సైలెంట్ మోడ్ ఆఫ్.. ప్రమోషన్లలో త్రివిక్రమ్ కొత్త స్పీడ్!

కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక పావుగంట స్పీచ్ ఇవ్వడం, ఒకటి రెండు సెలెక్టెడ్ ఇంటర్వ్యూలు మాట్లాడి సైలెంట్ అయిపోవడం ఆయనకు అలవాటు.

Update: 2026-10-30 04:00 GMT

ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా వస్తోందంటే ప్రమోషన్లు చాలా పరిమితంగా ఉండేవి. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక పావుగంట స్పీచ్ ఇవ్వడం, ఒకటి రెండు సెలెక్టెడ్ ఇంటర్వ్యూలు మాట్లాడి సైలెంట్ అయిపోవడం ఆయనకు అలవాటు. సినిమానే మాట్లాడాలి తప్ప మనం ఎక్కువ చెప్పకూడదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవారు. ముఖ్యంగా మీడియా నేరుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రెస్ మీట్లకు ఆయన ఎప్పుడూ కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు.

కానీ ఆదర్శ కుటుంబం విషయంలో మాత్రం మాటల మాంత్రికుడు పూర్తిగా రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, నేటి డిజిటల్ ట్రెండ్ కు తగ్గట్టుగా మైక్ పట్టుకుని మీడియా ముందుకు వచ్చేశారు. జర్నలిస్టులు అడిగిన రకరకాల ప్రశ్నలకు ఎక్కడా మొహం తిప్పుకోకుండా, చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఇంతవరకు తెరవెనుక మాత్రమే కనిపించిన ఆయన సరదా స్వభావాన్ని ఇప్పుడు ప్రెస్ ముందే లైవ్ గా బయటపెట్టడం అందరినీ ఆకట్టుకుంది.

ఈవెంట్లలో వైరల్ కంటెంట్ ఇవ్వడంలో కూడా ఆయన వెనుకడుగు వేయట్లేదు. వేదికపై శ్రీనిధి శెట్టితో సరదా బాంటర్ కావచ్చు, తోటి నటీనటులు వేసిన కౌంటర్లకు నవ్వుతూ సమాధానం ఇవ్వడం కావచ్చు.. సోషల్ మీడియా రీల్స్ కు కావాల్సినన్ని మూమెంట్స్ ఇచ్చారు. వెంకటేష్ తో 22 ఏళ్ల గ్యాప్ ఎందుకొచ్చిందనే ప్రశ్న మొదలుకుని పాన్ ఇండియా ఆలోచనల దాకా ప్రతి పాయింట్ ను చాలా క్యాజువల్ గా డీల్ చేశారు. ఎలాంటి మొహమాటం లేకుండా నవ్వుతూ మాట్లాడిన తీరు అందరికీ కొత్తగా అనిపించింది.

ఇలాంటి మార్పు నిజానికి నేటి ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో సినిమా ఎంత బాగున్నా, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ యాక్టివ్ గా ఉండాల్సిందే. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్లే ప్రమోషన్ల కోసం ఊరూరా తిరుగుతున్నప్పుడు, కంటెంట్ ను నమ్ముకుని ఇంట్లో కూర్చుంటే బజ్ క్రియేట్ చేయడం కష్టం. ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఇలాంటి ఓపెన్ ఇంటరాక్షన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

త్రివిక్రమ్ ఈ గ్రౌండ్ రియాలిటీని బాగా గుర్తించినట్లున్నారు. గుంటూరు కారం తర్వాత వచ్చిన మిక్స్ డ్ రియాక్షన్స్ కూడా ఆయన ఆలోచనా విధానాన్ని కాస్త మార్చి ఉండొచ్చు. ఎప్పుడూ ఫిలాసఫీలు మాట్లాడుతూ దూరం దూరంగా ఉండటం కంటే, ఆడియన్స్ కు దగ్గరగా ఉంటూ వైబ్ క్రియేట్ చేయడం వల్ల ప్రాజెక్ట్ కు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఆయనలోని అన్‌స్క్రిప్టెడ్ హ్యూమర్, లైవ్ టైమింగ్ బయటకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా మారిపోతున్నాయి. ఇది సినిమా బజ్ ను అమాంతం పెంచుతోంది. త్రివిక్రమ్ లో వచ్చిన ఈ ఫ్రెష్ చేంజ్ టాలీవుడ్ కు ఒక మంచి సంకేతం. రాబోయే ప్రాజెక్టులకు కూడా ఇదే ఎనర్జీని కంటిన్యూ చేస్తే, ఆయన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఆటోమేటిక్ గా భారీ క్రేజ్ దక్కుతుంది. ఈ సరికొత్త గురూజీ అవతార్ ఫ్యాన్స్ కు కూడా ఫుల్ కిక్ ఇస్తోంది.

Tags:    

Similar News