రీల్ 'ఒక్కడు' మాదిరి రియల్ గా.. కాకుంటే ఇదెక్కడి క్రైం

తీవ్ర గాయాలతో యోగానాథన్ మరణిస్తే.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మరణించినట్లుగా బంధువులనునమ్మించారు.;

Update: 2026-02-27 07:07 GMT

అప్పుడెప్పుడో వచ్చిన మహేశ్ బాబు సూపర్ డూపర్ హిట్ మూవీ ‘ఒక్కడు’ గుర్తుంది కదా? సినిమాలో హీరోయిన్ ను అనుకోని పరిస్థితుల్లో హీరో ఇంటికి తీసుకురావాల్సి వస్తుంది. ఇంట్లోవారికి తెలీకుండా హీరోయిన్ ను దాచేయటం.. ఆ తర్వాత వారికి తెలీటం లాంటివి తెలిసిందే. సినిమా కాన్సెప్ట్ వేరు. క్యూట్ లవ్ స్టోరీతో పాటు.. భయంకరమైన విలన్ నుంచి హీరోయిన్ ను తప్పించేందుకు హీరో పడే కష్టమంతా వేరే లెవల్. కానీ.. రియల్ లైఫ్ లో ఇలాంటివేమీ ఉండవు కదా. తెర మీద మాదిరి హీరోల మాదిరి కాకున్నా.. మనుషుల మాదిరి కూడా వ్యవహరించని తీరు కనిపిస్తుంది. ఇంట్లోకి తీసుకురావటం.. తండ్రికి తెలీకుండా రహస్యంగా దాచటం వరకు రీల్ మాదిరి రియల్ లైఫ్ లోనూ పాటించారు.

కాకుంటేనే.. చివర్లో జరిగిన క్రైం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. మరీ ఇంత దారుణమా? అంటూ షాక్ తినేలా చేస్తుంది ఈ ఉదంతం.

రీల్ ఒక్కడు హీరోయిన్ ను హీరో తన ఇంట్లో మారిస్తే.. తాజా ఉదంతంలో తన ప్రియుడ్ని ఇంట్లోనే దాచేయటమే కాదు.. ఏకంగా పెళ్లి చేసుకొని కాపురం చేసిందో యువతి. అయితే.. రీల్ ఒక్కడిలో హీరో తన తండ్రికి తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. రియల్ లో మాత్రం.. సదరు యువతి తన తండ్రికి తెలీకుండా.. ఇంట్లో వారందరికి చెప్పేసి రహస్య కాపురం చేయటం.. ఆ విషయం తెలిసిన తండ్రి ఆమెను తీవ్రంగా మందలిస్తే.. కుటుంబం మొత్తం కలిసి ఆయన్ను దారుణంగా హతమార్చటం మాత్రం రీల్ మూవీకి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని వేలూరుకు సమీపంలోని అరసమరపేటకు చెందిన 63 ఏళ్ల యోగనాథన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి.రిటైర్ అయిన ఆయన ఇటీవల తీవ్రగాయాలతోమరణించారు. బంధువుల్లో కొందరికి అనుమానం రావటంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపగా.. అతను హత్యకు గురైన విషయం బయటకు వచ్చింది. విచారణలో భాగంగా పోలీసులు షాకింగ్ అంశాన్ని గుర్తించారు.

యోగనాథన్ కుమార్తె వినోదిని ఏడాది క్రితం తండ్రికి తెలీకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది. తండ్రికి తెలీకుండానే భర్తను ఇంట్లోకి తీసుకొచ్చి.. కాపురం పెట్టేసింది. యోగనాథన్ కు మినహా ఈ వ్యవహారం ఇంట్లో వాళ్లందరికి తెలుసు. అయినా..ఆయనకు తెలీకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇటీవల కూతురు లవ్ మ్యారేజ్ సంగతి ఆయనకు తెలిసింది. దీంతో.. ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంట్లోని వారంతా కలిసి.. ఆయనపై దాడికి పాల్పడి చంపేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

తీవ్ర గాయాలతో యోగానాథన్ మరణిస్తే.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మరణించినట్లుగా బంధువులనునమ్మించారు. అయితే.. బంధువుల్లో కొందరికి వచ్చిన అనునమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగు చూసి.. అందరూ షాక్ తినేలా చేసింది. యోగనాథన్ భార్య విమలాదేవి.. కొడుకు గోవిందరాజ్.. కూతురు వినోదిని.. ఆమె భర్త.. స్నేహితులు కలిసి చంపేసినట్లుగా గుర్తించి.. వారందరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపింది.


Tags:    

Similar News