టైగర్ ఎటాక్స్ వీడియో: బుల్లెట్టు దిగలేదు.. కేవలం గన్ పౌడర్ మీద పడితే ఇలా అయింది!
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడటం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించింది
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడటం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించింది. సాయంత్రం సమయంలో ముగ్గురు దుండగులు ఆయనపై బహిరంగంగా కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో అతడికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోయినా.. ఘటన తాలూకు భయానక గుర్తులు అతడి శరీరంపై స్పష్టంగా మిగిలిపోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
తాజాగా టైగర్ ష్రాఫ్ అధికారిక సోషల్ మీడియా టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో తన కుడి చేతిపై ఎరుపు, గోధుమ రంగులో చాలా చిన్న మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గన్ పౌడర్ రాలి పడటం వల్ల చేతిపై ఏర్పడిన ఈ గాయాలను (పౌడర్ టాటూయింగ్) చూస్తుంటే.. ఒకవేళ బుల్లెట్లు నేరుగా తగిలి ఉంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉండేదోనని తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
ఈ వీడియో కింద `దేవుడు దయతో కాపాడాడు` అంటూ క్యాప్షన్ జతచేయగా.. అతడి తండ్రి జాకీ ష్రాఫ్, సోదరి కృష్ణ ష్రాఫ్ ఎమోజీలతో స్పందించారు. ఈ ఘటన జరిగిన రాత్రి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించినప్పుడు తన చేతికి బ్యాండేజీలు కనిపించాయి.. ఈ బొబ్బలెక్కిన గాయానికి సంబంధించిన కట్లు అవి అని అర్థమవుతోంది.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వదంతులు, ఏఐ (AI) సృష్టించిన తప్పుడు వీడియోలు వైరల్ కావడంతో టైగర్ ష్రాఫ్ బృందం స్పందించింది. తాము ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదని స్పష్టం చేస్తూ.. తప్పుడు వార్తలు- స్క్రిప్టెడ్ కథనాలను వ్యాప్తి చేసే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మరోవైపు ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను ముంబై పోలీసులు 24గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు, బీహార్‌కు చెందిన 22 ఏళ్ల హ్రితిక్ కుమార్, అలాగే సోనిపట్‌కు చెందిన 18 ఏళ్ల రెహాన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం క్షేమంగా ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.