ఆస్తి కోసం అక్కను ముక్కలు చేశాడీ దుర్మార్గుడు

అనంతరం లీలాదేవి కనిపించటం లేదని ఈ నెల ఎనిమిదిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు పప్పురామ్ కంప్లైంట్ చేశాడు;

Update: 2026-03-19 04:07 GMT

ఆస్తి మీద కన్నేసిన దుర్మార్గుడు అమానుషంగా వ్యవహరించాడు. అక్కను అంతమొందించే ఘాతుకానికి పాల్పడ్డాడు. అంతేనా.. ఆమెపై వ్యక్తిగతంగా నిందలు వేసిన వైనం చూస్తే..అయ్యో అనిపించక మానదు. ఈ అమానుష ఉదంతానికి హైదరాబాద్ వేదికగా మారింది. పోలీసులు.. స్థానికుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన 40 ఏళ్ల లీలాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఎల్ బీ నగర్ ప్రాంతంలో నివసించేది. జీవనోపాధి కోసం వారు కిరాణా షాప్ నిర్వహించేవారు.

లీలాదేవి భర్త 2018లో చనిపోయాడు. దీంతో ఇద్దరు పిల్లల బాధ్యత ఆమె మీద పడింది. ఈ క్రమంలో ఆమెకు వరుసకు సోదరుడు అయ్యే ప్పురామ్ కుమావత్ అండగా నిలుస్తానని ముందుకు వచ్చాడు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం ప్రాంతంలో ఆమెతో కలిసి 120 గజాల ఇంటిని కొన్నారు. దీన్నిపప్పురామ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాటసింగారం ప్రాంతంలో కిరాణా షాపు నిర్వహిస్తూ పప్పురామ్ ఫ్యామిలీతో పాటు లీలాదేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

ఇటీవల పప్పు రామ్ ను ఇంటి గురించి అడిగింది. దీంతో లీలాదేవి అడ్డు తొలగిస్తే ఇంటితో పాటు ఆమె ఆస్తి తనకే దక్కుతుందని అత్యాశకు పోయిన పప్పురామ్ దారుణమైన ప్లాన్ వేశాడు. గత నెల 28న పిల్లలు స్కూల్ కు వెళ్లిన సమయంలో తన షాపులో పని చేసే రాజేశ్ కుమావత్.. సునీల్ కుమార్ సాయంతో లీలావతిని దారుణంగా హత్య చేశాడు. చంపేసిన తర్వాత డెడ్ బాడీని ఇంట్లోనే దాచాడు. తమ పథకంలో భాగంగా ఆమెపై నిందలు వేసి బంధువుల్ని నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు.

మార్చి రెండున లీలాదేవి డెడ్ బాడీని మజీద్ పూర్ సమీపంలోని చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి.. రెండు ముక్కలుగా కోసి.. నడుము పై భాగాన్ని తూము ముందు పడేసి.. మరో భాగాన్ని చెరువు ప్రాంతంలో వేశారు. అనంతరం లీలాదేవి కనిపించటం లేదని ఈ నెల ఎనిమిదిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు పప్పురామ్ కంప్లైంట్ చేశాడు. విచారణలో భాగంగా పప్పురామ్.. రాకేశ్ కుమావత్.. సునీల్ కుమార్ లను ప్రశ్నించగా.. తేడాగా సమాధానాలు చెప్పటంతో మరింత లోతుగా విచారించటంతో అసలు వివరాలు వెలుగు చూశాయి. ఘటనాస్థలానికి తీసుకెళ్లి డెడ్ బాడీని రికవరీ చేశారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆస్తి కోసం ఇంత ఘాతుకానికి పాల్పడిన ఇతగాడి ఉదంతం సంచలనంగా మారింది.


Tags:    

Similar News