హైదరాబాద్ లో రిటైర్డ్ ఎంప్లాయిస్ కోట్లు పోగుట్టుకుంటున్నారు ఇలా..!

ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఆర్థిక మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-01-18 07:30 GMT

ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఆర్థిక మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... డిసెంబర్ 29 - జనవరి 12 మధ్య "క్యాప్‌ స్టోన్" అనే నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ ఫామ్‌ ను నిర్వహించిన మోసగాళ్ల నుండి సికింద్రాబాద్‌ కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ రూ.1.25 కోట్లు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి 14న కేసు నమోదు చేశారు.

అవును... ఆన్ లైన్ లో జరుగుతున్న ఆర్థిక మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సికింద్రాబాద్ కు చెందిన రిటైర్డ్ బ్యాంకర్ రూ.1.25 కోట్లు పోగొట్టుకోగా.. పూణేలో రిటైర్డ్ బ్యాంక్ అధికారి ఆన్‌ లైన్ షేర్ ట్రేడింగ్ స్కామ్‌ లో రూ.5 కోట్లకు పైగా పోగొట్టుకున్నారు. ఇదే క్రమంలో.. ఇటీవల విజయవాడలో 77 ఏళ్ల వ్యక్తి నకిలీ ట్రేడింగ్ గ్రూప్‌ లో చేరి దాదాపు రూ.80 లక్షల పోగొట్టుకున్నారు.

సికింద్రాబాద్ లోని రిటైర్డ్ ఎంప్లాయి విషయానికొస్తే.. యాప్‌ లోని డ్యాష్‌ బోర్డ్‌ లో అతని బ్యాలెన్స్ రూ.1.9 కోట్లకు పైగా పెరిగినట్లు చూపించారు.. కానీ, నిధులను విత్‌ డ్రా చేసుకునే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో.. క్లియరింగ్ ఛార్జీలుగా రూ.58.58 లక్షలు డిపాజిట్ చేయమని అడిగారు. దీంతో.. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. ఇది మచ్చుకు ఓ ఉదాహరణ మాత్రమే!

ఇదే క్రమంలో... మణికొండకు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి.. స్టాక్ బ్రోకరేజ్ సంస్థ విశ్లేషకులుగా నటిస్తూ గత ఏడాది మార్చి, మే మధ్యకాలంలో తనను వాట్సాప్ పెట్టుబడి గ్రూపుల్లోకి ఆకర్షించి రూ. 50.8 లక్షలకు పైగా మోసం చేశారని తెలిపారు. అదేవిధంగా... సికింద్రాబాద్‌ కు చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి డిసెంబర్ 30 - జనవరి 5 మధ్య ఐపీఓ ట్రేడ్‌ లలో పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిపుణులుగా నటించిన మోసగాళ్ల వల్ల రూ.46.25 లక్షలు కోల్పోయారని నివేదించారు.

ఇక.. మియాపూర్‌ కు చెందిన 45 ఏళ్ల ప్రైవేట్ రంగ ఉద్యోగి డిసెంబర్ 26 - జనవరి 9 మధ్య యూఎస్ స్టాక్‌ లలో పెట్టుబడి పెట్టడానికి నకిలీ యాప్‌ ను నిర్వహిస్తున్న మోసగాళ్ల కారణంగా రూ.32.1 లక్షలు కోల్పోయారని చెబుతున్నారు. ఈ అన్ని సంఘటనల్లోనూ భారతీయ న్యాయ సంహిత, సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత విభాగాల కింద కేసులు నమోదు చేయబడ్డాయి.

Tags:    

Similar News