తల్లి, చెల్లి, తమ్ముడిని చంపి.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
సోమవారం ఉదయం 25 ఏళ్ల యువకుడు నేరుగా లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లి, చెల్లి, తమ్ముడిని హత్య చేశానంటూ లొంగిపోవడంతో ఈ భయానక కథ వెలుగులోకి వచ్చింది.;
లక్ష్మీనగర్‌లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక కుటుంబం, ఒక ఇంటి నాలుగు గోడల మధ్య, నిశ్శబ్దంగా అంతమైపోయిన ఈ విషాదం వెనుక దాగి ఉన్న కారణాలు పోలీసులను కూడా కలవరపెడుతున్నాయి. సోమవారం ఉదయం 25 ఏళ్ల యువకుడు నేరుగా లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లి, చెల్లి, తమ్ముడిని హత్య చేశానంటూ లొంగిపోవడంతో ఈ భయానక కథ వెలుగులోకి వచ్చింది.
నేరుగా స్టేషన్ వెళ్లిన నిందితుడు..
పోలీసులు నిందితుడు చూపించిన వివరాల ఆధారంగా అతడి ఇంటికి చేరుకోగా అక్కడ దృశ్యం గుండెను కలిచివేసింది. 46 ఏళ్ల తల్లి కవిత, 24 ఏళ్ల అక్క మేఘ్నా, 14 ఏళ్ల తమ్ముడు ముకుల్ మృతదేహాలు ఇంట్లో కనిపించాయి. మేఘ్నా ఓ ల్యాబ్‌లో పనిచేస్తుండగా, ముకుల్ ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి. ఈ ముగ్గురూ ఒకే ఇంట్లో, ఒకే విధంగా ప్రాణాలు కోల్పోవడం పోలీసులను సైతం షాక్‌కు గురిచేసింది. పోలీసుల విచారణలో నిందితుడిగా గుర్తించిన యశ్‌బీర్ సింగ్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. కుటుంబం ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదని, రోజూ గుడికి వెళ్లడం వారి అలవాటని స్థానికులు చెబుతున్నారు. అదే విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని, ప్రసాదంలో మత్తు పదార్థాలు కలిపిన లడ్డూలను వారితో తినిపించినట్లు యశ్‌బీర్ ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అవి తిన్న తర్వాత వారు స్పృహ కోల్పోయిన సమయంలో మఫ్లర్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు అతడు చెప్పినట్టు సమాచారం.
ఈ ఘోరం వెనుక కారణాలు ఇవేనా?
ఈ నేరం వెనుక ఆర్థిక ఒత్తిడే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. యశ్‌బీర్ గతంలో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేశాడు. కానీ ఆరు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్నాడు. అదే సమయంలో కుటుంబ పరిస్థితులు మారాయి. అతడి తండ్రి ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ, కొన్ని నెలల క్రితం హర్యానాలో వేరుగా ఉండడం మొదలుపెట్టాడు. ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే ఉండడంతో కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తి గత జీవితంలోనూ యశ్‌బీర్ తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. భార్యతో విభేదాల కారణంగా ఆమెను ఒక రోజు ముందే పుట్టింటికి పంపినట్లు సమాచారం. అంతేకాదు, రెండు నెలల్లో అతడు సుమారు రూ.1.5 కోట్ల జీవిత బీమా పాలసీ తీసుకున్నాడని, ఆ తర్వాత 4 నుంచి 5 సార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదాలు సృష్టించడం, పాముతో కాటు వేయించుకోవడం, శరీరంలో ఇంజక్షన్ తో గాలి పంపించుకోవడం వంటి ప్రమాదకర ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు బతికిపోయాడని పోలీసులు పేర్కొన్నారు.
ముందు రోజు గొడవపై విచారణ..
ముందు రోజు తల్లితో జరిగిన గొడవ కూడా ఈ ఘటనకు దారి తీసిందని యశ్‌బీర్ చెప్పినట్టు సమాచారం. తాను చనిపోవాలనుకుంటే ముందుగా కుటుంబ సభ్యులను చంపి, తర్వాత పరిణామాలు ఎదుర్కోవాలని తల్లి అన్నట్టుగా అతడు పోలీసులకు చెప్పాడని అధికారులు తెలిపారు. అయితే ఇవన్నీ నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే బయటకు వచ్చిన విషయాలని, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే నిజాలు స్పష్టమవుతాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కుటుంబం ఐదంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో అద్దెకు ఉండేది. పైఅంతస్తుల్లో ఇంటి యజమాని కుటుంబంతో నివసిస్తున్నాడు. పొరుగువారు ఈ కుటుంబాన్ని సొంత వారిగా భావించేవారు. రోజూ ఉదయం 5 గంటలకే గుడికి వెళ్లి నీళ్లు తర్పనం చేయడం, సాయంత్రం దీపం వెలిగించడం వారి నిత్యక్రియగా ఉండేదని ఆలయ పూజారి చెప్పారు. చివరిసారిగా ఆదివారం సాయంత్రం చిన్న పిల్లాడు ముకుల్ దీపం వెలిగించడానికి వచ్చినట్టు ఆయన గుర్తుచేశారు.
ఘటనా స్థలాన్ని క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కేవలం ఒక నేర కథ మాత్రమే కాదు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, మానసిక ఆరోగ్యం ఎంత ప్రమాదకరంగా మారవచ్చో చెబుతున్న భయానక హెచ్చరికగా మారింది.