రూ.5 వేల ఆశతో ఏకంగా రూ.2.9కోట్లు పోగొట్టుకున్నాడు

అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాల్లో అత్యధికం ఒక అంశం చుట్టూనే తిరుగుతుంటాయి.;

Update: 2026-01-18 04:50 GMT

అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాల్లో అత్యధికం ఒక అంశం చుట్టూనే తిరుగుతుంటాయి. నిశితంగా పరిశీలిస్తే.. ప్రతి సైబర్ నేరం వెనుక డబ్బులు మరింత భారీగా సంపాదించాలనే అత్యాశ.. మొదటికే మోసం తెచ్చే పరిస్థితి. తాజా ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. ఒక ఐటీ ఉద్యోగి భారీగా డబ్బులు కూడబెట్టాలన్న అత్యాశకు పోయి రూ.5వేల కోసం ఏకంగా రూ.2.9 కోట్లు పోగొట్టుకున్నారు. అదెేలా జరిగిందంటే..

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే 300 శాతం లాభం వస్తుందని ఆశ పెడుతూ.. నమ్మించారు సైబర్ బందిపోట్లు. వారి మాటల్ని పూర్తిగా నమ్మేశాడు ఐటీ ఉద్యోగి. సైబర్ నేరగాళ్ల సూచనల్ని పూర్తిగా ఫాలో అయ్యాడు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లికి చెందిన ఈ ఐటీ ఉద్యోగికి 45 ఏళ్లు. గత నవంబరు 12న వాట్సాప్ లో ఒక వెబ్ లింకు వచ్చింది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలని.. తాము పెట్టుబడులకు సలహాలు ఇస్తామని నమ్మబలికారు

వారి ట్రాప్ లో చిక్కుకున్న సదరు ఉద్యోగి వారు చెప్పినట్లే షేర్ల మీద సలహాలు తీసుకునేవాడు. అతడ్ని మరింతగా ఆకర్షించేందుకు.. తాము చేసిన సూచలనతో భారీగా లాభాల్ని పొందిన వారికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేసేవారు. డిసెంబరు 15న తొలిసారి రూ.50వేలు పెట్టుబడి పెట్టగా.. రూ.5వేలు లాభం వచ్చింది. అప్పటి నుంచి విడతల వారీగా మొత్తం రూ.2.9 కోట్లు బదిలీ చేశారు.

తాను పెట్టిన పెట్టుబడికి భారీగా లాభం వచ్చినట్లుగా చూపించారు. పెట్టుబడి.. లాభం మొత్తం కలిపి రూ.3.47 కోట్లుగా తేల్చారు. అయితే.. యాప్ లో కనిపిస్తున్న ఈ మొత్తం ఆన్ లైన్ లో మాత్రమే చూపించటం.. విత్ డ్రా వేసే వీలు లేని పిరిస్థితి. తనకు ఆన్ లైన్ లో సలహాలు ఇచ్చే అనిల్ ను సంప్రదించిన బాధితుడు.. తాను సంపాదించిన డబ్బునేు తిరిగి పొందాలంటే మరికొంత డబ్బులు చెల్లించాలని సూచన చేయటంతో.. అనుమానించిన అతను సైబర్ పోలీసుల్ని సంప్రదించారు. ఈ దారుణ మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లాభాల మాట విన్నంతనే వెనుకా ముందు చూసుకోకుండా పెట్టుబడులు పెట్టే కన్నా.. డబ్బులు ఊరికే రావన్న నగల వ్యాపారి యాడ్ ను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News