బాబురావు మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!
జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పరేష్ రావల్ తాజా చిత్రం `పాస్ట్ టెన్స్ ప్రీమియర్ సందర్భంగా పాల్గొన్న పరేష్ రావల్ ఆడియన్స్‌తో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
నాలుగు దశాబ్దాలగా సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నబాలీవుడ్ దిగ్గజ నటుడు పరేష్ రావల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. పరేష్ రావల్ సుదీర్ఘ కెరీర్లో విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. కమెడియన్‌గా 250కి పైగా చిత్రాల్లో నటించినా? కేవలం 11 సినిమాలు మాత్రమే తనకు నిజంగా నచ్చాయని.. అవి మాత్రమే మంచి సినిమాలని పరేష్ నిర్మొహమాటంగా ప్రకటించారు.
జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పరేష్ రావల్ తాజా చిత్రం `పాస్ట్ టెన్స్ ప్రీమియర్ సందర్భంగా పాల్గొన్న పరేష్ రావల్ ఆడియన్స్‌తో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ వేదికపై పరేష్ రావల్ కెరీర్‌లోని మైలురాళ్లు.. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న నటులంతా తాము చేసిన ప్రతి సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటారు. కానీ పరేష్ రావల్ మాత్రం సువిశాలమైన సినీ ప్రయాణాన్ని అత్యంత నిజాయితీగా బేరీజు వేసుకుని కేవలం 11 చిత్రాలను మాత్రమే సంతృప్తికరమైనవిగా పరిగణిస్తానని తెలపడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
ఈ సందర్భంగా పరేష్ మనసుకు బాగా దగ్గరైన కొన్ని ప్రత్యేకమైన చిత్రాల పేర్లను కూడా పంచుకున్నారు. దేశ ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జీవితం ఆధారంగా 1993లో తెరకెక్కిన `సర్దార్` చిత్రంలో తాను పోషించిన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని.. ఆ బయోపిక్ ఎంతో ఇష్టమైనదని తెలిపారు. అలాగే `తమన్నా`, `ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!`, `ముంబై మేరీ జాన్`.. ఇటీవల రిలీజ్ అయిన `ది స్టోరీ టెల్లర్‌తో` పాటు కల్ట్ కామెడీ క్లాసిక్ `హేరా ఫేరీ` (2000) , `డకైత్` (1987) చిత్రాలను తన జాబితాలో ఉన్న ముఖ్యమైన సినిమాలిగా గుర్తు చేసుకున్నారు.
కెరీర్ ఆరంభంలో పవర్ఫుల్ విలన్ పాత్రలతో ప్రారంభించి అటుపై నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన పరేష్ రావల్.. ఆ తర్వాత కాలంలో బాబురావు పాత్రతో కమెడియన్‌గా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ని విభిన్న జోనర్లలో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు.. తన చిత్రాల్లోని ఎక్కువ భాగం కమర్షియల్ ప్రాజెక్ట్‌లను పక్కనపెట్టి ప్రయోగాత్మకంగా సంతృప్తినిచ్చిన 11 సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం పరేష్ లోని అసలైన నటుడి నిబద్ధతను చాటుతోంది.
ఈ కార్యక్రమంలో పరేష్ రావల్‌తో పాటు ఆయన కుమారుడు ఆదిత్య రావల్ కూడా పాల్గొన్నారు. తండ్రి కెరీర్లో ఏ సినిమాలను ఉత్తమమైనవిగా భావిస్తున్నాడో? తాను కూడా లెక్కపెట్టానని ఆదిత్య సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. తండ్రీకొడుకులిద్దరూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంఖ్యల కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పరేష్ రావల్ నిరూపించారు. వందలాది చిత్రాలు చేసినా, తన మనసుకు నచ్చిన కొన్ని చిత్రాలతోనే ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయేలా నటించవచ్చని నిరూపించిన తీరు యువ నటులకు గొప్ప పాఠంలాంటిదే.