రకుల్ గ్రీన్ సిగ్నల్ వెనుక పెద్ద కథే ఉంది!

నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న `రామాయణం` అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉంది.

Update: 2026-10-30 07:29 GMT

నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న `రామాయణం` అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి తారలు నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్‌లో శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో శూర్పణఖ పాత్రను ర‌కుల్ ఓకే చేయడం వెనుక ఉన్న అసలు సీక్రెట్.. ఒక అభిమాని రాసిన సుదీర్ఘమైన లేఖ బయటపడటం ఇండ‌స్టంరీలో వినూత్న‌ చర్చకు దారి తీసింది.

సాధారణంగా రామాయణ గాథలో శూర్పణఖ అనగానే లంకేశ్వరుడు రావణాసురుడి చెల్లెలిగా.. యుద్ధానికి కారణమైన ప్రతికూల పాత్రగానే సమాజం చూస్తుంది. అందుకే మొదట్లో రకుల్ ఈ పాత్రను అంగీకరించాలా? వద్దా? అనే సందేహంలో పడిందట. అయితే ట్రైలర్ గ్లింప్స్ విడుదలైన తర్వాత ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా శూర్పణఖ పాత్రలోని సంక్లిష్టతను విశ్లేషిస్తూ రకుల్‌కు ఓ భావోద్వేగమైన లేఖ రాశారు. చరిత్ర ఆమెను కేవలం ఒకే ఒక్క సంఘటన (ముక్కు కోత) ద్వారా గుర్తుపెట్టుకుందే తప్ప.. ఆమె వెనుక ఉన్న అసలు కోణాన్ని అర్థం చేసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

అభిమాని పంపిన లేఖ రకుల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ పత్రాన్ని సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. `ఈ పాత్రను నేను ఓకే చేయడానికి కారణం మీరు చెప్పిన ఆ కాంప్లెక్సిటీయే. ఒక నటిగా సమాజం మూస ఆలోచనలను సవాలు చేసే పాత్రలు చేయడమే నాకు నిజమైన కిక్ ఇస్తుంది` అని వెల్లడించింది. భారతీయ పురాణాల్లో తప్పుగా అర్థం చేసుకున్న క్యారెక్టర్లలో శూర్పణఖ ఒకటని ర‌కుల్ స్పష్టం చేసింది.

అలాగే `రామాయణం` ప్రాజెక్ట్ భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని.. ఇది ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి, చరిత్రను సగర్వంగా చాటిచెప్పే గ్లోబల్ సినిమా అని రకుల్ వ్యాఖ్యానించింది. రామాయణ మహా యుద్ధానికి మూలకారణమైన శూర్పణఖ పాత్రలో అనేక రకాల ఇమోషనల్ షేడ్స్ ఉంటాయని..నెగెటివిటీ మాత్రమే కాకుండా ఆ పాత్రలోని మానసిక సంఘర్షణను సినిమాలో కొత్తగా చూపించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి రామాయణ సినిమాలోనూ శూర్పణఖను రావణుడి కుట్రలో భాగస్వామిగా లేదా రాముడిపై మోజు పడిన రాక్షసిగానే చూపించారు. కానీ నితీష్ తివారీ వెర్షన్ `రామాయణం`లో శూర్పణఖను ప్రత్యేకమైన గ్రే-షేడ్స్ కలిగిన భావోద్వేగ పాత్రగా మలచడం.. దానికి రకుల్ లాంటి గ్లామరస్ నటిని ఎంచుకోవడం పరిశ్రమ‌ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రేక్షకులను కూడా ఈ పాత్రను ఓ కొత్త కోణంలో.. తెరిచిన మనసుతో స్వీకరించాలని రకుల్ కోరింది.

మొత్తానికి అభిమాని రాసిన ఒకే ఒక్క జాబు స్టార్ హీరోయిన్ ఆలోచనను మార్చి.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత కీలకమైన పాత్రను కొత్త కోణంలో చూపెట్టేలా చేసిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొత్త పాయింట్ సోషల్ మీడియాలో శూర్పణఖ రీ-విజన్ అనే కొత్త రకమైన చర్చకు దారి తీస్తోంది.

Tags:    

Similar News