'అడల్ట్' అయ్యాడు సరే.. నాని మోయాల్సిన బరువు ఇప్పుడు డబుల్!
“సినిమా పరిశ్రమలో అఫిషియల్ గా అడల్ట్ అయ్యాను” అంటూ వేసిన 18 ఏళ్ల సెలబ్రేషన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో 18 ఏళ్లు నిలబడటమే ఒక పెద్ద రికార్డు. అలాంటిది ప్రతి సినిమాకూ తన మార్కెట్‌ను పెంచుకుంటూ, టైర్ 2 పరిమితులను దాటేసి టాలీవుడ్ లీడింగ్ లీగ్‌లో ఉండడం మామూలు విషయం కాదు. ఇప్పుడు నాని ఆ రేసులో గట్టిగానే పరుగెత్తుతున్నాడు. “సినిమా పరిశ్రమలో అఫిషియల్ గా అడల్ట్ అయ్యాను” అంటూ వేసిన 18 ఏళ్ల సెలబ్రేషన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే సమయంలో కెరీర్ మునుపెన్నడూ చూడని అతిపెద్ద బాక్సాఫీస్ ఛాలెంజ్ న కూడా చూడబోతున్నాడు.
‘అష్టాచమ్మా’ నాటి అమాయక రాంబాబు నుంచి మొదలైన కెరీర్, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ జడల్ వరకు వచ్చింది. నాని గ్రోత్ ఎప్పుడూ ఆర్గానిక్‌గా సాగింది. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ‘భలే భలే మగాడివోయ్’, ‘హాయ్ నాన్న’లతో గట్టిగా లాక్ చేసుకుంటూనే, మరోవైపు ‘దసరా’తో మాస్ బెల్ట్‌ను కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన ‘సరిపోదా శనివారం’, రీసెంట్ ‘హిట్ 3’ కూడా మినిమం గ్యారెంటీ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించాయి.
కానీ ‘ది ప్యారడైజ్’ వ్యవహారం వీటన్నింటికంటే పూర్తి భిన్నం. కేవలం మరో హిట్ కోసం పడుతున్న ఆరాటం కాదు.. నాని తన స్టార్‌డమ్‌ను పాన్ ఇండియా లెవెల్‌లో నెక్స్ట్ లీగ్‌కు తీసుకెళ్లగలడా లేదా అని తేల్చే అసలైన టెస్ట్. శ్రీకాంత్ ఒదెల విజన్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.120 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్.
నైజాం హక్కులు మొదలుకుని తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ వరకు అన్నీ రికార్డు ధరలకే అమ్ముడయ్యాయి. ఇక బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు వస్తే సరిపోదు.. మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ రావాలి. లాంగ్ రన్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి హై బడ్జెట్ సినిమాపై ఆడియెన్స్ కు పూర్తిగా ఒక క్లారిటీతో ఉండేలా ప్రమోషన్స్ చేస్తున్నారు.
రూమర్స్ కు ఏమాత్రం తావువ్వడం లేదు. సినిమా సెప్టెంబర్ 24నే వస్తుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, హిందీ వెర్షన్ రిలీజ్ ఆలస్యమవుతుందనే రూమర్లు నార్త్ మార్కెట్ బజ్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లో పడేశాయి. ఎనిమిది భాషల్లో ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్ట్‌కు నార్త్ ఇండియా బెల్ట్ ఓపెనింగ్స్ చాలా కీలకం. ‘ఆయా షేర్’ సాంగ్, నాని రగ్గడ్ గెటప్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైప్ తెచ్చాయి. ఇక అదే బజ్‌ను పాన్ ఇండియా లెక్కల్లోకి మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదు.
18 ఏళ్ల సినిమా కెరీర్ ను సెలబ్రేట్ చేసుకునే వేళ ‘ది ప్యారడైజ్’ సెట్ నుంచే వీడియో వదిలాడు. దీన్ని బట్టి నాని ఫోకస్ ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం డౌట్స్ లేకుండా అనుకున్న సమయానికే వస్తున్నట్లు మేకర్స్ తోపాటు నాని కూడా క్లారిటీ ఇచ్చాడు. చిన్న బడ్జెట్ సినిమాలతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు ఏకంగా వందల కోట్ల మార్కెట్‌ను తన భుజాలపై మోసే రేంజ్‌కు ఎదిగాడు. బాధ్యత పెరిగింది, దాంతో పాటే రిస్క్ పరిధి కూడా రెట్టింపైంది. మరి ఈ సెప్టెంబర్ 24న నాని బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత కోస్తాడో చూడాలి.