వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే చుట్టూ అప్పుల వివాదం.. సొంత పార్టీ నేత‌కే టోక‌రా!

Update: 2022-04-06 13:31 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సొంత నేత‌లే.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఆర్థికంగా.. ఒక‌రి పై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో.. తమ నుంచి డ‌బ్బులు తీసుకుని.. తిరిగి ఇవ్వ‌లేదంటూ.. ఇటీవ‌ల క‌ర్నూలులో ఒక కేసు వెలుగు చూడ‌గా.. ఇప్పుడు ఇలాంటిదే.. అనంత‌పురంలోనూ క‌నిపించింది. జిల్లాలోని కల్యాణదుర్గం  మ‌హిళా ఎమ్మెల్యేపై 9వ వార్డు కౌన్సిలర్ ప్రభావతి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌ తనవద్ద రూ.కోటిన్నర అప్పు తీసుకుని రూ.కోటి మాత్రమే తిరిగిచ్చారని ఆరోపించారు. మిగతా డబ్బు అడిగితే మున్సిపల్ కార్యాలయంలోనే దాడికి దిగారని, తన అనుచరులతో క‌లిసి కొట్ట‌బోయార‌ని.. తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సొమ్మును తిరిగి ఇమ్మని అడిగినందుకు తమ పార్టీ ఎమ్మెల్యే తమపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం  నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఉష‌శ్రీచ‌ర‌ణ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో 9వ వార్డు కౌన్సిలర్ గాఇదే పార్టీ అభ్య‌ర్థి ప్రభావతి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌తంలో తాను ఉష‌శ్రీచ‌ర‌ణ్‌కు అప్పుగా ఇచ్చాన‌ని.. ప్ర‌భావతి చెబుతున్నారు.. గత ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉష శ్రీ చరణ్కు తాను రూ.1.56 కోట్లు అప్పుగా ఇచ్చానని.. అందులో కోటి రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారన్నారు.

మిగిలిన సొమ్ము అడిగినందుకు ఎమ్మెల్యే తన అనుచరులను పురమాయించి దాడులు చేయిస్తోందని ప్రభావతి ఆరోపించారు. ఉదయం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లి కౌన్సిలర్ ప్రభావతి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న పోలీసులు, వైసీపీ నేతలు సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపారు.

కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన తమపై ఎమ్మెల్యే అనుచరులు కొందరు.. తన తమ్ముడు, భర్త శ్రీకాంత్రెడ్డిపై దాడి చేయించేందుకు ప్రయత్నించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన సొమ్మును వెనక్కి అడిగినందుకు ఇలా చేయడం సరికాదని.. ఈ విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభావతి దంపతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక‌, ఈ విష‌యంపై ఎమ్మెల్యే ఉష‌శ్రీ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News