రాయల్ ఫ్రేమ్‌లో పాలక్.. గ్లామర్ ఓకే కానీ..

మల్టీకలర్ గౌన్, దానికి తగ్గ ఆభరణాలతో పాలక్ కనిపించింది. కానీ డ్రెస్సు కంటే ఫొటోలను తీసిన విధానమే స్పెషల్ గా ఉంది.

Update: 2026-10-29 23:30 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండీ లుక్స్‌తో కనిపించే పాలక్ తివారీ, ఈసారి పూర్తిగా వేరే తరహా ఫొటోషూట్ చేసింది. పాతకాలపు పెయింటింగ్‌ను గుర్తుచేసే బ్యాక్‌గ్రౌండ్‌లో రాజకుమారిలా పోజులిచ్చింది. 'ఫెల్ట్ లైక్ ఎ పెయింటింగ్' అంటూ షేర్ చేసిన ఫొటోలు ఆమెకు బాగా సెట్ అయ్యాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత క్రేజ్ ఉన్న పాలక్‌కు సినిమాల్లో మాత్రం ఇంకా ఆ స్థాయి బ్రేక్ రాలేదు.

 

మల్టీకలర్ గౌన్, దానికి తగ్గ ఆభరణాలతో పాలక్ కనిపించింది. కానీ డ్రెస్సు కంటే ఫొటోలను తీసిన విధానమే స్పెషల్ గా ఉంది. వెనుక పాతకాలపు ప్రకృతి చిత్రాలు, మసకబారిన రంగులు వింటేజ్ ఫీల్ ఇచ్చాయి. ఒక్కో ఫ్రేమ్‌లో ఆమె పోజులు కూడా ఆ కాన్సెప్ట్‌కు తగ్గట్లుగా ఉన్నాయి. పోస్ట్‌కు పాత హిందీ పాటను కూడా జోడించింది. దాంతో రెగ్యులర్ గ్లామర్ ఫొటోషూట్ కంటే కొంచెం కొత్తగా ప్రయత్నించిందని చెప్పొచ్చు.

 

ప్రముఖ నటి శ్వేతా తివారీ కూతురిగా పాలక్‌కు మొదటి నుంచే గుర్తింపు ఉంది. 'బిజ్లీ బిజ్లీ' మ్యూజిక్ వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీతో సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'లో అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమా ఆమెను హీరోయిన్‌గా మరో స్థాయికి తీసుకెళ్లలేదు. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌కు, సినిమా అవకాశాలకు మధ్య తేడా అప్పుడే కనిపించింది.

 

ఆ తర్వాత 2025లో 'ది భూత్నీ', 'రోమియో ఎస్3'లో కనిపించింది. కానీ ఈ చిత్రాలు కూడా ఆమెకు పెద్ద కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఫొటోషూట్లు, బ్రాండ్ ప్రమోషన్లతో తరచూ కనిపిస్తున్నా, సినిమాల్లో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర మాత్రం ఇంకా దక్కాల్సి ఉంది. మే నెలలో ప్రైమ్ వీడియోలో విడుదలైన 'లుక్ఖే' వెబ్ సిరీస్‌లో పాలక్ కాస్త భిన్నమైన పాత్ర చేసింది. సంగీతమే జీవితంగా భావించే సనోబర్‌గా కనిపించింది.

వ్యసనంతో ఇబ్బందిపడి, ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించే యువతి పాత్ర అది. ఈ పాత్ర కోసం కనీసం పదిసార్లు ఆడిషన్ ఇచ్చినట్లు పాలక్ గతంలో చెప్పింది. గ్లామర్ ఇమేజ్ దాటి నటనకు అవకాశం ఉన్న కథలపై ఆమె ఆసక్తి చూపిస్తోందనడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు విశాల్ జెత్వాతో కలిసి ఆనంద్ తివారీ దర్శకత్వంలో మరో ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. షూటింగ్ కూడా మొదలైనట్లు సమాచారం. ఇక పాలక్ కెరీర్‌ను గమనిస్తే సినిమాలకే పరిమితం చేయడం లేదు. మరి కొత్త ప్రాజెక్ట్‌లో ఆమె ఎలాంటి పాత్ర చేస్తుందనేదే చూడాలి.

Tags:    

Similar News