విజయ్ కొడుకు.. ఇది కాస్త కలిసొచ్చేలా ఉంది

సందీప్ కిషన్‌తో తీసిన 'సిగ్మా' ప్రమోషన్లలో జేసన్ ఇంటర్వ్యూలు చూసినా ఇదే అనిపిస్తుంది. ఎక్కడా స్టార్ వారసుడిననే హడావుడి లేకుండా సింపుల్‌గా మాట్లాడారు.

Update: 2026-10-29 15:29 GMT

స్టార్ హీరో కొడుకు వెండితెరకు పరిచయమవుతున్నాడంటే తొలి పోస్టర్ నుంచే హంగామా మొదలవుతుంది. లుక్ ఎలా ఉంది, డ్యాన్స్ చేస్తాడా, తండ్రి స్టైల్ ఉందా అంటూ పోలికలు వస్తాయి. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉంటే తమిళనాట కూడా ఇలాంటి అంచనాలే ఉండేవి. కానీ ఆయన ముందుగా కెమెరా వెనుక నుంచి కెరీర్ మొదలుపెట్టారు. ఇప్పుడు నటుడిగా మారతారనే వార్తల మధ్య ఆ నిర్ణయం మరో రకంగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.

సందీప్ కిషన్‌తో తీసిన 'సిగ్మా' ప్రమోషన్లలో జేసన్ ఇంటర్వ్యూలు చూసినా ఇదే అనిపిస్తుంది. ఎక్కడా స్టార్ వారసుడిననే హడావుడి లేకుండా సింపుల్‌గా మాట్లాడారు. తండ్రి పేరుతో వచ్చే ఒత్తిడి గురించి కూడా ఓపెన్‌గా చెప్పారు. తన పని ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు వివరించారు. పైగా తన తండ్రికి మొత్తం స్క్రిప్ట్ కూడా చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో విజయ్ కొడుకు ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు అనే విషయంలో ప్రేక్షకులకు ముందుగానే కొంత పరిచయం ఏర్పడింది.

ఒకవేళ జేసన్ తొలి సినిమానే హీరోగా చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రతి పోస్టర్‌లో విజయ్ పోలికలు వెతికేవారు. మొదటి పాటలో డ్యాన్స్ నుంచి తొలి ఫైట్ వరకు తండ్రితో పోల్చి చూసేవారు. కానీ దర్శకుడిగా వచ్చిన 'సిగ్మా'కు మిశ్రమ స్పందన వచ్చినా జేసన్ పై అలాంటి తీర్పులు రాలేదు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటించారు.

దర్శకుడిగా పనిచేయడం వల్ల హీరోగా ఉపయోగపడే అనుభవం కూడా దక్కింది. కథను ఎక్కడ మొదలుపెట్టాలి, ఒక సీన్ ఎందుకు పనిచేయడం లేదు, ఎడిటింగ్‌లో ఏం మారుతుందనే విషయాలు దగ్గరుండి చూసే అవకాశం వచ్చింది. రేపు హీరోగా కథలు విన్నప్పుడు ఈ అనుభవం ఉపయోగపడొచ్చు. దర్శకుడి అవసరాన్ని అర్థం చేసుకుని నటించడం కూడా కాస్త సులభమవుతుంది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ కూడా దర్శకుడిగా మొదలై హీరోగా రాణించారు.

మొదటి నుంచి జేసన్ దర్శకత్వంపైనే ఎక్కువ ఆసక్తి చూపించారు. 'సిగ్మా' విడుదలకు ముందే నటనలోకి వచ్చే అవకాశం గురించి అడిగితే, మంచి కథ దొరికితే పరిశీలిస్తానన్నారు. ఇలా నటనకు కూడా అవకాశం ఉంచుకున్న ఆయన, ముందు ఒక పూర్తి సినిమా తీసిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. హీరోగా రావడానికి ముందు తనకు సినిమాపై ఉన్న అవగాహనను చూపించగలిగారు. అభిమానుల ముందు హడావుడిగా నిలబడకుండా తనదైన పద్ధతిలో పరిచయమయ్యారు.

ఇప్పుడు అట్లీ నిర్మాణంలో, 'డ్యూడ్' దర్శకుడు కీర్తీశ్వరన్‌తో జేసన్ హీరోగా పరిచయమవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ కుదిరితే మొదటి హీరో సినిమాకు కావాల్సిన అండ దొరికినట్లే. అయితే ఈసారి విజయ్ కొడుకనే క్రేజ్‌తో పాటు జేసన్ గురించి ప్రేక్షకులకు ముందే కొంత అవగాహన ఉంది. 'డ్యూడ్'లో ప్రదీప్‌ను డైరెక్ట్ చేసిన కీర్తీశ్వరన్ ఈసారి జేసన్‌కు ఎలాంటి పాత్ర రాస్తారనేది ఆసక్తికరం.

Tags:    

Similar News