నందమూరి ఫ్యాన్స్ కల.. మెగా ఫ్యాన్స్‌కు మరో కిక్!

నందమూరి అభిమానుల విషయానికొస్తే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒకే వేదికపై కనిపించడం అరుదు.

Update: 2026-10-29 14:50 GMT

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్టార్ హీరోలు కలిసి కనిపిస్తే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. సినిమా ఫంక్షన్లలో పక్కపక్కన నిలబడినా ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది ముగ్గురూ ఒకేచోట కూర్చుని సరదాగా ముచ్చటిస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. టాలీవుడ్‌లో నందమూరి, మెగా అభిమానులకు ఇలాంటి కోరికలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి కొత్త ఓటీటీ షోతో మెగా ఫ్యాన్స్ ఆశ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నందమూరి అభిమానుల విషయానికొస్తే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒకే వేదికపై కనిపించడం అరుదు. 2018లో 'అరవింద సమేత' సక్సెస్ మీట్‌లో ముగ్గురూ కలిసి అభిమానులను అలరించారు. ఎన్టీఆర్ బయోపిక్ కార్యక్రమాల్లోనూ కనిపించారు. ఆ తర్వాత 2019లో కల్యాణ్ రామ్ '118' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య, తారక్ హాజరయ్యారు. అయితే వీళ్లు ముగ్గురూ కలిసి సరదాగా మాట్లాడుకునే ప్రత్యేక ఇంటర్వ్యూ వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ముఖ్యంగా బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోకు మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్లు వచ్చారు. కానీ సొంత కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం ఇప్పటివరకు ఈ షోలో కనిపించలేదు. బాబాయ్‌తో అబ్బాయిలిద్దరూ కలిసి ఒక ఎపిసోడ్ చేస్తే ఆ కిక్కే వేరని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

మెగా ఫ్యామిలీలో పరిస్థితి కాస్త భిన్నం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అప్పుడప్పుడు కుటుంబ వేడుకలు, సినిమా కార్యక్రమాల్లో కలుస్తుంటారు. గతేడాది 'ఓజీ' స్పెషల్ షోను కూడా కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. అయితే 'చిరుత' సమయంలో జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు అప్పట్లో మంచి ఆదరణ దక్కింది. ఆ తర్వాత ముగ్గురి మధ్య అలాంటి సుదీర్ఘ సంభాషణను చూసే అవకాశం అభిమానులకు పెద్దగా రాలేదు.

ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి చేస్తున్న 'మెగావర్స్'తో ఆ కోరిక నెరవేరే అవకాశముంది. ఈ షోలో పవన్, చరణ్ ఒకే ఎపిసోడ్‌కు అతిథులుగా రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ముగ్గురినీ కలిసి చూడటమే కాకుండా వారి మధ్య ఆసక్తికరమైన ముచ్చట్లు వినే అవకాశం దక్కుతుంది. అయితే ఇది ఇంకా ఆలోచన దశలో ఉందా లేదా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. చరణ్ కూడా పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. చిరంజీవి వారిద్దరితో మాట్లాడితే చిన్నప్పటి సంగతుల నుంచి సినిమా అనుభవాల వరకు ఎన్నో విషయాలు బయటకు రావచ్చు. ఇక 'మెగావర్స్' షూటింగ్ ఇప్పటికే మొదలైంది. బ్రహ్మానందం, సునీల్, సత్యతో తొలి ఎపిసోడ్ రూపొందుతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ కూడా అతిథిగా రాబోతున్నారనే టాక్ ఉంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ షో నిర్మాణంలో భాగమైంది. నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతానికి 'కమింగ్ సూన్' అని ప్రకటించగా, స్ట్రీమింగ్ తేదీతో పాటు పూర్తి గెస్టుల లిస్ట్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది.

Tags:    

Similar News