సర్కారీ టీచర్ల అక్రమ బంధం.. భర్తను చంపేసిన భార్య
వ్యామోహాలకు బంధాలు బలవుతున్నాయి. తమకున్న వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారన్న కారణంగా భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.;
వ్యామోహాలకు బంధాలు బలవుతున్నాయి. తమకున్న వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారన్న కారణంగా భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే.. సమాజంలో గౌరవనీయ ఉద్యోగాల్లో ఉండే వారు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడటం చూస్తే మాత్రం షాకింగ్ గా ఉంటుంది. పిల్లలకు మంచిమాటలు చెప్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే టీచర్లే.. నీతి తప్పటమే కాదు.. చివరకు ప్రాణాలు తీసేందుకు వెనుకాడని దుర్మార్గం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది.
ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య మొదలైన వివాహేతర సంబంధం.. చివరకు భర్తను బలి ఇచ్చేందుకు సైతం భార్య వెనుకాడని వరకు వెళ్లటం గమనార్హం. అచ్చంపేట పట్టణంలోని మారుతీనగర్ లో గత నెల 25న అనుమానాస్పద రీతిలో 38 ఏళ్ల లక్ష్మణ్ నాయక్ చనిపోయారు. దీంతో.. తన సోదరుడి మరణంపై అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఆ మర్డర్ మిస్టరీని చేధించటమే కాదు.. మరణించిన లక్ష్మణ్ నాయక్ భార్యే ఈ దారుణానికి పాల్పడిన వైనాన్ని గుర్తించారు.
లక్ష్మణ్ నాయక్ భార్య 30 ఏళ్ల పద్మ ఉప్పునుంతల మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తోంది. అదే మండలంలోని తాడూరు ప్రాథమికోన్నత స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న 36 ఏళ్ల గోపీ పరిచయమైంది. అది కాస్తా.. వివాహేతర సంబంధంగా మారింది. ఏడాదిగా వీరి అపవిత్ర బంధం సాగుతోంది. ఇక.. లక్ష్మణ్ నాయక్ విసయానికి వస్తే కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. భార్యకు ఉద్యోగంరావటంతో వారు అచ్చంపేటకు షిప్టు అయ్యారు. అయితే.. ఉద్యోగం లేక ఖాళీగా ఉండేవాడు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా భర్తను తొలగించుకోవటం కోసం పద్మ.. గోపీలు ప్లాన్ చేశారు. నవంబరు 24 రాత్రి నిద్రపోతున్న లక్ష్మణ్ నాయక్ ముక్కు.. నోటిని మూసేసి.. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు.అనంతరం ఏమీ తెలియనట్లుగా స్కూల్ కు వెళ్లిన పద్మ.. ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి.. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన భర్త కాల్ లిఫ్టు చేయట్లేదని చెప్పి ఆందోళననకు వ్యక్తం చేసింది.
మధ్యాహ్నం వేళ హడావుడిగా ఇంటికి వచ్చి.. లోపల భర్త చనిపోయి ఉన్నట్లుగా అందరినీ నమ్మించింది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తమ దర్యాప్తులో భాగంగా పద్మ తీరును అనుమానించారు. అదే సమయంలో పద్మ తాను హత్య చేసిన విషయాన్ని తన సమీప బంధువుకు సైతం చెప్పినట్లుగా గుర్తించారు. లక్ష్మణ్ నాయక్ సోదరుడి ఫిర్యాదుతో పద్మ కదలికల మీద అనుమానించిన పోలీసులు చివరకు మర్డర్ మిస్టరీని ఛేదించారని చెప్పాలి.