యువ నటి కంటే ముందే ఫత్వాను ఎదుర్కొన్న టాప్-5 సెలబ్రిటీలు!
సారా కంటే ముందే బాలీవుడ్ సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లపై కూడా రకరకాల కారణాలతో ఫత్వాలు జారీ అయ్యాయి.
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కేదార్‌నాథ్ ధామ్‌తో పాటు.. పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకున్న నేపథ్యంలో.. అల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఆమెపై ఫత్వా జారీ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అక్టోబర్ 25న కేదార్‌నాథ్ ఆలయ ప్రోటోకాల్ ప్రకారం.. అఫిడవిట్ సమర్పించి దర్శనం చేసుకున్నా.. షరియా సూత్రాల ప్రకారం ఇది నిషిద్ధమని మౌలానా ప్రకటించారు. అయితే సెలబ్రిటీల వ్యక్తిగత విశ్వాసాలు- పర్యటనలపై ఇటువంటి వివాదాలు తలెత్తడం.. మత గురువుల నుంచి ఫత్వాలు ఎదురవ్వడం భారతీయ వినోద, క్రీడా రంగాలలో ఇదే మొదటిసారి కాదు.
సారా కంటే ముందే బాలీవుడ్ సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లపై కూడా రకరకాల కారణాలతో ఫత్వాలు జారీ అయ్యాయి. 2007లో తన ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించి పూజలు చేసినందుకు దారుల్ ఇఫ్తా మంజర్-ఎ-ఇస్లామ్ సంస్థ సల్మాన్ ఖాన్‌పై ఫత్వా జారీ చేయగా.. 2008లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఆవిష్కరించినప్పుడు కూడా ఇస్లాంలో విగ్రహ రూపాలు తగవంటూ వ్యతిరేకత ఎదురైంది. మరోవైపు 2013లో తన మూడో కుమారుడు అబ్‌రామ్ సరోగసీ ద్వారా జన్మించిన సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యల నెపంతో షారుఖ్ ఖాన్‌పై మార్కజీ దారుల్ ఇఫ్తా దర్గా అల్ హజ్రత్ ఫత్వా ఇచ్చింది.
సంగీత, రాజకీయ రంగాల్లో సమాజంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖులు కూడా ఈ తరహా మతపరమైన ఆదేశాలను ఎదుర్కొన్నారు. విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ 2015లో ఇరానియన్ చిత్రం `మహమ్మద్: మెసెంజర్ ఆఫ్ గాడ్` చిత్రానికి సంగీత మందించి నందుకు ముంబైకి చెందిన రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది. అలాగే బెంగాలీ నటి, మాజీ ఎంపీ నుస్రత్ జహాన్ హిందూ వ్యక్తిని వివాహం చేసుకుని సింధూరం, మంగళసూత్రంతో పార్లమెంటుకు హాజరవడం...దుర్గాపూజ వేడుకల్లో పాల్గొనడంపై దేవ్‌బంద్ మత గురువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
క్రీడా రంగం- ఎదుగుతున్న యంగ్ ఆర్టిస్టుల విషయంలోనూ తీవ్రమైన ఆంక్షలు ఎదురైన సంఘటనలు ఉన్నాయి. 2005లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సాన్యా మీర్జా టెన్నిస్ కోర్టులో వేసుకునే షార్ట్స్, టీ-షర్టులు ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధమంటూ ఒక మతపరమైన సంస్థ ఫత్వా ఇచ్చింది. 2017లో `ఇండియన్ ఐడల్ జూనియర్` రన్నరప్ నాహిద్ ఆఫ్రిన్ వేదికలపై పాటలు పాడటం... రంజాన్ సమయంలో సంగీత ప్రదర్శనలు ఇవ్వడం శరియా చట్టాలకు వ్యతిరేకమని ఏకంగా 40 మంది మత గురువులు ఫత్వా జారీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రజాదరణ పొందిన స్టార్లు తమ వ్యక్తిగత సంప్రదాయాలు, వృత్తిపరమైన నిర్ణయాలు లేదా ఇతర మతాల విషయంలో గౌరవం ప్రకటించిన ప్రతిసారీ ఇటువంటి ఫత్వాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఇలాంటి మతపరమైన హెచ్చరికలపై తీవ్రంగా స్పందిస్తూ.. లౌకికవాదం - వ్యక్తిగత స్వేచ్ఛపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత నమ్మకాలే ప్రాథమికమని స్పష్టం చేస్తూ.. ఈ తరహా ఫత్వాలను పక్కనబెట్టి తమ కెరీర్, పర్యటనలను కొనసాగిస్తున్నారు.