రోజా, అదుర్స్ మూవీస్ బామ్మ మృతి!

ఎన్టీఆర్ , నయనతార కలయికలో..వల్లభనేని వంశీ మోహన్ నిర్మాణంలో ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో.. 2010 జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం అదుర్స్.

Update: 2026-10-30 10:22 GMT

ఎన్టీఆర్ , నయనతార కలయికలో..వల్లభనేని వంశీ మోహన్ నిర్మాణంలో ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో.. 2010 జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం అదుర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి బామ్మగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటీమణి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. 92 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె చెన్నైలోని పల్లాపురంలో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇక ఈమె భౌతిక కాయాన్ని అభిమానులు, సెలబ్రిటీల సందర్శనార్థం తన నివాసంలో ఉంచారు.

అదుర్స్ సినిమాతో మంచి గుర్తింపు..

ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమాలో తనికెళ్ల భరణికి తల్లిగా, ఎన్టీఆర్ పోషించిన ఛారీ పాత్రకు బామ్మగా నటించి తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. ముఖ్యంగా వత్సల రాజగోపాల్ అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బామ్మ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు.

60 యేట ఇండస్ట్రీలోకి.. 400కు పైగా చిత్రాలు..

కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన వత్సల రాజగోపాల్.. స్కూల్లో చదువుతున్నప్పుడే నృత్యం, నాటక రంగంపై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అలా ఒకవైపు చదువుకుంటూనే.. మరొకవైపు నాటక రంగంలో తన ఆసక్తిని కనబరుస్తున్న సమయంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దృష్టిని ఆకర్షించారు. అలా ఈమెకు రోజా చిత్రంలో ఒక పాత్రను అందించారు మణిరత్నం. 1992లో వచ్చిన ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో హీరోయిన్ మధు అమ్మమ్మగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వత్సల రాజగోపాల్ తన 60 ఏటా రోజా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం గమనార్హం. ఆ తర్వాత వరుసగా అవకాశాల అందుకున్న వత్సల రాజగోపాల్ తెలుగు, తమిళ్ కలుపుకొని మొత్తం 400కు పైగా చిత్రాలలో నటించి ఆడియన్స్ ను అలరించారు.

సినిమాలతో పాటు సీరియల్స్ కూడా..

సతి లీలావతి, రిథమ్, విన్నర్ , పట్టియల్, ధామ్ ధూమ్, కళ్యాణ సమయల్ సాదం వంటి హిట్ సినిమాలలో నటించిన ఈమె.. ఒకవైపు సినిమాలలోనే కాదు మరొకవైపు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. చిత్తి, వసంతం, ఆనందం, ముంధనై ముడిచ్చు లాంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.

క్లర్క్ ఉద్యోగాన్ని వదిలి ఇండస్ట్రీలోకి..

నాటకరంగంలో పనిచేస్తున్నప్పుడే ఒక నాటక బృందంలో చేరిన ఈమె.. నాటకాలలో ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత కేరళ నుండి 1953లో చెన్నైకి వచ్చిన వత్సల రాజగోపాల్ అక్కడే క్లర్కుగా ఉద్యోగం పొందారు. ఉద్యోగం చేస్తూనే నాటక ప్రదర్శన ఇస్తూ మణిరత్నం కంట్లో పడిన ఈమె.. సినిమాలలోకి వచ్చి ఇక్కడ తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు వయోభారంతో కన్నుమూసిన వత్సల రాజగోపాల్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు , అభిమానులు, నెటిజన్స్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ఈమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు.

Tags:    

Similar News