు హార్రర్ సినిమాలు కొన్ని వస్తుంటాయి. జనాలకు రియల్ జంప్ స్కేర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాయి. ‘418’ కొంచెం సిన్సియర్ గానే ఆ పని చేసింది. ఎప్పుడూ హార్రర్ సినిమాల్లో చూసే సెటప్ కు కొంచెం భిన్నంగానే ఈ కథ నడుస్తుంది. మెడికల్ కాలేజీ సెటప్ తో కథను మొదలుపెట్టి.. యక్షగానం.. మాతృత్వం.. మానసిక సమస్యలు.. క్షుద్రపూజలు.. ఇలా అనేక అంశాలను టచ్ చేస్తూ ప్రశాంత్ నీల్ శిష్యుడు కీర్తన్ నాదగౌడ చాలా కసరత్తే చేశాడు ‘418’ కోసం. ఐతే ఎంత కసరత్తు చేసినా.. కథను అర్థమయ్యేలా.. కన్విన్సింగ్ గా చెప్పడం.. లాజిక్కులు సరిగ్గా ఉండడం.. జెన్యూన్ హార్రర్ మూమెంట్స్ తో ప్రేక్షకులను భయపెట్టడం కీలకం. ఈ విషయాల్లో ‘418’ ఒకింత నిరాశకే గురి చేస్తుంది. ఇది కంటెంట్ ఉన్న సినిమానే కానీ.. కన్విన్సింగ్ గా లేకపోవడంతో ఒక మోస్తరు స్థాయిని మించలేకపోయింది.
‘418’ తీసింది కేజీఎఫ్.. సలార్ చిత్రాలకు ప్రశాంత్ నీల్ దగ్గర శిష్యరికం చేసిన కీర్తన్ నాదగౌడ. ఇది ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా హార్రర్ కథతో తెరకెక్కిన సినిమా అయినా సరే.. తన గురువు తరహా నరేషన్- ఎడిటింగ్ ప్యాటర్నే ఫాలో అయ్యాడు కీర్తన్. ఇందులో దయ్యం గురించి మిగతా పాత్రలు ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. ఆ బిల్డప్ చూసి ఎంతో ఊహించుకుంటాం. దీనికి తోడు బీజీఎం.. విజువల్స్ ఇచ్చే ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇంత చేసినా ఒక హార్రర్ సినిమా నుంచి ఆశించే జెన్యూన్ హార్రర్ మూమెంట్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేవు. అలా అని ‘418’ భయపెట్టదా అంటే అలా ఏం కాదు. కానీ దయ్యంగా మారే అమ్మాయి.. అలా కావడానికి ముందు ఇచ్చే చిల్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. తన బ్యాక్ స్టోరీనే ‘418’కు హైలైట్.
సమాజంలో మాతృత్వం అనేది ఎంత కీలకమైన విషయం.. సమయానికి తల్లి కాని అమ్మాయిని సొసైటీ ఎలా చూస్తుంది.. మాటలతో తనను ఎలా చిత్రవధ చేస్తుంది అన్నది ఎంతో ఇంటెన్సిటీతో చూపిస్తూ.. బిడ్డకు తల్లి కావడం అన్నది ఒక అబ్సెషన్ లా మారితే ఆ వ్యక్తి ఎంత దూరం వెళ్తుంది అన్నది ఒళ్ళు గగుర్పొడిచేలా చూపించారిందులో. ఓవైపు ఛైత్ర అచర్ అద్భుత నటన.. ఇంకోవైపు స్టన్నింగ్ క్లోజప్ షాట్స్.. మరోవైపు టాప్ నాచ్ బీజీఎంతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది.కానీ అన్నీ బాగున్నా.. కథలో అసలు పాయింటునే సరిగా చెప్పకపోవడం.. వర్తమానంలో హార్రర్ ఎలిమెంట్స్ సరిగా వర్కవుట్ కాకపోవడం.. అనేక సమాధానం లేని ప్రశ్నలు.. ఇల్లాజికల్ థింగ్స్ ‘418’ అనుభూతిని చెడగొట్టేశాయి. కొండంత రాగం తీసి.. అన్నట్లుగా దయ్యం బ్యాక్ స్టోరీని ఒక దశ వరకు చాలా బాగా నడిపించి.. ఆ తర్వాత దాన్ని తేల్చిపడేశారు. ముఖ్యంగా సినిమా ముగింపు ఎంతమాత్రం రక్తి కట్టలేదు.
