ఆకాశంలో ఒక తార.. లైఫ్ ఫిలాసఫీతో 'రాధే రాధే'
ఈ పాటను పూర్తిగా ఒక రోడ్ జర్నీ నేపథ్యంతో పాటు జీవిత తత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.
తెలుగులో మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్న దుల్కర్ సల్మాన్, ఈసారి 'ఆకాశంలో ఒక తార' అంటూ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమా లాంటి టాప్ బ్యానర్స్ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. ఇప్పటికే వచ్చిన చిట్టి చీమ పాటతో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న టీమ్, లేటెస్ట్ గా 'రాధే రాధే' అనే రెండో సింగిల్ ను విడుదల చేసింది.
ఈ పాటను పూర్తిగా ఒక రోడ్ జర్నీ నేపథ్యంతో పాటు జీవిత తత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా స్వరపరిచి పాడిన ఈ మెలోడీ చాలా స్లోగా, మనసుకు హత్తుకునేలా సాగుతుంది. పరుగులే తప్ప గమ్యం తెలియని నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, అసలు మన ప్రయాణం దేనికోసమనే పాయింట్ ను ఈ పాట ద్వారా సున్నితంగా టచ్ చేసినట్లు కనిపిస్తుంది. వినగానే హుషారెక్కించే బీట్స్ కాకుండా, ప్రశాంతమైన ఫీల్ ను అందించేలా సంగీతం సాగింది.
శ్రీమణి అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. ద్వారక వైపు సాగిన కృష్ణుడి ప్రయాణాన్ని కథానాయకుడి పాత్రకు ముడిపెడుతూ రాసిన లైన్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఏ కలలకు వారధివో, నీదంటూ ఓ లోకం క్షణమాగదు నీ పయనం అంటూ సాగే పదాలు ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయ్యేలా కుదిరాయి. గాయని లిప్సిక పాడిన ఫీమేల్ బిట్ కూడా పాటలోని ఎమోషన్ ను మరింత అందంగా ఎలివేట్ చేసింది.
విజువల్స్ విషయానికి వస్తే దర్శకుడు పవన్ సాధినేని టేకింగ్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ కిటికీలోంచి బయటకు చూసే దుల్కర్ లుక్స్, ఆ చుట్టూ కనిపించే మట్టి రోడ్ల వాతావరణం స్క్రీన్ పై సహజంగా ఉన్నాయి. కృష్ణ పాత్రలో ఆయన ప్రెజెన్స్ చాలా డీసెంట్ గా ఉంది. ఎలాంటి హడావుడి లేకుండా ఒక సాదాసీదా ప్రయాణాన్ని చూపిస్తూనే, పాత్రలోని అంతర్మథనాన్ని కెమెరా ఫ్రేముల్లో చక్కగా ఒడిసిపట్టారు.
సాత్విక వీరవల్లి ఇందులో కథానాయికగా నటిస్తుండగా, శృతి హాసన్, రుహానీ శర్మ ఇతర కీలక పాత్రల్లో మెరవనున్నారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా, పక్కా కంటెంట్ డ్రైవెన్ ఫీల్ గుడ్ డ్రామాగా ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 20న గ్రాండ్ గా థియేటర్లలోకి రానున్న ఈ ప్రాజెక్ట్ పై క్లాస్ సినిమాలను కోరుకునే ఆడియన్స్ లో మంచి హోప్స్ ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా సరైన ప్లానింగ్ తో సాగుతున్నాయి.
ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్స్ కోరుకునే వారికి ఇది కాస్త నిదానంగా అనిపించినా, రిపీట్ మోడ్ లో వినే కొద్దీ ఎక్కే మెలోడీ ఇది. థియేటర్లలో సీన్లతో పాటు చూసినప్పుడు ఈ పాట ఇచ్చే అనుభూతి మరింత బాగుండే అవకాశం ఉంది. పవన్ సాధినేని ఎంచుకున్న ఈ కొత్త ప్రయత్నం దుల్కర్ కు తెలుగులో మరో మంచి సక్సెస్ అందిస్తుందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది.