డిఫాల్టర్స్... పొలిటీషియన్స్ అయితే ఓకేనా?

Update: 2019-09-05 01:30 GMT
నిజమే... బ్యాంకులను నట్టేట ముంచేసి డిఫాల్టర్స్ గా మారిన వారిపై చర్యల విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డిఫాల్టర్లు... ఏ ఒక్క రంగానికో చెందిన వారు కాదు. వ్యాపారుల్లో చాలా మంది డిఫాల్టర్లుగా మారి బ్యాంకుల నడ్డి విరిచేశారు. అదే సమయంలో రాజకీయాల్లో కొనసాగుతున్న బడా నేతలు కూడా తమ వ్యాపారాల ద్వారా బ్యాంకులను ముంచేసి - తీసుకున్న అప్పులు కట్టకుండా డిఫాల్టర్లుగా తేలారు. అయితే డిఫాల్టర్లలో వ్యాపారుల విషయంలో ఒకలాగా - రాజకీయ నేతల విషయంలో మరోలాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్న మాట కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది.

నిజమే మరి... బ్యాంకులను నట్టేట ముంచిన విజయ్ మాల్యా - నీరవ్ మోదీ తరహా వ్యాపారవేత్తలపై బ్యాంకులు ఒత్తిడి చేస్తే... వారు గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయారు. వారిని దేశానికి తిరిగి రప్పించడంతో పాటుగా వారు తీసుకున్న రుణాలను వసూలు చేసే బాధ్యతలు స్వయంగా ప్రభుత్వమే భుజానికెత్తుకుంది. మరి రాజకీయాల్లో ఉంటూ ప్రజా ప్రతినిధులుగా చెలామణి అవుతూ డిఫాల్టర్లుగా మారిన వారు ఇక్కడే... ఉంటూ - బ్యాంకులు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఉలుకూ పలుకే లేకుండా సాగుతన్న మన నేతలపై బ్యాంకలేమీ చర్యలు తీసుకోలేవా? బ్యాంకుల తరఫున ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవా? అంటే... జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... డిఫాల్టర్లు అయినా రాజకీయ నేతలపై చర్యలు ఉండవన్న మాటే వినిపిస్తోంది.

నిజమే... దేశంలో చాలా మంది రాజకీయ నేతలు నేేర చరితతో పాటుగా బ్యాంకుల నుంచి వందలు - వేల కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టేసి ఇక్కడే ఏమాత్రం ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు. అంతేనా... నేరాలకు పాల్పడిన ఈ తరహా నేతలే చట్టసభల్లో కూర్చుని చట్టాల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు కూడా. ఇలాంటి వారి జాబితా చాలా పెద్దదిగానే ఉన్నా... తెలుగు నేల విషయానికి వస్తే... ఓ సుజనా చౌదరి, ఓ రాయపాటి సాంబశివరావు, ఓ గంటా శ్రీనివాసరావు... ఇలా ఇక్కడ కూడా చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. వీరంతా ఇప్పుడు చట్టసభల్లో సభ్యులుగానో, మాజీ సభ్యులుగానో ఉన్నవాళ్లే. పాలిటిక్స్ లో ఇంకా యాక్టివ్ గా ఉన్న వారే. అయితేనేం... వీరిపై ఈగ కూడా వాలదు.

అదేమంటే... నోటీసులు ఇస్తున్నాం కదా.. వారు కూడా సమాధానం ఇస్తున్నారు కదా. కోర్టులకు వెళ్లారు కదా అన్న మాటలు దర్యాప్తు సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వాల నుంచి కూడా ఇవే సమాధానాలు వస్తున్నాయి. కేంద్రంలో అధికారం కట్టబెడితే... నల్ల కుబేరుల అంతు చూస్తామని అప్పుడెప్పుడో మోదీ కాస్తంత బిగ్గరగానే చెప్పారు. జనం కూడా మోదీ మాటల మనిషి కాదు... చేతల మనిషేనని నమ్మి బీజేపీకి అధికారం కట్టబెట్టారు. మరి ఫస్ట్ టెర్మ్ లో మోదీ ఒక్క నల్ల కుబేరుడినైనా లోపలేశారా? లేదు కదా. ఇక తెలుగు నేల విషయానికి వస్తే కూడా.. ఎన్నికలు రాగానే అవినీతి రహిత పాలన అందిస్తామని అంతా చెబుతూనే ఉన్నారు. జనం నమ్మి ఓట్లేస్తున్నారు. తీరా అధికారం చేతికి అందాకా... అవినీతి పరులను తమ పార్టీలో చేర్చుకుంటూ జనానికి ఇచ్చిన మాటను మరుస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మారుతుందో? జనం సొమ్మును భద్రంగా దాస్తున్న బ్యాంకులు ఎప్పుడు బాగుపడతాయో చూడాలి.


Tags:    

Similar News