వరుస ఫ్లాపులొచ్చినా కీర్తి సురేష్‌కు తగ్గని క్రేజ్.. అసలు కారణం ఇదేనా?

సినీ పరిశ్రమలో విజయాలు- అపజయాలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల లాంటివి.

Update: 2026-10-23 03:48 GMT

సినీ పరిశ్రమలో విజయాలు- అపజయాలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల లాంటివి. అయితే కొన్నిసార్లు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడినా ..న‌ట‌న ప‌రంగా ఆ స్టార్‌పై ఉన్న ముద్ర కార‌ణంగా డిమాండ్ ఏమాత్రం తగ్గదు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న న‌టిపై ఇదే చర్చ జరుగుతోంది. కెరీర్ ప‌రంగా ఇటీవ‌ల‌ వరుస పరాజయాలు పలకరించినా న‌టి కీర్తి సురేష్ క్రేజ్ - మార్కెట్ వ్యాల్యూ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.

కీర్తి సురేష్ కెరీర్‌ను పరిశీలిస్తే.. గత కొన్నేళ్లుగా కొన్ని వ‌రుస‌ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించని విష‌యం తెలిసిందే. రివాల్వర్ రీటా, బేబీ జాన్, రఘు తాత, ఉప్పు కప్పురంబు, అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన `భోళా శంకర్` వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిలో చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ వరుస పరాజయాల ప్రభావం కీర్తి కమర్షియల్ మార్కెట్‌పై కొంతవరకు పడినా.. నటిగా త‌న స్థానానికి మాత్రం ఎలాంటి భంగం కలగలేదు. ఫ్లాపులొచ్చినా రివాల్వ‌ర్ రీటా పాత్ర‌లో కీర్తి అమాయ‌క‌త్వం, క‌ర్క‌శ‌త్వంతో కూడుకున్న న‌ట‌న అంద‌రికీ న‌చ్చింది. భోళా శంక‌ర్ లో చిరంజీవి లాంటి అగ్ర న‌టుడికి సోద‌రిగా న‌టించినా అది త‌నలోని ఆలోచ‌నా వైవిధ్యానికి అద్ధం ప‌ట్టింది.

`రివాల్వర్ రీటా`లో డార్క్ కామెడీ-యాక్షన్ మేళవించిన పాత్రలో టైమింగ్ ప్రదర్శించిన కీర్తి సురేష్, బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన `బేబీ జాన్`లో ఎమోషనల్ పవర్ చూపిస్తూ విభిన్నమైన షేడ్స్ పండించారు. అదే సమయంలో `రఘు తాత` చిత్రంలో హిందీ త‌ప్ప‌నిస‌రి విధింపును ప్రశ్నించే విప్లవాత్మక భావాలున్న.. వ్యంగ్యాత్మక పాత్రలో మెప్పించగా, `ఉప్పు కప్పురంబు`లో ఓ సామాజిక-హాస్య కోణంలో సరికొత్త కథానాయికగా దర్శనమిచ్చారు. ఇలా కథాంశాలు, జోనర్లు పూర్తిగా భిన్నంగా ఎంచుకుని ఆస‌క్తిని పెంచారు కీర్తి. క్రైమ్ కామెడీ, కమర్షియల్ ఎమోషన్, సామాజిక వ్యంగ్యం, పీరియాడిక్ డ్రామా వంటి ప్రతి పాత్రలోని వైవిధ్యాన్ని స్వయంగా ఆహ్వానిస్తూ.. తన విలక్షణ నటనతో ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కీర్తి సురేష్‌కు అవకాశాలు ఎప్పటికీ తగ్గకపోవడానికి త‌ను ఎంచుకునే పాత్రలు.. కొత్త‌ద‌నంతో కూడిన‌ ప్రయోగాలే ప్రధాన కారణం. సావిత్రి బయోపిక్ `మహానటి`లో త‌న అత్యుత్త‌మ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దక్కిన జాతీయ స్థాయి గుర్తింపు.. ఆ తర్వాత `దసరా` వంటి చిత్రాలలో చూపిన మాస్ `రా అండ్ రఫ్` నటన కీర్తిని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. దక్షిణాది చిత్రాలకే పరిమితం కాకుండా హిందీ పరిశ్రమ వరకు తన పరిచయాలను, మార్కెట్‌ను విస్తరించుకోవడం త‌న‌కు ఒక బలమైన ప్లస్ పాయింట్‌గా మారింది. ఇటీవ‌ల నాని `ప్యార‌డైజ్`లో ఏష నాగుల పాట కీర్తి స్థాయిని ఓవ‌ర్ నైట్ లో పెంచిందే కానీ త‌గ్గించ‌లేదు.

సాధారణంగా నటీమణుల విషయంలో `పెళ్లి తర్వాత కెరీర్ మందగిస్తుంది` అనే అపనమ్మకం ఇప్పటికీ చిత్ర పరిశ్రమ స‌ర్కిల్స్‌లో వినిపిస్తుంటుంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇండస్ట్రీ ఆలోచనా విధానం కూడా మారుతోంది. పెళ్లి తర్వాత నటీమణుల వ్యక్తిగత జీవితం కంటే.. స్క్రీన్ పై వారు చూపించే అంకితభావం, ఎంచుకుంటున్న వైవిధ్యమైన స్క్రిప్ట్‌లకే మేకర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది మార్కెట్ మాయాజాలం. రిట‌ర్నులు తెచ్చే స‌త్తా, ప్ర‌తిభ ఫ‌లానా న‌టికి ఉన్నాయి అంటే వారికి ఫిలింట్రేడ్ లో అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉంటుంది. కీర్తి సురేష్ కూడా తన కెరీర్ నిర్ణయాలపైనే పూర్తి దృష్టి పెడుతూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోవ‌డానికి త‌న ప్ర‌తిభ‌, డెడికేష‌న్, మార్కెట్లో స్టామినా ముఖ్య కార‌ణాలుగా మారాయి.

ఇప్పుడు కీర్తి నటిస్తున్న వెబ్ సిరీస్ `అక్క` త‌న‌ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారింది. ఈ సిరీస్ టీజ‌ర్ ద‌శ నుంచే క్యూరియాసిటీని పెంచింది. ఎనభైల నాటి (1980 కాలం) కల్పిత నేపథ్యం, మహిళల ఆధిపత్యం.. నేర సామ్రాజ్యాల మధ్య జరిగే ఆధిపత్య పోరు ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ట్రైలర్‌లో కనిపించిన విజువల్స్ ప్రకారం.. పురుషాధిక్య ప్రపంచాన్ని ఎదిరించే ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా కీర్తి సురేష్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ తరహా ఇంటెన్స్ యాక్షన్ జోనర్ కీర్తికి ఓ కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా రాధిక ఆప్టే లాంటి ఇంటెన్స్ పెర్ఫామ‌ర్ తో పోటీప‌డుతూ న‌టించ‌డం కీర్తికి అద‌న‌పు బూస్ట్ ఇచ్చే అంశం. ఈ సిరీస్ లో ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి న‌టించార‌ని ట్రైల‌ర్ చెబుతోంది.

కేవలం థియేటర్ విజయాలకే పరిమితం కాకుండా ఓటీటీ వేదికల ద్వారా నటీమణులు సరికొత్త ప్రేక్షకులను చేరుకుంటున్నారు. `అక్క` లాంటి భారీ వెబ్ సిరీస్‌లు గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువ కావడానికి ప్రధాన మార్గంగా మారుతున్నాయి. దీనితో పాటు కీర్తి చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన భారీ లైనప్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు సోలో హీరోయిన్ ప్రాజెక్టులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న కీర్తి సురేష్‌ మార్కెట్ మునుముందు రానున్న‌ విజయాలతో మరింత బలపడే అవకాశం ఉంది. నటిగా గుర్తింపు ఉన్నా వరుస విజయాలు లేకపోతే దీర్ఘకాలంలో ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి.. ఈ డిజిటల్ ప్రయోగం ఈ ప్ర‌తిభావ‌నికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News