'కింగ్‌'పై 'ఫైట‌ర్' ఎఫెక్ట్‌: దక్షిణాదిన ఈ పెద్ద డైరెక్టర్‌కి పనవ్వదా?

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ `కింగ్`.

Update: 2026-10-31 00:30 GMT

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ `కింగ్`. నవంబర్ 2న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు పురస్కరించుకుని సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియాలో `It's` అంటూ వేసిన ఒక క్రిప్టిక్ పోస్ట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించింది. గత ఏడాది కూడా షారుఖ్ బర్త్‌డే వేళ `దేర్ ఈజ్ ఓన్లీ వన్ కింగ్` అని పోస్ట్ చేసి ఫస్ట్ లుక్ వదిలినట్లే.. ఈసారి కూడా ఏదో పెద్ద అప్‌డేట్ రాబోతోందనే ప్రచారం నడుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తుండగా డిసెంబర్ 24న‌ క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే సిద్ధార్థ్ ఆనంద్ ఎంత హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నా.. దక్షిణాదిలో మాత్రం `కింగ్` ప్రాజెక్ట్ పై అనుకున్నంత క్రేజ్ లేదా ఉత్సాహం కనిపించడం లేదు. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన `జవాన్` అట్లీ దర్శకత్వంలో రావడం.. సౌత్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఇక్కడ ఊహించని విజయాన్ని సాధించింది. కానీ సిద్ధార్థ్ ఆనంద్ శైలి కేవలం బాలీవుడ్ లేదా ఓవర్సీస్ క్లాస్ ఆడియన్స్‌కే పరిమితం అనే భావన దక్షిణాది పంపిణీదారులు, ప్రేక్షక వర్గాల్లో ఉంది. అందువల్ల షారుఖ్ ఖాన్ వంటి గ్లోబల్ స్టార్ ఉన్నా సౌత్ మార్కెట్‌లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ముందస్తు బిజినెస్ లేదా క్రేజ్ ఏర్పడటం లేదనే చర్చ నడుస్తోంది.

దక్షిణాదిన ఈ సినిమాపై హైప్ తగ్గడానికి సిద్ధార్థ్ ఆనంద్ గ‌త‌ చిత్రం `ఫైటర్` ఫెయిల్యూర్ కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణంతో.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో వచ్చిన `ఫైటర్` బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. సాధారణంగా చిత్రసీమలో ఒక దర్శకుడు భారీ ఫ్లాప్ అందుకున్నప్పుడు.. అతడి తదుపరి ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా సరే దానిపై ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా ఇతర ప్రాంతీయ మార్కెట్లలో సందేహాలు నివురుగప్పిన నిప్పులా ఉంటాయి. సిద్ధార్థ్ మేకింగ్ గ్రాండ్ గా ఉన్నా కథ కథనాల్లో బలం ఉండదనే విమర్శ `ఫైటర్`తో మరోసారి రుజువైంది.

సినిమా పరిశ్రమ సూత్రం ప్రకారం.. ఒక దర్శకుడు లేదా హీరో విజయంలో ఉంటే ఆ ప్రభావంతో తదుపరి చిత్రంపై క్యూరియాసిటీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అదే ఒక భారీ డిజాస్టర్ పడితే ఆ నెగెటివిటీ నెక్స్ట్ సినిమా బిజినెస్ -ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. `పఠాన్` లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా వెంటనే `ఫైటర్`తో ప్లాప్ పడటంతో సిద్ధార్థ్ ఆనంద్ మార్కెట్ వ్యాల్యూ తగ్గింది. సౌత్ ఆడియన్స్ మునుపటి లాగా కేవలం టీజర్లు, బిల్డప్ ట్వీట్లకు పడిపోవడం లేదు. కంటెంట్ - టేకింగ్‌లో దమ్ముంటేనే థియేటర్లకు వస్తామనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో `కింగ్` సినిమాను దక్షిణాదిన ప్రమోట్ చేయడం సిద్ధార్థ్ ఆనంద్‌కు ఒక పెద్ద సవాలుగా మారనుంది. పాత మూస పద్ధతిలో సోషల్ మీడియా కోట్స్, క్రిప్టిక్ ట్వీట్లతో సరిపెట్టకుండా ప్రమోషన్ల వ్యూహాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 2026లో రాబోతున్న ఈ చిత్రాన్ని కేవలం నార్త్ లేదా ఓవర్సీస్ మార్కెట్‌కే కాకుండా సౌత్ బెల్ట్‌లో కూడా హిట్ చేయాలంటే బలమైన కంటెంట్‌ను చూపించే విధంగా సరికొత్త ప్రమోషనల్ ప్లాన్స్ సిద్ధం చేయక తప్పదు. మరి నవంబర్ 2న రానున్న‌ అప్‌డేట్‌తో అయినా సిద్ధార్థ్ ఆనంద్ సౌత్ ఆడియన్స్‌లో ఆసక్తిని కలిగిస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News