నేషనల్ క్రష్ పాన్-ఇండియా ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏ చిన్న వ్యాఖ్య చేసినా? ఏ కొత్త ప్రాజెక్ట్‌లో కనిపించినా సోషల్ మీడియాలో సంచలనంగా మారడం సహజం.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏ చిన్న వ్యాఖ్య చేసినా? ఏ కొత్త ప్రాజెక్ట్‌లో కనిపించినా సోషల్ మీడియాలో సంచలనంగా మారడం సహజం. ఇటీవల అమ్మడు హిందీలో మాట్లాడిన తీరు ఉపయోగించిన యాసపై నెట్టింట ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ ట్రోలింగ్ కేవలం సాధారణ నెటిజన్ల విమర్శ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా పక్కా వ్యూహం ఉందా? అనే సందేహాలు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కావాలనే రష్మికను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారనే ప్రచారం తెరపైకి వస్తోంది.
రష్మిక మందన్న కన్నడ చిత్రం `కిరిక్ పార్టీ` తో వెండితెరకు పరిచయమైనా? ఆ తర్వాత అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్‌లలో సాధించిన సక్సెస్ కొందరికి రుచించలేదనేది బహిరంగ రహస్యం. గతంలో కన్నడ ప్రొడక్షన్ హౌస్‌లపై రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు.. కాంతార సినిమా వీక్షణపై ఇచ్చిన వివరణల వల్ల కన్నడ నాట ఆమెపై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో రష్మిక సినిమాలను కన్నడలో బ్యాన్ చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఆ పాత కోపాన్ని మనసులో ఉంచుకుని అమ్మడి పాన్-ఇండియా ఇమేజ్‌ను దెబ్బతీయడానికే హిందీ యాసను ఆసరాగా చేసుకుని ట్రోల్స్ చేయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భాషా సరిహద్దులు దాటి బాలీవుడ్‌లో వరుస బడా ప్రాజెక్ట్‌లు దక్కించుకుంటున్న రష్మిక అక్కడ తన సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏ దక్షిణాది నటుడికైనా హిందీ ఉచ్చారణలో కొంత మాతృభాషా ప్రభావం ఉండటం సహజమైన విషయం. అయితే రష్మిక హిందీ ఉచ్చారణను నెగెటివ్‌గా చూపిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ ప్రచారం కావడం వెనుక పెయిడ్ పీఆర్ బ్యాచ్‌లు పనిచేస్తున్నాయనే వార్తలు బలంగా విని పిస్తున్నాయి. సాధారణంగా జరిగే విమర్శకు.. కావాలని చేసే నెగెటివ్ క్యాంపెయిన్‌కు స్పష్టమైన తేడా కనిపిస్తోందన్న వాదన తెరపైకి వస్తోంది.
తనపై వస్తున్న వరుస ట్రోలింగ్‌పై రష్మిక మందన్న ఎంతో పరిణతితో.. బోల్డ్‌గా స్పందించడం గమనార్హం. ప్రతి భాషకు ప్రత్యేకత ఉంటుందని.. కొత్త భాషను నేర్చుకుని డబ్బింగ్ చెప్పే క్రమంలో తప్పులు దొర్లడం సహజమని స్పష్టం చేశారు. విమర్శలను సానుకూలంగానే తీసుకుంటానని అయితే కావాలని చేసే వ్యక్తిగత దాడులను, ట్రోలింగ్‌ను ఎంతమాత్రం పట్టించుకోనని ధీటుగా సమాధానమిచ్చారు. తన పనితీరుతోనే ఇలాంటి విమర్శకులకు బదులిస్తానని.. నటనపైనే దృష్టి ఉంటుందన్నారు.
కన్నడ నాట ఎంత వ్యతిరేకత ఎదురవుతున్నా? టాలీవుడ్ , బాలీవుడ్ పరిశ్రమలు రష్మికకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నాయి. భాషా పరిమితులను దాటి రష్మిక అంకితభావం, నటన పట్ల ఉన్న క్రమశిక్షణను దర్శక, నిర్మాతలు కొనియాడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి కొందరు వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా ట్రోలింగ్ చేయిస్తున్నారనే వార్తలు వచ్చినా? ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం ఆమెను సొంత నటిగానే ఆదరిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ గ్రాఫ్‌ను మరింత పైకి తీసుకెళ్తున్నారు.
ఏది ఏమైనా సినీ పరిశ్రమలో విజయం సాధించిన నటీనటులపై ఇలాంటి ప్రాంతీయ లేదా భాషాపరమైన వ్యతిరేకతలు రావడం కొత్తేమీ కాదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నెగెటివిటీని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించినప్పటికీ రష్మిక నటనతో, క్రేజ్‌తో వాటిని తిప్పికొడుతోంది. వివాదాలకు దూరంగా ఉంటూ తనపై వచ్చే విమర్శలను హుందాగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న రష్మిక వైఖరిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.