హార్రర్ ఎలిమెంట్ లేని సన్నివేశాలతో ప్రేక్షకులను భయపెట్టి.. దయ్యంతో ముడిపడ్డ సన్నివేశాలను మాత్రం తేల్చిపడేయడం ‘418’లో పెద్ద మైనస్. ప్రేక్షకులకు బోలెడన్ని చిల్స్ ఇవ్వడానికి తగ్గ సెటప్ కుదిరినా.. దర్శకుడు దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఫస్టాఫ్ అంతా విపరీతమైన బిల్డప్ ఉంటుందే తప్ప.. ప్రేక్షకులను నిజంగా భయపెట్టే సన్నివేశాలు తక్కువ. ఇక సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా.. దానికి సరైన లాజికల్ ముగింపు ఇవ్వలేకపోయారు. ఫ్లాష్ బ్యాక్ లో జరిగే హత్యలన్నింటికీ ఒక వ్యక్తి కారణమన్నట్లు చూపిస్తారు. మళ్లీ ఆ వ్యక్తే దయ్యాన్ని అదుపు చేయడానికి వస్తాడు. ఇదేం లాజిక్కో అర్థం కాదు. ఇలాంటి లాజిక్ లేని విషయాలు సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా చివర్లో వచ్చే ట్విస్టు కూడా అలాగే ఉంటుంది. ఈజీగా కనిపెట్టగలిగే విషయాన్ని పెద్ద ట్విస్ట్ లాగా బ్లో అప్ చేశారు. దీని వల్ల ‘418’ అనుకున్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కథా నేపథ్యం బాగున్నా.. లీడ్ క్యారెక్టర్-అందులో ఛైత్ర అచర్ పెర్ఫామెన్స్ అదిరిపోయినా.. సాంకేతిక అంశాల్లో మెరుపులున్నా.. 418 ‘జస్ట్ ఓకే’ స్థాయిని మించలేకపోయింది.
నటీనటులు:
‘418’లో నటన పరంగా అతి పెద్ద హైలైట్ దేవిక పాత్రను పోషించిన ఛైత్ర అచర్. రెండున్నర గంటల నిడివిలో ఆమె కనిపించేది ముప్పావుగంటే. కానీ ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. క్లోజప్ షాట్లలో తన హావభావాలు అద్భుతం. జస్ట్ ఒక నవ్వుతో ఆమె భయపెట్టేస్తుంది. కొన్ని సన్నివేశాల్లో కళ్లతో నటించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలో ఆమె చాలా బాగా చేసింది. తన భర్త పాత్రలో నటించిన యాక్టర్ బాగా చేశాడు. షాషా పాత్రలో ప్రీతి పగడాల ఓకే. ఇద్దరు కుర్రాళ్లు చరణ్ లక్కరాజు.. సూర్య రాజ్ ఆకట్టుకున్నారు. లెనిన్.. ఇరుముడి చిత్రాల ఫేమ్ రమేష్ ఇందిర కీలక పాత్రలో రాణించాడు. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘418’ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. హార్రర్ సినిమాలకు సౌండ్ డిజైన్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఆ వర్క్ గొప్పగా చేశారు. వంశీ జీజీ బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. దినేష్ దివాకరన్ విజువల్స్ కూడా బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు మైత్రి స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ.. ఒక డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ కు అవసరమైన సెటప్ బాగానే చేసుకున్నాడు. తన టేకింగ్ బాగుంది. కానీ కథను ఇంకా క్లారిటీతో చెప్పాల్సింది. హార్రర్ ఎలిమెంట్స్ ను ఇంకా బాగా డీల్ చేయాల్సింది. తనలో మంచి టెక్నీషియన్ ఉన్న సంగతి తెలుస్తుంది కానీ.. ఔట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.
చివరగా: 418.. కంటెంట్ ఉంది కడుపు నిండదు
రేటింగ్ - 2.5/5