టీమ్ ఇండియా అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెడుతోందా?
ఈ వ్యవహారంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో గట్టిగానే కౌంటర్లు వేశారు.
భారత క్రికెట్‌లో ఒక విచిత్రమైన సంప్రదాయం నడుస్తోంది. అదేంటంటే "నువ్వు ఎంత గొప్పగా వికెట్లు తీసినా సరే.. నీకు బౌలింగ్ రాకపోతే నీ ప్లేస్ డగౌట్ లేదా బెంచ్ మాత్రమే!" అవును, ప్రస్తుతం చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ 1-1తో ఉత్కంఠ భరితంగా మారింది సరే కానీ అసలు చర్చ అంతా మన 'అతిపెద్ద మ్యాచ్ విన్నర్' ఎంపిక చుట్టూనే తిరుగుతోంది.
మధ్య ఓవర్లలో వచ్చి మాయాజాలం చేసి ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు టకటకా పడగొట్టే సత్తా ఉన్న కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి తొలి రెండు వన్డేల్లో టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరిని ఆడించింది? వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లను.. ఎందుకంటారా? "బ్యాటింగ్ లోతు" పెంచాలట! అంటే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిలైతే, బౌలర్లు వచ్చి మ్యాచ్‌లు గెలిపించాలి అన్నమాట. తీరా చూస్తే రెండో వన్డేలో మనోళ్లు అనుహ్యంగా చేతులెత్తేశారు. బ్యాటింగ్ లోతు పెరిగింది కానీ స్కోరు బోర్డు మాత్రం పెరగలేదు.
ఆకాష్ చోప్రా సెటైర్లు.. బలిపశువు కుల్దీపేనా?
ఈ వ్యవహారంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో గట్టిగానే కౌంటర్లు వేశారు. "జట్టు కాంబినేషన్ మార్చాలి, ప్రయోగాలు చేయాలి అనగానే మొదట గుర్తొచ్చే పేరు కుల్దీప్ యాదవే" అంటూ ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిలకడగా రాణిస్తున్నా వికెట్లు తీస్తున్నా ప్రతిసారీ అతడినే ఎందుకు పక్కన పెడతారో ఆ దేవుడికే తెలియాలి. "మధ్య ఓవర్లలో కేవలం పరుగులను కట్టడి చేస్తే సరిపోదు బాస్.. వికెట్లు తీయాలి. ఆ విద్య కుల్దీప్‌కు వెన్నతో పెట్టిన విద్య. కానీ మనం మాత్రం వికెట్లు తీసే స్పెషలిస్ట్‌ను వదిలేసి, బ్యాటింగ్ చేసే స్పిన్నర్ల కోసం వెతుకుతున్నాం " అని ఆకాష్ చోప్రా లాంటి అనలిస్టులు దెప్పి పొడుస్తున్నారు.
గాయం తెచ్చిన లక్.. లార్డ్స్‌లోనైనా ఛాన్స్ దక్కేనా?
ప్రస్తుతం ఒక ట్విస్ట్ ఏంటంటే... వాషింగ్టన్ సుందర్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేకు దూరమయ్యాడు. అంటే ప్రకృతి కూడా కుల్దీప్ వైపే మొగ్గు చూపినట్టుంది. ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు వేరే దారి లేదు. సుందర్ లేడు కాబట్టి కుల్దీప్‌ను తీసుకుంటారా లేక మళ్లీ "బ్యాటింగ్ లోతు" సాకుతో వేరే ఆల్‌రౌండర్‌ని వెతుకుతారా? సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లోనైనా ఒక జెన్యూన్ వికెట్ టేకర్ విలువను గుర్తిస్తారా? చూడాలి.
మ్యాచ్ విన్నర్లను బెంచ్‌పై కూర్చోబెట్టి మ్యాచ్‌లు గెలవాలనుకోవడం మనకే చెల్లింది. లార్డ్స్ వన్డేలోనైనా కుల్దీప్ చేతికి బంతి దక్కుతుందా, లేక అతడు డ్రింక్స్ బాటిళ్లు మోయడానికే పరిమితమవుతాడా అనేది టాస్ పడితే గానీ తేలదు. మేనేజ్‌మెంట్ గతాన్ని మర్చిపోయి ఇప్పటికైనా రైట్ డెసిషన్ తీసుకుంటే బెటర్..