భారత అండర్ 19 జట్టు రాత మార్చిన తెలుగోడు..

టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు 'సంక్షోభ నివారకుడు'గా లక్ష్మణ్‌కు పేరుండేది. ఇప్పుడు అదే అనుభవాన్ని ఆయన యువ ఆటగాళ్లకు నూరిపోస్తున్నారు.;

Update: 2026-02-07 05:37 GMT

భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కుర్రాళ్లు అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం.. ఫైనల్ లో వైభవ్ సూర్యవంశీ భీకరంగా ఆడడం చూసాక.. అండర్-19 జట్టు ప్రదర్శిస్తున్న అసాధారణ పోరాట పటిమ ఎలా మారిందనే చర్చ సాగుతోంది.. ఇటీవల అండర్ 19 టీ20 కప్ లో పాక్ చేతిలో భారత్ ఫైనల్ లో ఓడిపోయింది. అలాగే ఒకప్పుడు వరుస ఓటములతో సతమతమైన జట్టు ఇప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ అనూహ్య మార్పు వెనుక ఉన్నది మరెవరో కాదు, భారత క్రికెట్ దిగ్గజం, మన తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్. తన ప్రశాంతతతో, చాణక్యంతో యువ భారత్‌ను లక్ష్మణ్ ఎలా తీర్చిదిద్దారు..

కుప్పకూలిన ఆత్మవిశ్వాసం.. ఒక్క నిర్ణయంతో మారిన తలరాత

అండర్-19 వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టు పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అట్టడుగుకు చేరింది. యువ ఆటగాళ్లలో నైపుణ్యం ఉన్నా, కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసేవారు. సరిగ్గా ఈ సమయంలో లక్ష్మణ్ రంగంలోకి దిగారు. ఎక్కడ లోపం ఉందో గుర్తించి, కేవలం టెక్నిక్‌పైనే కాకుండా ఆటగాళ్ల మానసిక దృక్పథంపై ప్రత్యేక దృష్టి సారించారు.

బులవాయో పోరు: ఓటమి అంచున నిలిచి గెలిచిన వైనం

ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లక్ష్మణ్ శిక్షణకు అసలైన పరీక్షగా నిలిచింది. ఛేజింగ్‌లో పాకిస్తాన్ కేవలం 2 వికెట్ల నష్టానికి 150 పైగా పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. భారత్ ఓటమి దాదాపు ఖాయమని అంతా భావించారు. గతంలో అయితే ఇక్కడ భారత బౌలర్లు తడబడేవారు. కానీ, లక్ష్మణ్ నేర్పిన 'సహనం' ఇక్కడ పనిచేసింది. ఏమాత్రం ఆందోళన చెందకుండా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం, ఫీల్డర్లు ప్రతి పరుగును అడ్డుకోవడంతో పాక్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. అసాధ్యమనుకున్న విజయాన్ని భారత్ కైవసం చేసుకుంది. ఈ గెలుపు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

లక్ష్మణ్ మార్క్ శిక్షణ : టెస్ట్ క్రికెట్ అనుభవంతో యువతకు దిశానిర్దేశం

టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు 'సంక్షోభ నివారకుడు'గా లక్ష్మణ్‌కు పేరుండేది. ఇప్పుడు అదే అనుభవాన్ని ఆయన యువ ఆటగాళ్లకు నూరిపోస్తున్నారు. "కఠిన పరిస్థితుల్లోనే అసలైన ఛాంపియన్లు పుడతారు. మ్యాచ్ చివరి బంతి వరకు పట్టు వదలొద్దు." ఇదే లక్ష్మణ్ తన శిష్యులకు ఇచ్చే ప్రధాన మంత్రం.

విజయపథంలో యువ భారత్

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. వరుస విజయాలతో దూసుకుపోతూ గర్వంగా వరల్డ్ కప్ గెలిచింది.. లక్ష్మణ్ రాకతో ఆటగాళ్లలో బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మైదానంలో కనిపిస్తున్నది భయం లేని.. అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన భీకరమైన 'యువ భారత్'.

ఒకప్పుడు బ్యాట్‌తో మ్యాజిక్ చేసిన లక్ష్మణ్.. ఇప్పుడు కోచ్‌గా తన వ్యూహాలతో భారత క్రికెట్ భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఆయన మార్గనిర్దేశంలో ఈసారి అండర్-19 వరల్డ్ కప్ కచ్చితంగా భారత్ సొంతమవుతుందని క్రీడా విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News