బెయిల్ ఇప్పించి మర్డర్ చేసిన భార్య.. అదిరే ట్విస్టు ఏమంటే?

బంధాలు.. అనుబంధాల మధ్య గాఢత ఎంత తగ్గుతుందన్న దానికి ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.;

Update: 2026-01-24 04:55 GMT

బంధాలు.. అనుబంధాల మధ్య గాఢత ఎంత తగ్గుతుందన్న దానికి ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన తాజా ఉదంతం గురించి తెలిస్తే మాత్రం షాక్ తినాల్సిందే. జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి మరీ మర్డర్ చేసిన భార్య ఉదంతం ఒక ఎత్తు అయితే.. ఇందులో తమ్ముడి సాయం తీసుకోవటం మరో ఎత్తు. ఇదంతా తమ్ముడి స్నేహితుడితో ఉన్న వివాహేతర సంబంధంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేయటమని చెబుతున్నారు. మిస్టరీ హత్యను రెండురోజుల్లోనే పరిష్కరించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. తమ విచారణలో వెలుగు చూసిన వివరాల్ని వెల్లడించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

ప్రకాశం జిల్లాలోని పెద్దదోర్నాలకు చెందిన శ్రీను లారీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. పదిహేడేళ్ల క్రితం సున్నిపెంటకు చెందిన ఝాన్సీతో పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు. వ్యసనాలకు బానిసగా మారిన శ్రీను ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో తాను పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి సంపాదించేందుకు గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడు. ఇదిలా ఉండగా శ్రీను భార్య కూల్ డ్రింక్ షాపు నిర్వహించేది.

ఝూన్సీ సోదరుడి స్నేహితుడు కూల్ డ్రింక్ షాపునకు తరచూ వచ్చేవాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో వీరిద్దరి విషయంలో శ్రీను భార్యతో గొడవపడేవాడు. గంజాయి కేసులో జైలుకు వెళ్లిన శ్రీను.. తాను బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన ఝూన్సీ.. ఆమె సోదరుడు.. ప్రియుడు కలిసి శ్రీను హత్యకు ప్లాన్ చేశారు.

భర్తను మర్డర్ చేసేందుకు వీలుగా గుంటూరుకు చెందిన కిరాయి హంతకులకు రెండు లక్షలు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా ఒంగోలు సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న శ్రీను బెయిల్ వచ్చేలా చేశారు. అతను కారులో ఊరికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యలో మర్డర్ ప్లాన్ చేశారు. తొలుత చీమకుర్తి వద్ద హత్య చేయాలని భావించినా కుదర్లేదు. దీంతో పెద్దారవీడు సమీపంలో అంకాలమ్మ గుడి వద్దకు రాగానే కాసేపు విశ్రాంతి కోసం కారు ఆపారు.అనంతరం శ్రీను కళ్లల్లో కారం చల్లి.. రాళ్లు. కత్తులతో దారుణంగా హతమర్చారు. ఈ హత్య కేసును విచారించే క్రమంలో పోలీసులకు శ్రీను భార్య తీరుపై అనుమానం వచ్చింది. విచారణలో మొత్తం వెలుగు చూసింది. దీంతో ఝూన్సీని.. ఆమె సోదరుడ్ని.. ప్రియుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. హత్య చేసిన కిరాయి హంతుకులు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News