టాలీవుడ్‌లో ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్ వార్!

చిత్ర పరిశ్రమలో థియేటర్ల వ్యవస్థకు- ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు మధ్య నిశ్శబ్ద యుద్ధం ముదురుతోంది.

Update: 2026-09-05 16:30 GMT

చిత్ర పరిశ్రమలో థియేటర్ల వ్యవస్థకు- ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు మధ్య నిశ్శబ్ద యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా ఉత్తరాదిలో బాలీవుడ్ సినిమాలకు ఎనిమిది వారాల థియేట్రికల్ విండో నిబంధనను మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌లు పక్కాగా అమలు చేస్తున్నాయి. అయితే దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు , తమిళ చిత్రసీమల్లో సినిమాలు విడుదలైన 28 రోజుల్లోనే (నాలుగు వారాలు) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుండటంపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతుండటంతో సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకాడుతున్నారనేది ఎగ్జిబిటర్ల ప్రధాన ఫిర్యాదు. నెల రోజుల్లో ఇంట్లోనే చూడొచ్చు కదా అనే భావన ప్రేక్షకుల్లో బలపడటంతో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు థియేటర్లలో తొలి వారం వసూళ్లు తగ్గి పోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే సౌత్‌లో కూడా ఎనిమిది వారాల ఓటీటీ గ్యాప్‌ను తప్పనిసరి చేయాలని నేషనల్ మల్టీప్లెక్స్ చైన్లు ఒత్తిడి తెస్తున్నాయి.

ఈ ప్రతిపాదనపై తెలుగు, తమిళ చిత్రసీమకు చెందిన నిర్మాతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది సినిమాలకు ఓటీటీ డిజిటల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయమే నిర్మాతల పెట్టుబడి రికవరీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎనిమిది వారాల పాటు స్ట్రీమింగ్‌ను వాయిదా వేస్తే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు చెల్లించే రేట్లు తగ్గుతాయని, అది తమను ఆర్థికంగా దెబ్బతీస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

ఇదే సమయంలో ఓటీటీ సంస్థల వైఖరి కూడా మారింది. గతంలోలాగా భారీ అడ్వాన్సులు ఇవ్వకుండా, థియేట్రికల్ ఫలితాలు , బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే బిజినెస్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. త్వరగా ఓటీటీలోకి తెస్తేనే ఎక్కువ వ్యూయర్ షిప్ వస్తుందని భావించే స్ట్రీమింగ్ సంస్థలు ఎనిమిది వారాల నిబంధన పెడితే డిజిటల్ రైట్స్ ధరలు తగ్గిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఇది నిర్మాతలకు మరింత మింగుడుపడని అంశంగా మారుతోంది.

సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలన్నా? ఓటీటీలో క్రేజ్ తెచ్చుకోవాలన్నా? ముందుగా థియేటర్ వ్యవస్థ బ్రతకడం అవసరం. థియేట్రికల్ రన్ ముగియకుండానే డిజిటల్ రిలీజ్ కావడం వల్ల సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. 50 రోజుల గ్యాప్ ఇవ్వకపోతే ప్రదర్శనకు నిరాకరిస్తామనే హెచ్చరికలు కూడా కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.

మొత్తానికి నిర్మాతల ఆర్థిక ప్రయోజనాలు ఒకవైపు.. థియేటర్ల మనుగడ మ‌ధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ తరహాలో దక్షిణాదిలో కూడా ఎనిమిది వారాల నిబంధనను కఠినంగా అమలు చేయడం అంత సులభం కాదనిపిస్తోంది. పరిశ్రమలోని ప్రధాన వాటాదారులు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ఓటీటీ సంస్థలు ఒకచోట చేరి పరస్పరం ఆమోదయోగ్యమైన మధ్యస్థ మార్గాన్ని కనుగొంటే తప్ప ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్ వార్ కు తెరపడదు.

Tags:    

Similar News