Nayanthara: ఇప్పుడు అతనితో రిస్క్ అవసరమా?

సినిమా ఇండస్ట్రీలో పాత ప్రేమ కథలు..కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.

Update: 2026-10-30 08:30 GMT

సినిమా ఇండస్ట్రీలో పాత ప్రేమ కథలు..కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు ప్రేమించుకుని విడిపోయిన జంట మళ్లీ కలిసి సినిమా చేస్తుందంటే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి వార్తే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నయనతార, శింబు మళ్లీ కలిసి నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు శింబు, నయనతార ప్రేమ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా నిలిచింది. తమిళంలో మంచి విజయం సాధించిన వల్లభ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అప్పట్లో వీరిద్దరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు కూడా బయటకు రావడంతో ఈ విషయం పెద్ద దుమారమే రేపింది.

విడిపోయిన తర్వాత శింబుతో కలిసి నటించే ప్రసక్తే లేదని నయనతార గతంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ కాలక్రమంలో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. విడిపోయిన దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ శింబుతో కలిసి ఓ సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి ఈ మాజీ ప్రేమికులు తెరపై కనిపించబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.

తాజా సమాచారం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ నేపథ్యంతో రూపొందే ఈ చిత్రంలో నయనతార యాక్షన్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె కోసం ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. అన్నీ కుదిరితే డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతోంది. నయనతారకు ఇప్పుడు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో తన మాజీ ప్రియుడితో కలిసి సినిమా చేయడం అవసరమా అనే కామెంట్స్ కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు.

మరోవైపు గతాన్ని పక్కనపెట్టి వృత్తిపరంగా కలిసి పనిచేయడంలో తప్పేముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నయనతార ఈ నిర్ణయంతో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది..ఈ కాంబినేషన్ నిజంగా సినిమాగా పట్టాలెక్కుతుందా.. అనేది చూడాలి.

Tags:    

Similar News