కరెంటు కోతల వేళ అధికారులకు ఎమ్మెల్యే మార్క్ షాక్ వైరల్..!

నిరంతర కరెంట్ కోతలు ఎంత చికాకు రప్పిస్తాయనే సంగతి చాలామందికి అనుభవమే. ప్రధానంగా వేసవి కాలాల్లో గ్రామాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా చేసే విద్యుత్ కోతలు ఒక్కోసారి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంటాయి.;

Update: 2025-12-25 08:55 GMT

నిరంతర కరెంట్ కోతలు ఎంత చికాకు రప్పిస్తాయనే సంగతి చాలామందికి అనుభవమే. ప్రధానంగా వేసవి కాలాల్లో గ్రామాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా చేసే విద్యుత్ కోతలు ఒక్కోసారి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. చేసేది ఏమీ లేక, ఏమీ చేయలేక జనం అలానే ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మగ్గిపోతుంటారు. అదే చికాకు, ఆగ్రహం ఎమ్మెల్యేకి వస్తే..? దీనికి సమాధానం ఉత్తరాఖండ్ లో వెలుగులోకి వచ్చింది.

అవును... అదే పనిగా అస్తమానం కరెంటు కోతలు విధిస్తుండటంతో విసుగు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్ట్రాంగ్ గా, విభిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా.. కరెంటు స్తంభం ఎక్కి నిరసన తెలిపిన ఆయన.. అనంతరం విద్యుత్‌ శాఖకు చెందిన ముగ్గురు అధికారుల ఇళ్లకు వెళ్లే కరెంటు తీగలను కట్ చేసి, విద్యుత్ నిలిపివేశారు. ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... హరిద్వార్ జిల్లాలోని ఝుబ్రేడా కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర.. విద్యుత్ కోతలతో విసిగు చెందారంట. దీంతో తన మద్దతుదారులను వెంటపెట్టుకుని బయలుదేరిన ఆయన.. ఓ నిచ్చెన, కొన్ని ఎలక్ట్రికల్ పనిముట్లతో రూర్కీకి వచ్చారు. ఈ సమయంలో.. ఫస్ట్ బోట్ క్లబ్ లోని సూపరింటెండెంట్ ఇంజనీర్ వివేక్ రాజ్ పుత్ అధికారిక నివాసం వెలుపల ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి.. ఆయన ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు.

అనంతరం.. అక్కడ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే కాన్వాయ్‌.. చీఫ్ ఇంజనీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్ పాండే అధికారిక నివాసాలకు చేరుకుంది. అక్కడ వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్‌ ను కూడా కట్ చేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా స్పందిస్తూ.. తన ప్రాంతంలో రోజుకు ఐదు నుండి ఎనిమిది గంటలు అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయని, దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

చాలా రోజులుగా విద్యుత్ కోతల అంశాన్ని ఆ శాఖలో లేవనెత్తుతున్నానని.. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. కేవలం ఒక గంట విద్యుత్ కోత తర్వాత అధికారులు దయనీయ స్థితిలో ఉన్నారని, మరి ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి విద్యుత్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్ధం చేసుకోవాలని చెబుతూ ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు.. ఎమ్మెల్యే చేసిన పనికి షాకైన అధికారులు.. రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సరైన షట్‌ డౌన్ లేకుండా విద్యుత్ లైన్లను కత్తిరించారని, ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని.. ఇది నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రభుత్వ పనిలో ప్రత్యక్ష జోక్యం కూడా అని అధికారులు ఆరోపించారు.

Tags:    

Similar News