ధురంధర్‌తో పోలిక పెద్ద సాహసం...!

ఈ సినిమాను మొదట 2026 దీపావళి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ మేకింగ్‌ విషయంలో చాలా ఆలస్యం అయింది.

Update: 2026-09-05 11:30 GMT

తమిళ స్టార్ హీరో సిలంబరసన్ టిఆర్‌ అలియాస్ శింబు ప్రస్తుతం 'అరసన్‌' అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. వెట్రిమారన్‌ గతంలో తెరక్కించి సూపర్‌ హిట్ అయిన 'వడ చెన్నై' యూనివర్శ్‌ నుంచి అరసన్‌ సినిమా వస్తుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. వడ చెన్నై కథకు, అందులోని పాత్రలకు ఈ సినిమా కథకు సంబంధం ఉంటుంది. సూపర్‌ హిట్‌ వడ చెన్నై యూనివర్శ్ కావడంతో పాటు, వెట్రిమారన్‌, శింబు కాంబో కావడంతో అంచనాలు మొదటి నుంచి భారీగా పెరుగుతూ వచ్చాయి. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో దాదాపుగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో కలైపులి ఎస్. థాను తన నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

శింబు హీరోగా రూపొందుతున్న అరసన్‌...

ఈ సినిమాను మొదట 2026 దీపావళి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ మేకింగ్‌ విషయంలో చాలా ఆలస్యం అయింది. షూటింగ్‌లో జాప్యం కారణంగా 2027 పొంగల్‌కి సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు వెట్రిమారన్‌ కొన్నాళ్ల క్రితం చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు పొంగల్‌ రేసులోనూ అరసన్‌ సినిమా లేదని తమిళ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్‌ కు ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో మళ్లీ వాయిదా వేయాలని భావిస్తున్నారట. అందుకే సినిమా పొంగల్‌ కి రాదని తేలిపోయింది. శింబు అభిమానులతో పాటు, వెట్రిమారన్‌ సినిమాలను పిచ్చిగా అభిమానించే ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెట్రిమారన్‌ మార్క్‌ ఈ సినిమాలో క్లీయర్‌గా కనిపించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

వెట్రిమారన్‌ దర్శకత్వంలో...

తాజాగా అరసన్‌ సినిమా గురించి శింబు చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఆ సినిమాపై ఉన్న అంచనాలను దాదాపు డబుల్‌ చేశాయి అనడంలో సందేహం లేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో శింబు మాట్లాడుతూ... అనిరుధ్‌తో కలిసి అరసన్‌ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా తమ కాంబో బ్లాస్ట్‌ అవుతుందని కుండ బద్దలు కొట్టాడు. అరసన్‌ కోసం అనిరుధ్‌ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని శింబు పేర్కొన్నాడు. చాలా మంది ఊహిస్తున్న దాని కంటే ఈ సినిమా చాలా పెద్దది అన్నాడు. అంతే కాకుండా బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ధురంధర్‌ కి ఏమాత్రం తగ్గకుండా అరసన్‌ ఉంటుందని శింబు ధీమా వ్యక్తం చేశాడు. ధురంధర్‌ చూపించిన ప్రభావం ఎలాంటిదో పాన్ ఇండియా రేంజ్‌లో అరసన్‌ సినిమా అలాంటి ప్రభావంను చూపిస్తుందని శింబు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

శింబు సినిమాకు ధురంధర్‌తో పోలిక...

ఒక హీరో తన సినిమా గురించి గొప్పగా చెప్పడం తప్పేం కాదు, సినిమా పబ్లిసిటీలో అది మామూలే. అయితే ఒక బ్లాక్‌ బస్టర్‌ను చూపించి ఆ స్థాయిలో మా సినిమా ఉంటుందని చెప్పడం అనేది కచ్చితంగా చాలా పెద్ద సాహసం. సినిమా విడుదల సమయంలో ప్రతి ఒక్కరూ ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుని మరీ చూస్తారు. ఆ సినిమాకు ఏ మాత్రం ఈ సినిమా తక్కువ ఉన్నా జనాలకు ఎక్కదు, అంతే కాకుండా నెగటివ్‌ ప్రచారం మొదలు అవుతుంది. అందుకే ఇతర సినిమాలతో పోల్చుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

అరసన్‌ సినిమాను ధురంధర్‌ వంటి పెద్ద సినిమాతో పోల్చడంను బట్టి చూస్తే శింబుకు ఈ సినిమాపై ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వెట్రిమారన్‌ సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఏ మేరకు ఆడుతాయి అనేది కొందరిలో ఉన్న అనుమానం. కాని శింబు మాత్రం అరసన్‌ భారీ పాన్ ఇండియా మూవీ, ధురంధర్‌ పాటి మూవీ అంటూ చెప్పడంతో ఆసక్తి పెరిగింది. మరి ఆ స్థాయిలో సినిమా ఉంటుందా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News