దేవరకొండ.. ఇది గమనిస్తున్నాడా?

విజయ్ ఈ విషయాన్ని గమనిస్తున్నాడో లేదో కానీ, కెరీర్ పరంగా ఆలోచించాల్సిన అంశమే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'కింగ్‌డమ్'లో విజయ్ డిఫరెంట్ రోల్ లో కనిపించాడు.

Update: 2026-10-29 22:30 GMT

ఒకప్పుడు విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ప్రేమకథ అయినా, కామెడీ అయినా తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. కానీ ఈ మధ్య విజయ్ ఎంచుకుంటున్న సినిమాలు చూస్తే మాత్రం ఒకే తరహా మాస్ పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి సినిమాలో కొత్త లుక్, కొత్త దర్శకుడు ఉంటున్నారు. కానీ తెరపైకి వచ్చేసరికి కత్తులు, రక్తపాతం కామన్ అయిపోతున్నాయి.

విజయ్ ఈ విషయాన్ని గమనిస్తున్నాడో లేదో కానీ, కెరీర్ పరంగా ఆలోచించాల్సిన అంశమే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'కింగ్‌డమ్'లో విజయ్ డిఫరెంట్ రోల్ లో కనిపించాడు. అన్నదమ్ముల అనుబంధం ప్రధానంగా సాగే కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల హింస కూడా ఎక్కువగానే కనిపించింది. సినిమా మేకింగ్‌కు ప్రశంసలు వచ్చినా ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో విజయ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు.

రీసెంట్ గా వచ్చిన 'రణబాలి'లోనూ దాదాపు ఇదే పరిస్థితి. బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగిన కథ కోసం విజయ్ పూర్తిగా మారిపోయాడు. రాయలసీమ యాస, బాడీ లాంగ్వేజ్ కోసం కష్టపడ్డాడు. అయితే సినిమాలో నరుకుడు మరింత ఎక్కువైంది. ముఖ్యంగా రెండో భాగంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువయ్యాయనే అభిప్రాయాలు వచ్చాయి. అప్పటికే చాలా వరకు ఎడిట్ లో లేపేసారు. కథలో మంచి ఎమోషన్ ఉన్నా రక్తపాతం ఎక్కువ కావడంతో సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంది.

ఇప్పుడు 'రౌడీ జనార్ధన' పరిస్థితి చూస్తే మరోసారి అదే అనిపిస్తోంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ గతంలోనే విడుదలైంది. అందులో విజయ్ ఒంటినిండా రక్తంతో, కత్తి పట్టుకుని ప్రత్యర్థులను నరుకుతూ కనిపించాడు. ఎనభై దశకం నాటి రౌడీయిజం నేపథ్యంలో కథ సాగనుంది. పూర్తి సినిమా ఎలా ఉంటుందనేది పక్కనపెడితే, ప్రమోషనల్ వీడియోలో మాత్రం మరోసారి హింసకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

నిజానికి విజయ్‌కు మాస్ పాత్రలతో పాటు లవ్ స్టోరీలు కూడా బాగా కలిసొచ్చాయి. 'పెళ్లిచూపులు', 'గీత గోవిందం' లాంటి సినిమాల్లో అతడి కామెడీ టైమింగ్, యూత్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. 'టాక్సీవాలా'తో మరో తరహా వినోదాన్ని అందించాడు. అలాంటి విజయ్ వరుసగా భారీ యాక్షన్ సినిమాలకే పరిమితమవడం కొంత ఆశ్చర్యంగా ఉంది. మధ్యలో ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటివి చేశాడు కానీ అవేమి అంతగా క్లిక్ కాలేదు. మంచి ప్రేమకథ లేదా కామెడీతో కూడిన డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తే ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది.

మరోవైపు విజయ్ తర్వాతి లైనప్‌లో 'హాయ్ నాన్న' దర్శకుడు శౌర్యువ్ సినిమా కూడా ఉంది. నాని లాంటి హీరోతో ఎమోషనల్ కథను తెరకెక్కించిన దర్శకుడు ఈసారి భారీ స్కేల్ ఎంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లోనూ ఆయుధాలు, ఆగ్రహంతో కూడిన వాతావరణం కనిపించింది. దీంతో ఆ సినిమా కూడా ఇంటెన్స్ యాక్షన్ రూట్‌లోనే ఉండబోతోందనే అంచనాలున్నాయి. అయితే శౌర్యువ్ గత సినిమాలో చూపించిన ఎమోషన్ ఈసారి విజయ్ పాత్రలో ఎంతవరకు ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News