విలన్ గా 'లవర్' బాయ్.. ఇది పెద్ద ప్లానే..
సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే హీరోగానే నటించాల్సిన అవసరం లేదు.
సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే హీరోగానే నటించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి విలన్ రోల్ కూడా కెరీర్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు మాలీవుడ్ యంగ్ హీరో నస్లెన్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. 'ప్రేమలు' సినిమాతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు సూర్య సినిమాలో సీరియస్ కిల్లర్ గా కనిపించబోతున్నారు. అయితే తమిళంలో ఫస్ట్ మూవీకే ఇలాంటి రోల్ ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే కనిపిస్తోంది.
నిజానికి నస్లెన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఆయన ఇన్నోసెంట్ యాక్టింగ్, కామెడీ. మలయాళంలో యంగ్ హీరోగా ఎదిగిన ఆయన.. 'ప్రేమలు'తో ఇతర లాంగ్వేజ్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యారు. ఇలాంటి సమయంలో అదే తరహా పాత్రలు చేస్తూ ముందుకు వెళ్లొచ్చు. కానీ అలా కాకుండా తనలో మరో నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. సూర్య నటిస్తున్న 'సీన్' సినిమాలో ఈశ్వరన్ అనే సీరియల్ కిల్లర్ రోల్ ను ఎంచుకున్నారు.
ఆ సినిమాతోనే నస్లెన్ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. తొలి సినిమాతోనే ఒక స్టార్ హీరోకు విలన్ గా కనిపించడం ఆయనకు పెద్ద ఛాన్సే. పైగా ఇది నార్మల్ విలన్ రోల్ కాదు. ఎలాంటి ఎమోషన్స్ లేని క్రూరమైన హంతకుడిగా ఆయన కనిపించనున్నారు. రీసెంట్ గా విడుదలైన రోల్ ప్రోమోలో కూడా ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఒక వ్యక్తిని హత్య చేసిన తర్వాత కూడా నస్లెన్ ఏమాత్రం కంగారు పడరు.
కూల్ గా ఫోన్లో ఇన్ స్టాగ్రామ్ చూస్తూ మరో హత్యకు సిద్ధమవుతున్నట్లు చూపించారు. ఆ సీన్ ఆయన ఇప్పటివరకు చేసిన రోల్స్ కు పూర్తి భిన్నంగా ఉంది. ఆ ప్రోమోను సూర్య నెట్టింట్ రిలీజ్ చేసి నస్లెన్ కు కోలీవుడ్ లోకి వెల్కమ్ చెప్పారు. దీంతో ఆ రోల్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక సినిమాలో సూర్య పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. దర్శకుడు జీతూ మాధవన్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గతంలో ఆయన రూపొందించిన 'ఆవేశం' మంచి విజయాన్ని అందుకోవడంతో 'సీన్'పై కూడా అంచనాలు ఉన్నాయి. మరి కథలో నస్లెన్ రోల్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది కూడా ఆసక్తికరమే. కేవలం స్టార్ హీరోకు విలన్ గా కనిపించడమే కాకుండా, తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తే ఆయనకు మరిన్ని కొత్త అవకాశాలు రావచ్చు. నటులు ఒకే తరహా పాత్రలకు పరిమితమైతే కొంతకాలానికి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది.
అందుకే కెరీర్ లో సరైన సమయంలో భిన్నమైన పాత్రలు ఎంచుకోవడం ముఖ్యం. నస్లెన్ ఇప్పుడు అదే చేస్తున్నారు. అయితే లవర్ బాయ్ గా అభిమానులను నవ్వించిన ఆయన.. హంతకుడిగా ఎంత భయపెడతారనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 6న 'సీన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోగా వచ్చిన గుర్తింపును పక్కనపెట్టి విలన్ గా కొత్త జర్నీ మొదలుపెట్టడం నస్లెన్ తీసుకున్న డెసిషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో మరి.