దారుణ మోసం: రూ.2కోట్లు కొట్టేసి రూ.613 లాభాన్ని చేతికిచ్చారు

ఆన్ లైన్ పరిచయాలు.. స్నేహాలు.. అత్యంత ప్రమాదకరమైనవన్న విషయాన్ని అస్సలు మిస్ కాకూడదు. భారీగా లాభాలు వస్తాయంటూ చెప్పే మాయమాటల ట్రాప్ లో పడితే మొదటికే మోసం వస్తుంది.;

Update: 2026-01-23 06:25 GMT

ఆన్ లైన్ పరిచయాలు.. స్నేహాలు.. అత్యంత ప్రమాదకరమైనవన్న విషయాన్ని అస్సలు మిస్ కాకూడదు. భారీగా లాభాలు వస్తాయంటూ చెప్పే మాయమాటల ట్రాప్ లో పడితే మొదటికే మోసం వస్తుంది. రోజు రోజుకు కరుడు కడుతున్న సైబర్ నేరగాళ్లు కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. అత్యాశను ఆయుధంగా మార్చి.. ఎదుటోళ్ల బలహీనల మీద ఆడే ఆటకు పలువురు బలి అవుతున్నారు. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి ఒకరిని దారుణంగా మోసం చేసి రూ.2కోట్లు కొట్టేసి వైనంలోకి వెళితే..

హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీకి చెందిన ఒక ఐటీ ఉద్యోగి సైబర్ నేరస్తుల చేతిలో దారుణంగా మోసపోయాడు. నలభైనాలుగేళ్ల అతనికి గత ఏడాది డిసెంబరులో సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరస్తుడు ఒక మహిళగా పరిచయం చేసుకున్నాడు. తాను స్టాక్ ట్రేడింగ్ ద్వారా భారీగా లాభాలు సంపాదిస్తున్నట్లుగా సదరు ‘మహిళ’ పేర్కొంది.

ఆ మాయ మాటల్ని నమ్మిన ఐటీ ఉద్యోగి.. తాను సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో.. సదరు మాయలేడీ ఒక యాప్ డౌన్ లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించారు. డిసెంబరు 12న తొలిసారి రూ.31.5 లక్షల పెట్టుబడి పెట్టగా భారీగా లాభాలు చూపించారు. మరిన్ని పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని చెప్పటంతో రెండోసారీ రూ.42.27 లక్షలు బదిలీ చేశారు. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా.. లాభంలో 30 శాతం పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుందని చెప్పి.. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

లాభాల మత్తులో జరుగుతున్న మోసాన్ని గుర్తించలేని సదరు ఐటీ ఉద్యోగి వర్చువల్ గా కనిపిస్తున్న లాభాల్ని చూపించి తన ఆఫీసులోని కోలీగ్స్ నుంచి రూ.90 లక్షలు అప్పుగా తీసుకొని పంపారు. కుటుంబ సభ్యుల దగ్గర కొంత నగదు తీసుకోవటంతో పాటు కొన్ని ఆస్తులు అమ్మి మొత్తంగా ఎనిమిది విడతలుగా రూ.2.14 కోట్లు పంపాడు. డబ్బు విత్ డ్రా కోసం ప్రయత్నించగా అదనంగా రూ.68 లక్షలు కట్టాలని చెప్పటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించాడు.

సదరు మహిళ ఫోటోను నెట్ లో వెతగ్గా.. సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి సేకరించినట్లుగా తేలింది. దీంతో తాను దారుణంగా మోసపోయినట్లుగా గుర్తించిన సదరు ఉద్యోగి సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ మొత్తం ఉదంతంలో విషాదకరమైన కొసమెరుపు ఏమంటే.. అతడికి వచ్చిన లాభంలో కేవలం రూ.613 మాత్రమే బదిలీ చేయటం. అధిక లాభాలు.. అతి తక్కువ వ్యవధిలో భారీగా సంపాదించొచ్చన్న మాటల్ని అస్సలు నమ్మకూడదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు అనుక్షణం గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News