నీట్ పరీక్ష రాయాలన్న తండ్రిని చంపేసి చెల్లికి వార్నింగ్
చిన్న చిన్న కారణాలకు సైతం కుటుంబ సభ్యుల్ని చంపుకునే దుర్మార్గం ఇటీవల కాలంలో ఎక్కువైంది.;
చిన్న చిన్న కారణాలకు సైతం కుటుంబ సభ్యుల్ని చంపుకునే దుర్మార్గం ఇటీవల కాలంలో ఎక్కువైంది. కుటుంబ అనుబంధాలకు సంబంధించి కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. చంపటం ఒక ఎత్తు అయితే.. ఆ క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఏ మాత్రం జీర్ణించుకోలేనంత దుర్మార్గంగా ఉండటం గమనార్హం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తన తండ్రిని చంపేసి.. ఏమీ తెలియని అమాయకుడిగా నటిస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తన తండ్రి కనిపించకుండా పోయాడని చెప్పి.. మిస్సింగ్ కేసు నమోదు చేయించిన కొడుకు ఘనకార్యాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చి.. ఈ అతి తెలివిని పోలీసులు చేధించి.. షాకింగ్ నిజాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
ఆర్థికంగా ఏ మాత్రం లోటు లేని కుటుంబం మానవేంద్ర సింగ్. ఇతగాడికి యూపీ రాష్ట్ర రాజధాని లక్నోలో పాథాలజీ ల్యాబులు, మద్యం షాపులు ఉన్నాయి. డబ్బుకు ఏ మాత్రం లోటు లేని ఈ కుటుంబంలో తొమ్మిదేళ్ల క్రితం అనూహ్య విషాదం చోటు చేసుకుంది. మానవేంద్ర సింగ్ సతీమణి అనారోగ్యంతో చనిపోయారు. దీంతో పిల్లల్ని తానే అన్నీ అయి పెంచాడు. ఆర్థికంగా బలంగా ఉండే అతడికి తన కొడుకును డాక్టర్ గా చూడాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఇంటర్ బైపీసీలో మంచి మార్కులు తెచ్చుకున్న కొడుకును నీట్ పరీక్ష రాయాలని తరచూ ఒత్తిడి తెచ్చేవాడు.
తండ్రి కోరిక కొడుక్కి నచ్చేది కాదు. కుటుంబ వ్యాపారాలు చూసుకుంటే చాలంటూ తండ్రితో కొడుకు అక్షత్ గొడవపడేవాడు. ఇదిలా ఉండగా ఈ నెల 20న వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో విచక్షణ కోల్పోయిన అక్షత్ ఇంట్లోని లైసెన్స్ డ్ పిస్టల్ ను తీసుకొని తండ్రిని కాల్చి చంపాడు. కాల్పుల శబ్దానికి బయటకు వచ్చిన చెల్లిని (16) ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఎవరికైనా చెబితే అంతు చూస్తానని హెచ్చరించాడు. దీంతో భయంతో వణికిపోయింది.
తండ్రి డెడ్ బాడీని మూడో అంతస్తు నుంచి కిందకు తీసుకొచ్చి.. రంపంతో ముక్కలుగా కోసి డ్రమ్ములో కుక్కాడు. కొన్ని శరీర భాగాల్ని కారులో మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి విసిరేశాడు. తర్వాతి రోజున పోలీసుల వద్దకు వెళ్లి.. ఢిల్లీకి వెళ్లిన తన తండ్రి జాడ తెలీయటం లేదంటూ ఆందోళనను నటిస్తూ చెప్పాడు. తండ్రి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో మానవేంద్ర ఇంటిని తనిఖీ చేయగా.. అసలు విషయం వెలుగు చూసి విస్తుపోయేలా చేసింది. అక్షత్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతడ్ని ప్రశ్నించగా.. డ్రమ్ములో ఉంచిన శరీర భాగాల వివరాల్ని వెల్లడించాడు.వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్షత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.